Suryaa.co.in

Editorial

ఆర్టీజీఎస్‌లో కోవర్టులు?

  • పాలన మారినా ఇంకా పాత వాసనలే

  • వైసీపీ హయాంలో పనిచేసిన వారే కొనసాగింపు

  • నచ్చిన వారికి నచ్చిన ముద్రలు

  • నచ్చకపోతే వైసీపీ ముద్రతో తొలగింపు

  • పని-విశ్వసనీయత ప్రాతిపదిక కాదా?

  • ఇద్దరు ఐఏఎస్‌ల మెతక వైఖరే కారణమా?

  • గతంలో డేటా అమ్ముకున్నారన్న ఆరోపణలున్న వారికే కొనసాగింపు

  • వైసీపీ జమానాలో ఆ ‘లిటిల్’ మాస్టరుదే హవా

  • నాడు సజ్జల, ధనంజయరెడ్డి కనుసన్నల్లో ఆర్టీజీఎస్

  • పెత్తనమంతా సజ్జల శిష్యుడిదేనట

  • ఇప్పుడూ ఆ ‘లిటిల్’ మాస్టరుదే హవా

  • జీతం తక్కువైనా అక్కడే పనిచేస్తారట

  • ఆర్టీజీఎస్ చూరు వదలని విక్రమార్కులు

  • వారికి సీఎంఓలో ఓ ఏఐఎస్, మరో సెక్రటరీ అండ?

  • ఆర్టీజీఎస్‌లో ఉద్యోగాల వరదకు కనిపించని ప్రాతిపదిక

  • వందలమందికి ఇంట్లో కూర్చోబెట్టి జీతాలు

  • వైసీపీ ఆఫీసులో పని.. ఆర్టీజీఎస్‌లో జీతం

  • భార్య, భర్త, తమ్ముడు కూడా అక్కడే

  • ఆఫీసుకు రాకపోయినా వేలల్లో జీతాలు

  • పనిరాకపోయినా వేలల్లో జీతాలందుకుంటున్న ‘పనిమంతులు’

  • ఆర్టీజీఎస్‌పై పర్యవేక్షణ ఏదీ?

  • ఆర్టీజీఎస్‌ను ప్రక్షాళన చేయరా?

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఆర్టీజీఎస్.. రియల్‌టైమ్ గవర్నరెన్స్. ఇది సీఎం చంద్రబాబునాయుడు మస్కిష్కం నుంచి ఆవిర్భవించిన అద్భుత ప్రాజెక్టు. కాకపోతే దాని నుంచి అప్పట్లో మరిన్ని అద్భుతాలు రాబట్టే బదులు.. కొందరు ఐఏఎస్ అధికారులు, దాన్నో భజన కేంద్రంగా మార్చారన్న విమర్శలు లేకపోలేదు. అప్పట్లో ప్రజల సంతృప్తిస్థాయికి కొలమానం-పునాదిరాయి పడిందక్కడే. సంతృప్తిస్థాయి సంఖ్యను రోజూ పెంచి చూపించి, గత టీడీపీ సర్కారు పుట్టిమునిగేందుకు కారణమైనది కూడా ఇదేననుకోండి. అలాంటి ఐఏఎస్ ‘బాబు’లు ఏలిన ఆర్టీజీఎస్ అది. అది వేరే విషయం.

రాష్ట్రంలోని అన్ని అంశాలపై ఇందులో డేటా ఉంటుంది. ప్రజల ఫిర్యాదులు, ప్రభుత్వ సమాచారం గుదిగుచ్చి డేటాగా మారుస్తుంది. ప్రభుత్వ శాఖల వివరాలు ఇందులో నిక్షిప్తమవుతాయి. రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు స్థాయేమిటో దీనితో తెలుసుకునే వెసులుబాటుంది. రాష్ట్రంలో ఏ సంఘటన జరిగినా వెంటనే ఇది పాలకులను మేల్కొలుపుతుంది.

సీఎం నిర్వహించే ప్రజాదర్బారు, ఆయన రాష్ట్ర పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రజలిచ్చే ఫిర్యాదులు, వినతులన్నీ తర్వాత ఇక్కడి డేటాలోనే నిక్షిప్తం చేసి, వాటిని సంబంధిత శాఖలకు పంపించి ఫాలోఅప్ చేస్తుంటారు. దానికో అధికారులు, సిబ్బందితో పెద్ద వ్యవస్థనే ఏర్పాటుచేశారు. ప్రకృతి వైపరీత్యాల నుంచి రాష్ట్రంలో ఏ మూల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయో, ఇక్కడి నుంచే తెలుసుకునే అద్భుత ‘అంజనం’. పూర్వకాలంలో తప్పిపోయిన మనషుల గురించి తెలుసుకునేందుకు.. చాలామంది సిద్ధాంతుల వద్దకు వెళితే, ఆయన అంజనం వేసి, మీవాడు ఫలానా చోట ఉన్నాడని చెప్పేవారు. పాలనలో ఇప్పుడు ఆర్టీజీఎస్ కూడా అంతే! ఒకరకంగా పాలకులకు ఆర్టీజీఎస్ కళ్లు. చెవులు లాంటివన్నమాట.

మరి ఆ కళ్లు-చెవులే పాలకులను మోసం చేస్తే?.. అవి పాత సర్కారు ప్రముఖులకు కోవర్టుగా పనిచేస్తే?.. వచ్చిన సమాచారం ప్రత్యర్థి పార్టీకి అందచేస్తే ఏమవుతుంది?.. ఆటోమేటిగ్గా కొంప కొల్లేరవుతుంది! ఇప్పుడు ఆర్టీజీఎస్‌లో ఆ కోవర్టు ఆపరేషనే నడుస్తోందన్నది అసలు గొడవ. మరి ఇంత ప్రాముఖ్యం ఉన్న ఆర్టీజీఎస్‌ను ఎవరు పర్యవేక్షిస్తున్నారు? అందులో ఏం జరుగుతుందని ఎవరైనా తెలుసుకుంటున్నారా అంటే జవాబు లేదు.

వైసీపీ జమానాలో ఇక్కడ పెత్తనం చేసిన ఓ ‘లిటిల్’ మాస్టర్.. సీఎంఓలోని ఓ అధికారిని మెప్పిస్తూ, మళ్లీ హవా చెలాయిస్తున్నారట. సజ్జల ప్రియశిష్యుడైన సదరు జగనాభిమాని.. వైసీపీ విపక్షంలో ఉండగనే వారికి డేటా అమ్ముకున్నారన్న ఆరోపణలుండేవి. గమ్మతుగా వైసీపీ రాగానే అక్కడ చేసిన సదరు సజ్జల శిష్యపరమాణువు.. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా.. జీతం తగ్గించుకుని మరీ అక్కడే పనిచేస్తానంటూ, ఇంకా అక్కడే తిష్టవేశారు. మరి ఆర్టీజీఎస్ అంటే అంత ప్రేమ ఆయనకు!

అంతేనా? సకుటుంబ సపరివార సమేతంగా కొందరు.. పనిచేయకపోయినా లార్డుమాదిరి, ఇంటినుంచే పనిచేస్తున్న మరికొందరు.. ఏమాత్రం పనికిరాకపోయినా లాబీయింగ్‌తో లాగించేస్తున్న ఇంకొందరు! ఇక పాలన మారినప్పుడల్లా విధేయతలు మార్చుకుని, బతికేస్తున్న చాలామంది ఆర్ట్ ఆఫ్ లివింగ్ మాస్టర్లకు అది అడ్డా. ఇదీ ఆర్టీజీఎస్‌లో జరుగుతున్న తెరవెనుక కథ.

ఆర్టీజీఎస్ దాదాపు 200 మంది ఉద్యోగులున్న అత్యంత కీలకమైన ప్రభుత్వ వ్యవస్థ. దానికి ప్రతిభ-సాంకేతిక పరిజ్ఞానమే అర్హత. కానీ ఇప్పుడు ఆ ప్రాతిపదిక అర్ధం మారింది. అధికారులకు నచ్చిన వారు అందులో ప్రవేశిస్తున్నారు. జగన్ జమానాలో దాదాపు 175 మంది ఉద్యోగులు పనిచేసేవారు. వారిలో ఆఫీసుకు వచ్చేవారి సంఖ్య బహు స్వల్పం. అసలు వారి పేర్లు, వారి వివరాలు అకౌంటెంట్‌కు తప్ప, నరమానవుడికి తెలియదట.

అలా ఇంట్లో కూర్చుని పనిచేస్తున్నారన్న పేరుతో గత వైసీపీ సర్కారు అంతమందికి జీతాలిచ్చింది. కానీ వారు చేసే పనేమిటో ఎవరికీ తెలియదు. ఎన్నికల ఫలితాలు వచ్చి, ప్రభుత్వం ఏర్పడకముందు.. వారితో రాజీనామాలు చేయించి, ఆ వ్యవహారాన్ని గుట్టుచప్పుడు కాకుండా దాచేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత పాత ప్రభుత్వంలో పనిచేసే ఓ పది, పదిహేనుమంది మాత్రమే కొనసాగారు.

వారంతా వైసీపీ నేతల సిఫార్సు మేరకే ఆర్టీజీఎస్‌లో చేరినప్పటికీ, అందులో కొందరు ఆయా అంశాలపై అవగాహన, అనుభవం ఉన్నవారే. అయితే వారిపై వైసీపీ ముద్ర వేసి తొలగించారు. అంతవరకూ బాగానే ఉంది. ఇక మిగిలిన 25 మందిలో గత వైసీపీ సర్కారులో పనిచేసిన వారే ఇంకా కొనసాగుతున్నారు. వీరిలో చాలామంది అంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో పనిచేసి, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఆ పార్టీ నేతల సిఫార్సులతో కొనసాగుతున్న వారే కావడం ఇంకో వైచిత్రి.

వైసీపీ ప్రభుత్వంలో పనిచేసిన వారిపై పార్టీ ముద్ర వేసి తొలగించిన అధికారులు.. అదే ప్రభుత్వంలో పనిచేసిన మరికొందరిని మాత్రం కొనసాగించడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. తొలగింపునకు అసలు ప్రాతిపదిక ఏమిటన్నది వారి ఆశ్చర్యానికి కారణం.

కులం పేరుతో కొందరు, ప్రాంతాల పేరుతో ఇంకొందరు, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో, తెలిసిన వారి సిఫార్సులతో ఇంకొందరు కొనసాగుతున్నారు. వీరిలో ఓ ‘లిటిల్’ మాస్టర్‌పై ఉన్న ఆరోపణలు అన్నీ ఇన్నీ కావు.

టీడీపీ హయాంలో ఇందులోనే పనిచేసిన ఈ ‘లిటిల్’ మాస్టర్.. అప్పటి ఎన్నికల ముందు, ఆర్టీజీఎస్ డేటా వైసీపీ వారికి అప్పనంగా ఇచ్చేశారన్న ఆరోపణలు వచ్చాయి. తర్వాత వైసీపీ సర్కారు రావడంతో సహజంగా మళ్లీ ఆయనే కొనసాగారు. టీమ్‌లీడర్ హోదాలో ఆయన చేసే హడావిడి అంతా ఇంతా కాదట. ఆర్టీజీఎస్ మొత్తం తానే మోస్తుంటానన్న బిల్డప్ ఇస్తుంటారట. ఇలాంటి బిల్డప్పు బాబాయ్‌లు చాలామంది ఉన్నారంటున్నారు.

ఆర్టీజీఎస్ విడిగా ఉండే కార్యాలయం. కాకపోతే అది కూడా సీఎంఓ ఫ్లోర్‌లోనే ఉంటుంది. దానితో చాలామంది తెలివైన ఉద్యోగులు, తాము సీఎంఓ నుంచి ఫోన్లు చేస్తున్నామంటూ హడావిడి చేసిన సందర్భాలు కోకొల్లలు. ఆర్టీజీఎస్‌కు వచ్చిన ఫిర్యాదులలో ఫిర్యాదుదారుల నెంబర్లకు ఫోన్లు చేసి,వారికి పనులు చేసి పెడతామని ప్రలోభపెట్టిన ఫిర్యాదులు కూడా లేకపోలేదు.

సీఎంఓలోని ఒక అధికారి, మరో సెక్రటరీని ప్రసన్నం చేసుకుని.. ఇప్పటికీ ఆర్టీజీఎస్‌లోనే కొనసాగుతున్న లిటిల్ మాస్టర్ ఆర్ట్ ఆఫ్ లివింగ్‌కు, టీడీపీ వర్గాలు ఆశ్చర్యపోతున్నారట. ఈవిధంగా జగన్ సర్కారుతోపాటు.. ఎన్నికల ముందు నుంచి ఫలితాల వరకూ, తాడేపల్లిలోని వైసీపీ ఆఫీసులో పనిచేసిన వారంతా, ఇంకా ఆర్టీజీఎస్‌లోనే కొనసాగుతున్నారన్న చర్చ జరుగుతోంది.

ఇక తమ్ముడు, భార్యకు కూడా ఇక్కడే ఉద్యోగాలిప్పించుకున్న ఘనలు కూడా ఆర్టీజీఎస్‌లో కొనసాగుతున్నారట. అసలు వైసీపీ జమానాలో.. ఎంతమంది ఆర్టీజీఎస్‌లో అధికారికంగా పనిచేస్తున్నారన్న దానిపై, లెక్కాపత్రం లేదన్న ఆరోపణలున్నాయి. వైసీపీ కీలక నేత లు సిఫార్సు చేసిన లెక్కలేనంతమందికి.. ప్రధానంగా వైసీపీ ఆఫీసులో పనిచేసే చాలామందికి, ఆర్టీజీఎస్ నుంచి వర్క్ ఫ్రం హోం పేరుతో జీతాలు ఇప్పించారన్న ఆరోపణలు తెలిసిందే. ఈ వివరాలు కొత్త ప్రభుత్వానికి తెలియకుండా ఉండేందుకే.. ఇప్పుడు అందులో కొనసాగుతున్న లిటిల్ మాస్టర్, వారితో రాజీనామాలు చేయించారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

కాగా సర్కారు మాజీ సలహాదారు సజ్జలతో కలసి.. లిటిల్ స్టార్ దిగిన ఫొటోతో కూడిన ఒక కథనం, ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఫలితంగా ఆర్టీజీఎస్ తెరవెనుక కథ, మళ్లీ చర్చకువచ్చేందుకు కారణమయింది.

ప్రభుత్వంలో ఇంత కీలకమైన వ్యవస్థ అయిన ఆర్టీజీఎస్, వైసీపీ కోవర్టులు-భజనపరులతో నిండిపోయిందన్న ఆరోపణల నేపథ్యంలో.. ఆర్టీజీఎస్‌ను పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసి, దానికి ఒక నమ్మకం-నిజాయితీపరుడైన అధికారికి అప్పగించాలన్న సూచనలు, పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి.

LEAVE A RESPONSE