Suryaa.co.in

Andhra Pradesh

అధిక వడ్డీలు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు

  • ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకున్న హోం మంత్రి
  • భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట భద్రత ఏర్పాట్లు
  • ‘ఫ్రెండ్లీ పోలీసింగ్’ మా ప్రభుత్వ లక్ష్యం..
  • విజయవాడ వరదల సమయంలో భద్రత బలగాల కృషి అనిర్వచనీయం
  • సీఎం నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రకు 12 ఏళ్లు 
  • హోం మంత్రి వంగలపూడి అనిత

అమరావతి, అక్టోబర్, 02: దేవీ శరన్నవరాత్రుల సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగని విధంగా పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్లు రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. బుధవారం విజయవాడ కనకదుర్గమ్మను ఆమె దర్శించుకున్నారు. అనంతరం ఆలయం, ఇంద్రకీలాద్రి చుట్టూ అమ్మవారి భక్తులకోసం చేసిన ఏర్పాట్లను హోం మంత్రి పరిశీలించారు. చిన్నారులు తల్లులు, వృద్దుల సౌకర్యార్థం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆమె పేర్కొన్నారు. గతంలో లాగా ప్రజలపట్ల అమర్యాదగా ప్రవర్తించే ఘటనలకు ఆస్కారమివ్వబోమన్నారు. సామాన్య భక్తులకు ఇబ్బంది లేని విధంగా ప్రోటోకాల్ దర్శనాలకు ప్రత్యేక సమయాలను కేటాయించినట్లు తెలిపారు. విజయవాడ వరదల సమయంలో భద్రత బలగాలు మానవత్వంతో స్పందించి సామాన్య ప్రజలను రక్షించిన తీరును హోంమంత్రి అనిత ప్రశంసించారు.

అక్టోబర్ 3 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించే దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల నేపథ్యంలో 6వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హోంమంత్రి స్పష్టం చేశారు. పటిష్ట బందోబస్తుతో భద్రతను పర్యవేక్షించడం కోసం పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో విజయవాడ కమాండ్ సెంటర్ ను ఏర్పాటు చేశామన్నారు. కనకదుర్గమ్మ దర్శనం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చే సామాన్య భక్తుల రక్షణే ధ్యేయంగా జిల్లా వ్యాప్తంగా 500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి ప్రత్యేక ముందస్తు చర్యలు చేపట్టామన్నారు. డ్రోన్ సేవలను సమర్థవంతంగా వినియోగించుకుని ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసుల రక్షణ వలయం ఇంద్రకీలాద్రి చుట్టూ ఏర్పాటు చేసినట్లు హోంమంత్రి అనిత పేర్కొన్నారు.

అధిక వడ్డీలు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు

వడ్డీల పేరుతో సామాన్య ప్రజలను ఇబ్బంది పెడితే సహించేది లేదని హోంమంత్రి అనిత హెచ్చరించారు. ఏలూరు కాల్ మనీ ఘటనపై ఆమె తీవ్రంగా స్పందించారు. కుస్తీలకు ముందే వడ్డీ కోతతో పాటు గడువు దాటిందని డబుల్ కుస్తీలు వసూలు చేసే కాల్ మనీ వ్యాపారులపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిక వడ్డీలు, అక్రమ వసూల్లతో వేధిస్తే క్రిమినల్ చర్యలు పెడతామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటివి జరగకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. వసూళ్ల పేరుతో అమాయక ప్రజలను జలగల్లా పీల్చిపిప్పి చేసే వారిపై ఉక్కుపాదం మోపుతామన్నారు. ఈ నేపథ్యంలో ఏలూరు ఎస్పీతో హోంమంత్రి అనిత మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వడ్డీ వ్యాపారాలపై సీరియస్ గా చర్యలు తీసుకుంటామన్నారు.

సీఎం నారా చంద్రబాబు నాయుడు పాదయాత్రకు 12 ఏళ్లు పూర్తి 

ఏపీ ప్రజల భవితను మార్చడం కోసం 2012లో గాంధీ జయంతి రోజున నేటి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ‘వస్తున్నా మీ కోసం’పేరుతో నాడు విపక్షనేతగా పాదయాత్ర ప్రారంభించి సరిగ్గా నేటికి 12 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో హోంమంత్రి వంగలపూడి అనిత ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 16 జిల్లాలు, 86 నియోజకవర్గాలు, 28పట్టణాలు, 5 నగరాలు, 162 మండలాలు, 1253 గ్రామాలలో మొత్తం 2,817 కిలోమీటర్లు ఎండనకా, వాననకా 63 ఏళ్ల వయసులో అవిశ్రాంతంగా నడిచిన తీరును గుర్తు చేసుకున్నారు. చంద్రబాబు గారు 208 రోజులు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను మేనిఫెస్టోలో హామీలుగా ప్రకటించి నెరవేర్చడం ఆయన అనుభవానికి, అంకితభావానికి నిదర్శనమని ఆమె ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

LEAVE A RESPONSE