– బాధితుల ఫిర్యాదులు ఏవని ప్రశ్నించిన లాయర్లు
– జర్నలిస్టుల రిమాండ్‌ను కొట్టేసిన జడ్జి
హైదరాబాద్: ఐఏఎస్ అధికారిపై దుష్ర్పచారం చేసి, అనైతిక చర్యలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో సిట్ పోలీసులు ఉదయం అరెస్టు చేసిన ఎన్టీవీ రిపోర్టర్లు దొంతు రమేష్, సుధీర్ రిమాండ్ రిపోర్టును కోర్టు కొట్టేసింది. ఇద్దరికీ 20 వేల పూచీకత్తుతో బెయిల్ మంజూరు చేసింది. వారిద్దరి పాస్‌పోర్టులను స్వాధీనం చేయాలని ఆదేశించింది. అరెస్టు సమయంలో నిబంధనలు పాటింలేదంటూ రిమాండ్ రిపోర్టును తిరస్కరించడం రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి షాకిచ్చినట్లయింది.
ఎన్టీవీ ప్రతినిధులను అరెస్టు చేసిన వైనాన్ని వారి న్యాయవాదులు ప్రశ్నించారు. బాధితుల స్టేట్మెంట్ను పోలీసులు ప్రవేశపెట్టలేదని, అదే సమయంలో బాధితులుగా చెప్పబడుతున్న వారెవరూ ఫిర్యాదు కూడా లేదని వాదించారు. దానితో మేజిస్ట్రేట్ జర్నలిస్టులకు బెయిల్ మంజూరు చేశారు. ఈ సందర్భంగా మేజిస్ట్రేట్ ఇంటివద్ద జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో గుమిగూడారు.
అంతకుముందు ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరిని అరెస్టు చేయకుండా, వార్త రాసిన రిపోర్టర్లను అరెస్టు చేయడం ఏమిటంటూ జర్నలిస్టు సంఘాలు, తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలూ ప్రశ్నించాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ సీసీఎస్‌కు వెళ్లి అరెస్టయిన ఎన్టీవీ జర్నలిస్టులను పరామర్శించి వారికి సంఘీభావం ప్రకటించారు.