– ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కృషి
– ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వెల్లడి
ఏలూరు: ఏలూరు పార్లమెంట్ పరిధి లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి తాము కృషి చేస్తున్నట్టు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఏలూరు కలెక్టరేట్లోని గౌతమి సమావేశ మందిరంలో బుధవారం జరిగిన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య, కలెక్టర్ కె. వెట్రి సెల్వి తో కలిసి ఎంపి పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు.
ఆసుపత్రిలో ప్రజలకు అందుతున్న వైద్య సేవలు, వసతులు, సమస్యలు, వైద్యులు, సిబ్బంది పోస్టుల ఖాళీలు తదితర అంశాలపై ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సమీక్షించారు. ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు పరిశీలించాలని, ఖాళీగా ఉన్న వైద్యులు, సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని త్వరలో ఆరోగ్య శాఖ మంత్రిని కలిసి విజ్ఞప్తి చేస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు.
ఆస్పత్రి ఆధునికీకరణ అంశాన్ని ఎమ్మెల్యే రాధాకృష్ణతో కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధుల మంజూరుకు తన వంతు కృషి చేస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్పష్టం చేశారు. సమావేశానికి వైద్యులు సమగ్ర సమాచారంతో రాకపోవడం పట్ల ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యుల నడుమ సమన్వయం కొరవడిందని, ఇది మంచి పద్ధతి కాదు అని బాధ్యతాయుతంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకరరావు, ఆర్. ఎం. ఓ డాక్టర్ దుర్గా కుమార్, తదితరులు పాల్గొన్నారు.