Suryaa.co.in

Andhra Pradesh

మూడు నెలల్లో టిడ్కో ఇళ్లకు మౌళిక వసతుల కల్పన

  • ప్రస్తుతం సీఆర్థీయే లో ఒక్క పైసా కూడా లేదు
  • గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను నాశనం చేసింది
  • కారణం లేకుండానే టిడ్కో ఇళ్లను తగ్గించేసింది
  • రాజధాని రైతులకు త్వరలోనే కౌలు డబ్బులు విడుదల చేస్తామని సీఎం చెప్పారు
  • రాజధానిలో టిడ్కో ఇళ్ల పరిశీలన తర్వాత మీడియా తో మాట్లాడిన మంత్రి నారాయణ

మందడం: గత ప్రభుత్వం టిడ్కో ఇళ్లను నాశనం చేసిందని మున్సిపల్,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు . ప్రతి మహిళ తన కుటుంబంతో ఆనందంగా గడిపే లా టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టామని అన్నారు. గత ప్రభుత్వ నిర్వాకంతో ప్రజలు ఇబ్బందులు పడాల్సి వచ్చిందని ఆరోపించారు.

సోమవారం ఉదయం రాజధానిలోని టిడ్కో ఇళ్లను మంత్రి నారాయణ పరిశీలించారు. స్థానిక ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్, సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్,టిడ్కో ఎండీ సాయి కాంత్ వర్మ తో కలిసి మందడం,దొండపాడు గ్రామాల్లోని టిడ్కో ఇళ్లను పరిశీలించారు. నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టిడ్కో గృహ సముదాయాలు పరిసరాలను పరిశీలించారు. మౌళిక వసతులు ఎంత మేర ఉన్నాయో పరిశీలించారు. దొండపాడు లో టిడ్కో ఇళ్లను పరిశీలించిన తర్వాత మీడియా తో మంత్రి నారాయణ మాట్లాడారు.

2014 – 2019 మధ్యలో నిరుపేదల కోసం హై క్వాలిటీ ఇళ్లను నిర్మించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నుంచి 7 లక్షల 1481 ఇళ్లకు అనుమతి తీసుకొచ్చినట్లు మంత్రి చెప్పారు. టిడ్కో ద్వారా ఇళ్లు నిర్మించెలా 5 లక్షలకు పాలనాపరమైన అనుమతులు జారీ చేశామని చెప్పారు. వీటిలో స్థలం ఉన్న చోట ముందుగా 4,54,704 ఇళ్లకు టెండర్లు పిలిచామని, మిగిలిన వాటికి స్థలం ఎంపిక చేయాలని కలెక్టర్లకు సూచించామన్నారు.

టెండర్లు పిలిచిన వాటిలో 3 లక్షల 13 వేల 832 ఇళ్లు నిర్మాణం ప్రారంభం కాగా….77 వేల 371 ఇళ్లు 90 నుంచి 100 శాతం పూర్తయినట్లు మంత్రి తెలిపారు. మరో 64,245 ఇళ్లు 50 నుంచి 75 శాతం,49,325 ఇళ్లు 25 నుంచి 50 శాతం పూర్తయ్యాయని చెప్పారు.

ఇక లక్షా 22 వేల ఇళ్లు 10 నుంచి 25 శాతం లోపు గతంలోనే పూర్తయ్యాయని అన్నారు. మొత్తం ఇళ్లను గత వైసీపీ ప్రభుత్వం 2 లక్షల 62 వేల 216 కు తగ్గించడమే కాక కేవలం లక్షా 67 వేల ఇళ్లు మాత్రమే పూర్తి చేసిందని విమర్శించారు..వీటిలోనూ 77 వేల ఇళ్లు తమ హయాంలో నిర్మాణం పూర్తి చేసినట్లు చెప్పారు.

టిడ్కో గృహాలు,కిటికీలు,తలుపులు అన్నీ హై క్వాలిటీ తో ప్లాన్ చేశామన్నారు.గృహ సముదాయాలు వద్ద భూగర్భ డ్రైనేజీ,షాపింగ్ కాంప్లెక్స్,అంగన్వాడీ స్కూల్,కమ్యూనిటీ హాల్ ఉండేలా డిజైన్ చేశామన్నారు. 2019 లో వచ్చిన వైసిపి ప్రభుత్వం ఈ స్కీం ను పూర్తిగా నాశనం చేసిందని మండిపడ్డారు. రాజధానిలోని టిడ్కో గృహాల కు వచ్చే మూడు నెలల్లో పూర్తి స్థాయిలో మౌళిక వసతులు కల్పించేలా ముందుకెళ్తున్నమన్నారు.

వైసీపీ ప్రభుత్వం ప్రజలు కట్టిన ఇంటిపన్ను,నీటి పన్ను వంటి అన్ని రకాల పన్నుల ద్వారా వచ్చే ఆదాయం కూడా వాడేసిందన్న మంత్రి…ఆసియన్ ఇన్ఫ్రా బ్యాంక్ ద్వారా 5350 కోట్ల నిధులు వస్తే, కేవలం 240 కోట్లు మాత్రమే గత ప్రభుత్వం ఉపయోగించుకున్నట్లు మంత్రి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో 15 వ ఫైనాన్స్ కమిషన్ ద్వారా వచ్చిన 550 కోట్లకు యూసి లు ఇస్తే, మరో 1100 కోట్లు వచ్చేవని, ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆ నిధులు కూడా రాలేదన్నారు.ప్రస్తుతం సీఆర్థీయే లో ఒక్క పైసా కూడా లేదని అన్నారు.

రాజధాని రైతులకు కౌలు డబ్బులు త్వరలోనే విడుదల చేస్తామని సీఎం. తనతో చెప్పారని మంత్రి నారాయణ తెలిపారు. మరోవైపు టిడ్కో లబ్ధిదారులను బ్యాంకులు ఇబ్బంది పెట్టకుండా రీపేమెంట్ గడువు పెంచేలా బ్యాంకులతో మాట్లాడతామని మంత్రి నారాయణ చెప్పారు.

LEAVE A RESPONSE