Suryaa.co.in

Telangana

బీసీల సీట్లను కోట్లకు అమ్ముకొని అగ్రవర్ణాలకు కట్టబెట్టిన కాంగ్రెస్

కాంగ్రెస్ అహంకారానికి అడ్డూ అదపు లేదు
రైతులను అవమానించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి
సీట్లు అమ్ముకొని రేవంత్ రెడ్డి పేరును రేటెంత రెడ్డిగా మార్చుకున్నారు
పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు …సీఎం కేసీఆర్ ను చూసి రెండు సీట్లలో పోటీ చేస్తూ ఈటల, రేవంత్ వాతలు పెట్టుకున్నారు
వాళ్లకు మిలిగేవి వాతలే కానీ ఫలితాలు కాదు
కామారెడ్డిలో ఖాళీ కుర్చీలను ఉద్దేశించి ప్రసంగించిన రేవంత్
కాంగ్రెస్ పాలనపై కర్నాటక ప్రజలు దుమ్మెత్తిపోస్తుంటే ఆ సీఎం ఇక్కడికొచ్చి ఏవేవో చెబుతున్నారు
మూడోసారి ముఖ్యమంత్రి అయ్యి సీఎం కేసీఆర్ రికార్డు సృష్టిస్తారు
గోసంగి కుల ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్సీ కవిత

 

నిజామాబాద్ : బీసీల సీట్లను కోట్లకు అమ్ముకొని అగ్రవర్ణాలకు కాంగ్రెస్ పార్టీ టికెట్లను కట్టబెట్టిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. సీట్లు అమ్ముకొని రేవంత్ రెడ్డి పేరును రేటెంత రెడ్డిగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అహంకారానికి అడ్డూ అదపు లేకుండా పోతుందని, రైతులను పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అవమానించారని చెప్పారు.

కామారెడ్డిలో ఖాళీ కుర్చీలను ఉద్దేశించి రేవంత్ రెడ్డి ప్రసంగించారని చెప్పారు. కాంగ్రెస్ పాలనపై కర్నాటక ప్రజలు దుమ్మెత్తిపోస్తుంటే ఆ సీఎం ఇక్కడికొచ్చి ఏవేవో చెబుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి అయ్యి రికార్డు సృష్టిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

నిజామాబాద్ లో జరిగిన గోసంగి కుల ఆత్మీయ సమ్మేళనంలో కల్వకుంట్ల కవిత పాల్గొని కవిత గారు ప్రసంగించారు. సీట్లు అమ్ముకొని రేవంత్ రెడ్డి పేరును రేటెంత రెడ్డిగా మార్చుకున్నారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉన్న 8 జనరల్ సీట్లకు గానూ గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీలకు నాలుగు సీట్లు ఇచ్చిందని, ఈ సారి ఒక్క సీటు కూడా ఇవ్వలేదని తెలిపారు. బీసీల సీట్లను కోట్ల రూపాయలకు అమ్ముకొని మొత్తానికి మొత్తం కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణాలకు అప్పగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక్క సీటు బీసీలకు ఇవ్వని జిల్లాకు వచ్చి బీసీ డిక్లరేషన్ చేయడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. రైతు బంధును రైతులకు వేస్తున్న బిచ్చం అని రేవంత్ రెడ్డి అంటున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నాయకుల అహంకారానికి అడ్డూ అదుపు లేకుండా పోతుందని, అధికారంలో లేనప్పుడే ఇంత అహంకారాన్ని ప్రదర్శిస్తుంటే ఇక పొరపాటున అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతల పనులు ఎలా ఉంటాయో ఆలోచించాలని కోరారు.

రేవంత్ రెడ్డి కామారెడ్డికి వచ్చి కాలుదువ్వుతున్నారని విమర్శించారు. “కేసీఆర్ సీఎం కాబట్టి రకరకాల వ్యూహాల వల్ల రెండు సీట్లలో పోటీ చేస్తున్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లగా సీఎం కేసీఆర్ ను చూసి బీజేపీ నేత ఈటల రాజేందర్, కాంగ్రెస్ నుంచి రేవంత్ రెడ్డి రెండు చోట్ల పోటీకి దిగారు. వారికి వాతలు మిగులుతాయి కానీ ఫలితం మాత్రం రాదు” అని వ్యాఖ్యానించారు.

రేవంత్ రెడ్డి కామారెడ్డికి వచ్చి ఖాళీ కుర్చీలను ఉద్దేశించి ప్రసంగించారని ఎద్దేవా చేశారు. కర్నాటక ప్రజలు అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తుంటే ఆ రాష్ట్ర సీఎం సిద్దరామయ్య తెలంగాణకు వచ్చి బీసీలకు అవి చేస్తామని ఇవి చేస్తామని చెబుతున్నారని విమర్శించారు. కరెంటు లేక, సాగు నీళ్లు లేక, ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలవ్వడం లేదని వివరించారు.

సీఎం కేసీఆర్ ను ఆశీర్వదించి మరోసారి బీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటి వరకు దక్షిణ భారత దేశంలో ఎవ్వరూ వరుసగా మూడో సారి ముఖ్యమంత్రి కాలేదని, సీఎం కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యి రికార్డు సృష్టిస్తారని ధీమా వ్యక్తం చేశారు.

గోసంగి సామాజిక వర్గానికి చెందిన వారందరికీ దళితల కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అన్నీ పథకాల ప్రయోజనాలు అందుతాయని తెలిపారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా బీడీ కార్మికులకు సీఎం కేసీఆర్ పెన్షన్లు ఇస్తున్నారని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల మందికి పెన్షన్లు అందిస్తున్నారని చెప్పారు. ఎన్నికల తర్వాత కటాఫ్ డేట్ ను పొడిగించి అందరికీ పెన్షన్లు అందేలా సీఎం కేసీఆర్ చర్యలు తీసుకుంటారని స్పష్టం చేశారు. ప్రస్తుతం నెలకు వస్తున్న రూ. 2 వేల పెన్షన్ రానున్న ఐదేళ్లలో రూ. 5 వేలకు పెరుగుతుందని, ఎన్నికలు పూర్తయిన వెంటనే రూ. 3 వేలకు చేరుతుందని వివరించారు.

కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రూ. 400 గా ఉన్న గ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ. 1200 కు చేరిందని, పేద ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గించడానికి రూ. 400కే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో మూడు డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉండేవని, ఇవాళ 104కు తీసుకుళ్లామని చెప్పారు. కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్, కేసీఆర్ కిట్, న్యూట్రీషియన్ కిట్, మిషన్ భగీరథ వంటి పథకాల గురించి వివరించారు.

ఇంటింటి నల్లా కనెక్షన్లు ఇచ్చి ఆడబిడ్డలను కష్టాల నుంచి బయటపడేసిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇవ్వకపోతే ప్రజలను ఓటే అడగమని గత ఎన్నికల ముందు సీఎం కేసీఆర్ అన్నారని, అలా సవాలుగా తీసుకొని కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారన్నారు. ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రజలు ఏం అనుకుంటున్నారన్నది చాలా ప్రభుత్వాలు మరిచిపోతాయని, కానీ సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు అన్ని సమస్యలను తెలుసుకొని తక్షణమే పరిష్కరిస్తారని చెప్పరు.

కాంగ్రెస్ పార్టీల పాలన ఏలా ఉండే.. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో పోల్చుకొని చూడాలని కోరారు. తాము యువకులకు జాబ్ మేళాలు నిర్వహించామని, ఐటీ పరిశ్రమలను నిజామాబాద్ కు తీసుకొచ్చిన ఘనత మన సీఎం కేసీఆర్ దని స్పష్టం చేశారు. ఎన్నికలు ఉన్నా లేకుండా ప్రజలు కోసం బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ నిలుస్తుందని తెలిపారు.

 

LEAVE A RESPONSE