– కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఇచ్చిన ఎన్డీఎస్ఏ మోడీ చేతిలో తోలుబొమ్మ
– సీబీఐ కూడా తోలుబొమ్మే
– బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీష్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణకు వరప్రధాయని అయిన కాళేశ్వరం ప్రాజెక్టు మీద జరుగుతున్న తతంగం అంతా.. రేవంత్ రెడ్డి, మోడీ కలిసి చేస్తున్న కుట్ర అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి ఆరోపించారు. సంక్షేమ ఫలాలతో దేశానికే తెలంగాణను రోల్ మోడల్ గా నిలిపిన బీఆర్ఎస్ పార్టీని ఖతం చేయాలని రేవంత్ రెడ్డి ద్వారా మోడీ కుట్ర చేస్తున్నారని అన్నారు. కమిషన్ రిపోర్ట్ చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతోందని తెలిపారు.
కాళేశ్వరంపై అంతా కమిషన్ చూసుకుంటుందని మొదట రేవంత్ రెడ్డి చెప్పారన్నారు. కానీ చర్యలకు సంబంధించి ప్రభుత్వానిదే నిర్ణయం అని ఘోష్ చెప్పారని వివరించారు. రేవంత్ రెడ్డి దీనిని తీసుకెళ్లి మోడీ పెంపుడు చిలుక అయిన సిబిఐ చేతిలో పెడుతున్నారని విమర్శించారు. మోడీ చెప్పినట్టు సీబీఐ అవుతుందన్నారు.
దీనికితోడు.. అర్థరాత్రి అసెంబ్లీలో చర్చించి.. రెండు గంటలకు సభ ముగించి.. అప్పుడే అసెంబ్లీ ప్రతులు తయారు చేశారని.. ఉదయం 10 గంటల లోపే సీబీఐకి అప్పగించారన్నారు. ఇంత ఆగమేఘాల మీద సభ పెట్టి.. అర్థరాత్రి సమయంలో చర్చించి.. తెల్లవారగానే సీబీఐకి అప్పగించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. ఏ కుట్రా లేకపోతే.. సర్కారుకు, రేవంత్ రెడ్డికి ఎలాంటి దురుద్దేశం లేకపోతే అంత ఆగమాగం చేయాల్సిన అవసరం ఏంటన్నారు.
గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఇచ్చిన ఎన్డీఎస్ఏ మోడీ చేతిలో తోలుబొమ్మ అని.. ఇప్పుడు సీబీఐ కూడా తోలుబొమ్మేనని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి తాను కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రినని చెప్పుకుంటూ.. పూర్తిగా మోడీ చేత.. మోడీ కొరకు.. మోడీ వలన పనిచేస్తున్నారని సతీష్ రెడ్డి ఆరోపించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు కేసీఆర్ చేసిన మంచి ఏంటో ప్రజలందరికీ తెలునన్నారు. అలాగే రేవంత్ రెడ్డి, బీజేపీ కలిసి ఆడుతున్న నాటకం ప్రజలకు తెలిసిపోయిందని, వారికి ప్రజాక్షేత్రంలోనే శిక్ష పడుతుందని చెప్పారు.