-డంపు చేసిన ఆవులను గోశాలలకు తరలించాలి
– అదనపు DGP ని కలిసి వినతి పత్రం అందించిన రాష్ట్ర నేతలు
రాష్ట్రవ్యాప్తంగా విచ్చలవిడిగా గోవులను వధించేందుకు తరలిస్తున్నారని, వెంటనే వాటిని ఆపాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. పోలీసుల కళ్ళు కప్పి అనేక అక్రమ మార్గాల్లో ఆవులను చెక్ పోస్టులు దాటిస్తున్నారని పేర్కొంది. శుక్రవారం తెలంగాణ డిజిపి కార్యాలయంలో అడిషనల్ డీజీపీ జితేందర్ గారిని కలిసి రాష్ట్ర నాయకులు వినతి పత్రం సమర్పించారు. బక్రీద్ దగ్గర పడుతున్న కొద్దీ ఆవులు విపరీతంగా తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గోవులను ఇనోవా వాహనాల్లో తరలిస్తున్న నిన్న మొన్నటి దుర్మార్గపు చర్యలు చూస్తే మనసు చలించిపోతుందని ఆందోళన చెందారు. ఎవరికి అనుమానం రాకుండా లగ్జరీ వాహనాల్లో ఇలాంటి మూగజీవులను రవాణా చేయడం దుర్మార్గపు చర్య అని అభివర్ణించారు. హైదరాబాద్ తో పాటు నల్గొండ, నిజాంబాద్, వరంగల్, కరీంనగర్, నిజాంబాద్, ఆదిలాబాద్, మహబూబ్నగర్, ఖమ్మం, మెదక్ వంటి ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో వధించేందుకు విరివిగా గోవులను డంపు చేసి ఉంచాలని చెప్పారు. సీసీ కమెరాల ఆధారంగా గోవులు ఎక్కడెక్కడ తరలిపోతున్నాయో పరిశీలించి.. వాటిని పట్టుకొని వచ్చి గోశాలలకు తరలించాలని కోరారు. ఆవులను అక్రమంగా తరలించే వారిపై కఠినమైన కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు చేపట్టాలని వారు అదనపు డీజీపీని కోరారు. భాగ్యనగరంలోని ఓల్డ్ సిటీ తో పాటు సైదాబాద్, బోరబండ, ఎర్రగడ్డ , తదితర ప్రాంతాల్లో గోవులను విపరీతంగా డంప్ చేశారని చెప్పారు.
పిల్లికి, కుక్కకు, కోడికి యాక్సిడెంట్ అయితే పెద్ద ఎత్తున స్పందించే జంతు ప్రేమికులు… గోవు విషయంలో మౌనం పాటించడం సరికాదన్నారు. గోహత్య చట్టాలను కఠినంగా అమలు చేసి, గోవుల ప్రాణాలను కాపాడాలని విశ్వహిందూ పరిషత్ నాయకులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సురేందర్ రెడ్డి గారు, రెండు తెలుగు రాష్ట్రాల సేవా ప్రముఖ్ శ్రీ బండారి రమేష్ గారు, తెలంగాణ రాష్ట్ర సంఘటన మంత్రి శ్రీ యాదిరెడ్డి గారు, రాష్ట్ర ప్రచార ప్రముఖ్ శ్రీ పగుడాకుల బాలస్వామి గారు, రాష్ట్ర బజరంగ్దళ్ కన్వీనర్ శ్రీ శివరాములు గారు, భాగ్యనగర్ ప్రచార ప్రముఖ్ వంశీ గారు పాల్గొన్నారు.
భవదీయ
పగుడాకుల బాలస్వామి
ప్రచార ప్రముఖ్
విశ్వ హిందూ పరిషత్- తెలంగాణ
9912975753
9182674010