– విలువైన భూములు కాజేసేందుకే జీవో:15
– దరఖాస్తు చేస్తే చాలు! భూములు ఇచ్చేస్తారట
– ధార్మిక సంస్థల ముసుగులో భూదోపిడికి వ్యూహం
– ఒబెరాయ్ గ్రూప్‌నకు ఇంకా విలువైన భూమి:
– వైయస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డి
తాడేపల్లి: దేవదాయ శాఖ ఆధీనంలోని భూములు, స్థలాలను ఎలాంటి బహిరంగ వేలం లేకుండా లీజుకివ్వడం, ఇప్పటికే ఉన్న లీజులను పొడిగించేందుకు అనుమతిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవో: 15 చూస్తుంటే ధార్మిక సంస్థల ముసుగులో విలువైన భూములను టీడీపీ నాయకులకు పప్పు బెల్లాలకు కట్టబెట్టేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమైనట్లు తేలుతోందని వైయస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకట్‌రెడ్డి స్పష్టం చేశారు.
దరఖాస్తు చేస్తే చాలు, భూములు ఎలా ఇస్తారని.. సనాతన ధర్మ పరిరక్షకుడిగా తనను తాను ప్రమోట్ చేసుకునే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ క్యాబినెట్లో ఇలాంటి నిర్ణయాన్ని ఎలా ఆమోదిస్తారని.. ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ కూటమి ప్రభుత్వంలో అడుగడుగునా హిందూ ధర్మాన్ని, ఆలయ పవిత్రతను మంట కలిపేస్తున్నారని గుర్తు చేశారు. తప్పులన్నీ వారు చేస్తూ ఆధ్యాత్మిక విధ్వంసం చేస్తున్నారని జగన్‌గారిని నిందించడం సిగ్గుచేటు అని దుయ్యబట్టారు.
సీఎం చంద్రబాబుకు దమ్ముంటే ఈ 18 నెలల్లో ఆలయాల్లో జరిగిన అపశృతులు, దారుణాలు, అపవిత్రమైన ఘటనలు, ఆలయాల ముసుగులో జరుగుతున్న దోపిడీ వ్యవహారాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. అందుకు సీఎం సిద్ధమా? అని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన కారుమూరి వెంకట్‌రెడ్డి సవాల్ చేశారు.
దేవాదాయ శాఖ భూములను అప్పనంగా టీడీపీ నాయకులకు దోచిపెట్టడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం జీవో నెంబర్:15 జారీ చేసింది. అంతకు ముందున్న జీవో నెం:426 ప్రకారం ఆలయ భూములు లీజుకు ఇవ్వాల్సి వస్తే వేలం ద్వారా మాత్రమే దక్కించుకోవాల్సి ఉంటుంది. కానీ సింగిల్ దరఖాస్తుతో ధార్మిక సంస్థల పేరుతో వేలాది ఎకరాల భూములను అప్పనంగా కట్టబెట్టడం కోసం కూటమి ప్రభుత్వం జనవరి 9న జీఓ నెం:15 జారీ చేసింది. తనకు తాను సనాతన ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ కూడా హాజరైన క్యాబినెట్ దానికి ఆమోదం తెలిపింది.
దేవాదాయ శాఖకు రాష్ట్రంలో 4.67 లక్షల ఎకరాల భూమి ఉంది. వాటిలో పట్టణ ప్రాంతాల్లో ఎకరం రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల విలువ చేసే అత్యంత ఖరీదైన భూములు 4,244 ఎకరాలు ఉండగా, వాటిని తన వారికి దోచిపెట్టడం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
4,244 ఎకరాలంటే 2,05,40,960 చదరపు అడుగుల స్థలాలు. వీటిలో 1.55 కోట్ల చదరపు అడుగుల స్థలాలు ఖాళీగా ఉన్నాయి. 50 వేల చదరపు అడుగుల భవనాల రూపంలో ఉన్నాయి. వీటన్నింటినీ వారికి సంబంధించిన వ్యక్తులకు పప్పు బెల్లాలకు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.
దేవదాయ శాఖ ఆధీనంలోని వివిధ ఆలయాలు, సత్రాలు, మఠాలు, ఇతర ధార్మిక సంస్థల పేరిట ఉన్న విలువైన వ్యవసాయేతర భూములు, స్థలాలను ఎలాంటి బహిరంగ వేలం లేకుండా లీజుకివ్వడం, ఇప్పటికే ఉన్న లీజులను పొడిగించేందుకు అనుమతిస్తూ కూటమి ప్రభుత్వం నిన్న (9వ తేదీ, శుక్రవారం) ఆదేశాలు జారీ చేసింది. లాభాపేక్ష లేకుండా 20 ఏళ్ల పాటు ధార్మిక కార్యక్రమాలు నిర్వహించిన సంస్థలు కేవలం దరఖాస్తు చేసుకుంటే చాలు.. ఐదేళ్ల వరకు లీజుకివ్వడం లేదంటే పాత లీజులు పొడిగించే అధికారాన్ని దేవదాయ శాఖ కమిషనర్‌కు కల్పించింది.
లీజు ఐదేళ్లకు మించితే ఆ అధికారాన్ని దేవదాయ శాఖ మంత్రి చైర్మన్‌గా ఉండే ధార్మిక పరిషత్‌కు కల్పించింది. దేవాదాయ శాఖ గతంలో జారీ చేసిన జీఓ:426 ప్రకారం ఆలయాలకు చెందిన వ్యవసాయేతర భూములను కేవలం బహిరంగ వేలం ద్వారా మాత్రమే లీజుకు ఇవ్వాల్సి ఉంది. కానీ, ఇప్పుడు జారీ చేసిన జీఓ:15 అందుకు పూర్తి విరుద్ధంగా, అవినీతికి తెర ఎత్తేలా ఉంది.
అదే తిరుపతిలో దాదాపు రూ.3 వేల కోట్ల విలువ చేసే టీటీడీకి చెందిన భూమిని బీఆర్ నాయుడు ఛైర్మన్‌గా ఉన్న బోర్డు.. కేవలం రూ.25 కోట్లకే స్వర హోటల్ ప్రైవేట్ లిమిటెడ్‌కి ధారాదత్తం చేసింది. రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం చూసినా ఆ భూమి విలువ రూ.350 కోట్లకు పైనే.
కాగా, ప్రజలను మభ్యపెట్టడానికి మాత్రం ఒబెరాయ్ గ్రూప్‌నకు చెందిన ముంతాజ్ హోటల్‌కు గతంలో పేరూరులోని సర్వే నెం:604 లో ఇచ్చిన 24.68 ఎకరాల భూమిని రద్దు చేస్తున్నట్లు, గత ఆగస్టు 7న ఆదేశాలు జారీ చేశారు.
హోటల్ పేరు ముంతాజ్ అనేది తిరుమల ఆధ్యాత్మిక భావనకు విరుద్ధం కాబట్టి, ఆ నిర్ణయం తీసుకున్నట్లు అప్పుడు ప్రకటించారు. కానీ, ఇప్పుడు మళ్లీ అదే ఒబెరాయ్ గ్రూప్‌నకు అంతకన్నా విలువైన ప్రాంతంలో, అలిపిరి దగ్గరలో, శ్రీవారి దివ్యముఖ ద్వారానికి దగ్గరలో, తిరుపతి అర్బన్ పరిధిలో, సర్వే నెం:588/ఏ లో ఉన్న 25 ఎకరాల భూమిని కేటాయించారు.