Suryaa.co.in

Andhra Pradesh

అరెస్టులు చేసి పట్టాలు ఇస్తారా?

-నూజివీడులో కమ్యూనిస్టు నేతల అరెస్ట్‌లు దుర్మార్గం
-ప్రభుత్వ తీరుపై సీపీఐ రామకృష్ణ ఆగ్రహం

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి శుక్రవారం నూజివీడులో అసైన్‌మెంట్‌ భూములకు పూర్తి హక్కులతో పట్టాలు ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసిన సందర్భంగా కమ్యూనిస్టుపార్టీ నేతలు, కార్యకర్తలను అరెస్ట్‌ చేయడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ ఒక ప్రకటనలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని సీపీఐ నాయకులు చలసాని వెంకట రామారావు, నియోజకవర్గ కార్యదర్శి బత్తుల వెంకటేశ్వరరావు, పట్టణ కార్యదర్శి సీిహెచ్‌ పుల్లారావులను ముందు రోజు రాత్రే హౌస్‌ అరెస్టులు చేశారు. వీరితోపాటు సీపీఎం నాయకులు జి. రాజు తదితరులను కూడా గృహ నిర్బంధంలో ఉంచారు.

కమ్యూనిస్టు పార్టీ నాయకులను గృహ నిర్బంధంలో ఉంచి పేదలకు భూమి పట్టాలు పంపిణీ చేస్తున్నామనే కార్యక్రమాన్ని నిర్వహించటం సీఎం నియంతృత్వ ధోరణికి నిదర్శనమన్నారు. గత అర్థశతాబ్ద కాలంలో కమ్యూనిస్టు పార్టీ నూజివీడు తాలూకాలో సుదీర్ఘకాలం భూమిలేని పేదలను సమీకరించి ప్రభుత్వ బంజరు భూములను, ఫారెస్ట్‌ బంజరు భూములను 30 వేల ఎకరాలను పంపిణీ చేసింది. కమ్యూనిస్టు పార్టీ పంపిణీ చేసిన ఆ భూములకు 1969 ,70 ప్రాంతాలలో 15 ఎకరాలకు పైగా నాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎస్సైన్మెంట్‌ పట్టాలు మంజూరు చేసింది. ఆ తరువాత కాలంలో కూడా కమ్యూనిస్టు పార్టీ భూమి పోరాటాలను నిర్వహించి తాలూకాలో సుమారు 40 గ్రామాలలో 30 వేల ఎకరాల భూములను పేదలకు పంపిణీ చేసింది. వీటిలో అత్యధిక భాగం భూములను పేదలు నేటికీ తమ అనుభవంలో అనుభవిస్తున్నారని రామకృష్ణ గుర్తు చేశారు.

అటువంటి కమ్యూనిస్టు పార్టీ నాయకులను ఈ రోజున గృహ నిర్బంధంలో ఉంచి ప్రభుత్వం భూమి పంపిణీ చేయడం దుర్మార్గమన్నారు. భూమి లేని పేదలకు భూమి పంపిణీ చేసిన కమ్యూనిస్టు నాయకులను అరెస్టులు చేసి, భూమిని పంపిణీ చేస్తున్నామని చెప్పుకోవటానికి ప్రభుత్వం సిగ్గుపడాలన్నారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అనేక భూ పోరాటాలు నిర్వహించి ఆంధ్ర ప్రాంతంలో పది లక్షల ఎకరాలు, తెలంగాణ ప్రాంతంలో పది లక్షల ఎకరాలు బంజరు భూములను, సీలింగు భూములను పేదలకు పంపిణీ చేసిందని, ఇది చరిత్ర తెలిపిన సత్యమన్నారు.

చరిత్రను విస్మరించి కమ్యూనిస్టులను గౌరవప్రదంగా సభకు పిలిచి ప్రశంసించాల్సింది పోయి, గృహనిర్బంధంలో పెట్టడం ఏమి నీతి అని ఆయన ప్రశ్నించారు. జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో అసైన్మెంట్‌ కమిటీలను ఇప్పటివరకు నియమించలేదని, ఒక్క ఎకరం భూమి కూడా పేదలకు పంపిణీ చేయలేదన్నారు. గతంలో మేము పంచిన భూములకు పట్టాలు ఇస్తూ, తామే భూమి పంపిణీ చేశామని గొప్పలు చెప్పుకోవడం సరికాదన్నారు. నూజివీడు తాలూకా చరిత్రలో కమ్యూనిస్టుల పోరాటాన్ని విస్మరించి భూమి పంపిణీ చేశామని ఎవరు చెప్పినా అది చరిత్రను వక్రీకరించడమే అవుతుందని ఆయన స్పష్టం చేశారు.

కమ్యూనిస్టు పార్టీ ఏ గ్రామంలో ఎన్ని ఎకరాల భూమిని పేదలకు పంపిణీ చేసిందో బహిరంగంగా చెప్పటానికి సిద్ధంగా ఉన్నామని కమ్యూనిస్టు పార్టీ భూ పోరాటాల ద్వారా భూమి పంపిణీ చేసిన చరిత్ర తెలిసి ఉన్న స్థానిక ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌ అప్పారావు సైతం కమ్యూనిస్టుల కృషిని ప్రశంసించకపోగా, కమ్యూనిస్టు నాయకులను అరెస్టు చేయించడం సిగ్గు చేటన్నారు. ఇకనైనా ప్రభుత్వం చితసుద్దితో ఇంకా పట్టాలు లేని 10వేల ఎకరాల అటవీ బంజర భూములకు పట్టాలు ఇచ్చేందుకు పూనుకోవాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు.

LEAVE A RESPONSE