– రాజ్యసభ మాజీ సభ్యులు యలమంచిలి శివాజీ
ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్ల వ్యవస్థ అవినీతి కి తావు లేని సేవలు అందిస్తుందని రాజ్యసభ మాజీ సభ్యులు యలమంచిలి శివాజీ అన్నారు. సి.ఆర్. మీడియా అకాడమి ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస రావు గురువారం గుంటూరులోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఇరువురు పలు అంశాలపై ముచ్చటించుకున్నారు. పరిపాలన ప్రజలకు చేరువ కావడంద్వారా సేవలు సత్వరమే అందే అవకాశం యీ వాలంటీర్ల వ్యవస్థ కల్పిస్తోందని శివాజీ అన్నారు. సుమారు 2 లక్షల మందికి యీ వ్యవస్థ ద్వారా ఉద్యోగాలు కల్పించడం మంచి పరిణామం అని ఆయన అన్నారు. కృష్ణాజిల్లాలో తమ స్వగ్రామం కనుమూరు లో తమ తండ్రిగారి జ్ఞాపకార్థం గ్రామ సచివాలయ భవనం నిర్మించామని శివాజీ తెలిపారు.
పులిచింతల ప్రాజెక్టు నిర్మించిన ఘనత వై. ఎస్. రాజశేఖర రెడ్డికే చెందుతుందని పేర్కొన్నారు. ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసం తాము చేసిన కృషిని ఆయన గుర్తు చేసుకున్నారు. అదేవిధంగా పోలవరం ప్రోజెక్టు నిర్మాణానికి అప్పటి ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి చూపిన చొరవను ఆయన గుర్తు చేసుకున్నారు. బందరు పోర్టు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నట్టు తమ దృష్టి కి వచ్చినట్లు ఆయన తెలిపారు.
అంతకు ముందు యలమంచిలి శివాజీ ని మీడియా అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు దుశ్శాలువాతో సత్కరించారు. ఛైర్మన్ వెంట ఒ.ఎస్.డి శ్రీనివాస జీవన్, కంటెంట్ ఎడిటర్ కలమండ శరత్ బాబు లు వున్నారు.