ప్రస్తుత అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGA) కు వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా నిర్మాణాత్మక సంస్కరణలు అత్యవసరం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలోని మొత్తం 26 జిల్లాలపై మేము సమగ్ర సమీక్ష నిర్వహించిన అనంతరం ఈ అవసరం మరింత స్పష్టంగా కనిపించింది.
MGNREGA పథకాన్ని పునర్వ్యవస్థీకరించే దిశగా చేపట్టిన సంస్కరణలు అనివార్యమైనవే కాక స్వాగతార్హమైన నిర్ణయం. ముఖ్యంగా “ వికసిత్ భారత్ రోజ్‌గార్ మరియు ఆజీవిక హామీ మిషన్ (గ్రామీణ) (VB–G RAM G) బిల్లు, 2025” గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కల్పనతో పాటు నాణ్యమైన ఆస్తుల సృష్టికి దోహదపడే విధంగా, నిధుల దుర్వినియోగాన్ని నివారిస్తూ, లక్ష్యోన్నతమైన మరియు పారదర్శక అమలుకు ఉద్దేశించబడింది.
ప్రస్తుతంగా ఉన్న ప్రతి గ్రామీణ కుటుంబానికి సంవత్సరానికి 100 రోజుల ఉపాధి హామీని 125 రోజులకి పెంచడం ఒక కీలక సంస్కరణ. అలాగే, MGNREGA కింద పని కోరిన వ్యక్తికి 15 రోజుల్లోగా ఉపాధి కల్పించని పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ భత్యం చెల్లించాల్సిన నిబంధనను ఈ బిల్లు యథాతథంగా కొనసాగిస్తోంది.
వ్యవసాయ కాలంలో రైతులకు కార్మికుల లభ్యతపై ఏర్పడే వాస్తవ సమస్యలను దృష్టిలో ఉంచుకొని, వ్యవసాయ సీజన్లో 60 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిలిపివేయడానికి అవకాశం కల్పించడం ఒక అత్యంత ముఖ్యమైన నిబంధన. దీని ద్వారా గ్రామీణ కార్మికులకు ప్రభుత్వ పథకం కింద 125 రోజులు, వ్యవసాయ సీజన్లో అదనంగా 60 రోజుల ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుంది.
గ్రామీణ అభివృద్ధి కోసం కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 వ్యయ నిష్పత్తిలో నిధులు సమకూర్చడం వల్ల ఈ పథకం క్రింద వినియోగించే నిధుల పరిమాణం పెరిగి గ్రామీణ ఉపాధి విస్తరణకు మరియు నాణ్యమైన ఆస్తుల సృష్టికి మరింత అవకాశం కలుగుతుంది. ఇది ప్రధాని నరేంద్ర మోడీ సంకల్పం వికసిత్ భారత్ లక్ష్య సాధనకు బలమైన పునాదిగా నిలుస్తుంది.
తప్పుడు లావాదేవీలు, దుర్వినియోగాలను పూర్తిగా అరికట్టేందుకు ఈ బిల్లు ఆధునిక సాంకేతికత వినియోగాన్ని స్పష్టంగా ప్రతిపాదిస్తోంది. అవి:
(i) లావాదేవీలకు బయోమెట్రిక్ ధృవీకరణ,
(ii) ప్రణాళిక మరియు పర్యవేక్షణకు భౌగోళిక సమాచార సాంకేతికత (Geospatial Technology),
(iii) రియల్‌టైమ్ పర్యవేక్షణకు మొబైల్ యాప్ ఆధారిత డ్యాష్‌బోర్డులు,
(iv) వారానికోసారి ప్రజలకు వెల్లడించే సమాచార వ్యవస్థలు.
ఈ చర్యల ద్వారా పని చేయకుండానే చెల్లింపులు, నకిలీ లావాదేవీలు, ఉపయోగం లేని పనులు పూర్తిగా తొలగిపోయి, గ్రామీణ ఆస్తుల సృష్టిలో వాస్తవ నాణ్యత ప్రభావం కనిపించేలా అమలు జరుగుతుంది.
– లంకా దినకర్
చైర్మన్, ఇరవై సూత్రాల కార్యక్రమాలు (వికసిత్ భారత్ – స్వర్ణ ఆంధ్ర)
ఆంధ్రప్రదేశ్