Suryaa.co.in

Andhra Pradesh

పుట్టినరోజున జగన్‌ సంక్షేమం – తన పత్రిక సాక్షిగా ఆదాయ వెల్లువ

-సుప్రీం తీర్పు, కేంద్ర ప్రభుత్వ నిబంధనల నిరంతర ఉల్లంఘన
-తెలుగుదేశం పార్టీ పోలిట్‌బ్యూరో సభ్యులు, శాసనమండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు

ప్రజా సంక్షేమమే తన ఊపిరి అంటూ నిరంతరం అబద్ధాలు వల్లిస్తున్న ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి తన పుట్టినరోజు పేరిట తన పత్రిక సాక్షిగా నేడు కోట్లాది రూపాయలు మూటగట్టుకున్నారు. ప్రభుత్వ ప్రకటనల జారీకి సంబంధించి సుప్రీంకోర్టు ఆదేశానుసారం జారీ అయిన విధివిధానాలను యధేచ్ఛగా ఉల్లంఘించి ఈ అక్రమ సంపాదనకు పాల్పడ్డారు.

నేటి తన దినపత్రికలో పాతిక పేజీలకు పైగా ప్రభుత్వ మరియు తన ప్రైవేటు అనుచరగణంతో ప్రకటనలు గుప్పించి తన సంక్షేమాన్ని మరింతగా బలపరుచుకున్నారు. కేవలం ఈరోజునే తన పత్రిక, టీవీల ద్వారా రూ.50 కోట్లకు పైగా సంపాదించుకున్నారు. ముఖ్యమంత్రి నిత్యం మాట్లాడే ప్రజా సంక్షేమానికి ఇదొక నిజమైన తార్కాణం. తన సంక్షేమమే ప్రజా సంక్షేమమని జగన్‌రెడ్డి గట్టిగా విశ్వసిస్తాడనడానికి ఇదొక ఉదాహరణ.

ఈ సంపాదన నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం మరియు పలు ప్రభుత్వరంగ సంస్థల ద్వారా ఈ అక్రమ ఆదాయాన్ని పొందారు. తన పత్రికలో మొదటి మరియు చివరి పేజీలలో రంగు రంగులతో ఫుల్‌ పేజీ ప్రకటనలతో పాటు మరో 5 పేజీలు ప్రకటనలతో నింపి సంతృప్త స్థాయిలో అక్రమార్జనకు పాల్పడ్డారు. ప్రజలకు మేలు కూర్చే సమాచారాన్ని అందించడానికి జారీ చేయవలసిన ప్రభుత్వ ప్రకటనలను తన వ్యక్తిగత ఇమేజీ పెంచుకోవడానికి పార్టీ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ప్రకటనలను నిస్సిగ్గుగా దుర్వినియోగం చేసుకుంటున్నారు.

గుంతల మయమవుతున్న రహదారులను బాగు చేయడానికి డబ్బుల్లేవని ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్న జగన్‌రెడ్డి ప్రభుత్వం కేవలం పుట్టినరోజు పేరుతో రూ.50 కోట్లు జేబులో వేసుకోవడం మహా దారుణం. జీతాలు కూడా ఇవ్వలేని, రైతులు కష్టపడి పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయలేని అస్తవ్యస్త రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో సొంత జేబులు నింపుకోవడానికి వచ్చిన ప్రతి అవకాశాన్ని వాడుకుంటున్నారు.
ఈరోజు మరియు ఇప్పటివరకు జగన్‌రెడ్డి ప్రభుత్వం ప్రకటనల విడుదలలో ఉల్లంఘించిన కొన్ని నియమాలు :

1. అధికార పార్టీ రంగులను ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగా గానీ ప్రకటనల్లో వాడరాదు.
2. ఒక వ్యక్తి మరియు అధికార పార్టీకి అనుకూలంగా మరియు ప్రతిపక్షాలకు వ్యతిరేకంగా ప్రభుత్వ ప్రకటనలు ఉండరాదు.
3. ప్రభుత్వ ప్రకటనలకు రాజకీయ రంగు పులమరాదు… ప్రతిపక్షాలపై వ్యాఖ్యలు చేయకూడదు.
4. ప్రభుత్వ ప్రకటనలను వీలైనంత మేరకు తక్కువ ఖర్చుతో విడుదల చేయాలి.
5. పుట్టినరోజు వంటి సందర్భాల్లో వివిధ ప్రభుత్వ సంస్థలు ఒకే ప్రకటన విడుదల చేయాలి… విడివిడిగా కాదు.
6. జిల్లాల వారీ, నియోజకవర్గాలకు సంబంధించిన ప్రకటనలు తత్సంబంధిత ప్రాంతాల్లో మాత్రమే విడుదల చేయాలి.
7. సాధారణ విషయాలకు సంబంధించిన ప్రకటనలు నలుపు, తెలుపులోనే ఉండాలి… రంగు రంగులు అవసరం లేదు.
ఈ విధంగా వ్యక్తిగత మరియు రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ ప్రకటనల పేరిట కొనసాగుతున్న దోపిడీని ఆపివేయాలని తెలుగుదేశంపార్టీ డిమాండ్‌ చేస్తోంది. పలు సమస్యలతో, ప్రభుత్వ నిర్వాకంతో, నిలువెత్తు అప్పులతో అభివృద్ధి కుంటుపడి ప్రజాజీవనం అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో ప్రతి రూపాయిని అతి జాగ్రత్తగా వినియోగించే విజ్ఞత ఇప్పటికైనా జగన్‌రెడ్డికి కలగాలని తెలుగుదేశం కోరుకుంటోంది.

LEAVE A RESPONSE