ఒక ఎంపీ పైన సుమారు 8 నెలల కిందట సిఐడి కేసు పెట్టి, ఆ కేసు పేరుతో హైదరాబాద్ నుంచి మంగళగిరి లోని కార్యాలయానికి తీసుకువచ్చి ఆయనను దారుణంగా కొట్టి హతమార్చాలని చూశారన్న విషయం సంచలనమైంది. కొట్టిన గాయాలున్నట్లు సికింద్రాబాద్ లోని మిలిటరీ హాస్పిటల్ సర్టిఫికెట్ ఇచ్చినా ఇంతవరకు చర్యల్లేవు.పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ లో ఫిర్యాదు చేసినా, పార్లమెంట్ ప్రివిలేజ్ కమిటీ లోనూ చర్యల్లేవు.
సిఐడి దుర్మార్గ వైఖరిపై సీబీఐ విచారణ కోరుతూ, సుప్రీంకోర్టులో కేసు వేసినా అదీ అతీగతీ లేదు. కక్ష సాధింపులకు పాల్పడుతున్న జగన్ రెడ్డి, తనపై ఉన్న అవినీతి కేసులలో వాయిదాలకు రావాల్సిందేనంటూ తెలంగాణ హైకోర్టులో కేసు వేసినా, అది ఇంతవరకు అతీగతీ లేదు. జగన్ రెడ్డి పై ఉన్న అవినీతి కేసులు నమోదై 12 సంవత్సరాలవుతున్నా ఆ కేసుల్లోనూ పురోగతి లేదు. కేసుల పురోగతిలో విపరీతమైన జాప్యంతో నిందితులు రాజ్యాధికారులై రాజ్యాలనేలుతుంటే.. చేవ చచ్చి, చేష్టలుడిగి ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలోకి రాజ్యాంగ వ్యవస్థలు నెట్టివేసినట్లయింది.
ఒక MPని వెంటాడి వేధిస్తూ అతని పై అక్రమ కేసులు పెట్టి చంపడానికి కూడా సిద్ధపడుతున్న ఈ సమాజంలో విఫలమైన రాజ్యాంగ వ్యవస్థలు, విఫలమైన పోలీసు వ్యవస్థలు, అడ్డూ ఆపూ లేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దుర్మార్గ వైఖరితో రక్షణ లేని సమాజంలో బతుకుతున్నాం.
రాష్ట్రప్రభుత్వ దుర్మార్గ వైఖరి పై పోరాటం చేస్తున్న రఘురామ కృష్ణం రాజుకు అండగా నిలబడాల్సిన బాధ్యత ఈ సమాజానిదే. గౌరవనీయ పార్లమెంట్ సభ్యుడిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యవాదులందరి భుజస్కందాలపై ఉంది.
కొద్దిరోజుల కిందట హైదరాబాద్ వచ్చిన రఘురామకృష్ణంరాజుపై రెక్కీ నిర్వహించి, ఒక టెర్రరిస్టును చూసినట్లు చూస్తూ ,అక్రమంగా అరెస్టు చేసి తీసుకు వెళ్ళడానికి ప్రయత్నించిన ఆంధ్రప్రదేశ్ పోలీసుల దుర్మార్గ వైఖరిని అందరం ఖండించాలి.
– రామ్మోహన్, సీనియర్ జర్నలిస్టు