Home » సాక్షిలో ఏడుపులు.. పెడబొబ్బలు.. వేదనలు.. రోదనలు

సాక్షిలో ఏడుపులు.. పెడబొబ్బలు.. వేదనలు.. రోదనలు

– జనాలకు విశ్వాసం లేదు, ఆశపోతులట
– పథకాలను వాడుకుని ఓట్లేయలేదట
– ఓటమిని జనం మీదకు నట్టేసిన ఎర్నలిస్టులు
– ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయంటూ దింపుడుకల్లం ఆశలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

కౌంటింగ్ జరుగుతోంది. అప్పటికే దాదాపు రౌండ్లు దాటాయి. ఉదయం పదిన్నర గంటలకు ఎన్డీయే కూటమి 128 అసెంబ్లీ, 15 లోక్‌సభ స్థానాల ఆధిక్యానికి చేరింది. అసలు తొలి నుంచీ ప్రశ్నార్ధకంగా మారిన ఎచ్చెర్ల బీజేపీ అభ్యర్ధి భవితవ్యం కూడా వెలిగిపోయింది. అంటే కూటమి గాలి ఏ స్థాయిలో వీచిందో సుస్పష్టం.

కానీ.. వైసీపీ అధికార మీడియా, జగన్ మానసపుత్రిక సాక్షి చానెల్‌లో మాత్రం వింత ధ్వనులతో ఏడుపులు.. పెడబొబ్బలు.. వేదనలు.. రోదనలు.. శోకాలు. ఎర్నలిస్టులు కమ్ ‘జనరలిస్టు’ ల విశ్లేషణతో స్టుడియో దద్దరిల్లిపోతోంది. వారి అశ్రునయనాలతో స్టుడియో ఫ్లోర్లు నిండిపోయాయి. అది చివరకు మెయిన్ గేట్ వరకూ ప్రవహిస్తున్న కన్నీటి విషాద దృశ్యం. దానితో సిబ్బంది పసుపు బట్టలతో నీళ్లు పిండుతున్న మరో దృశ్యం. స్టుడియోలో అశ్రునయనాలతో, గుక్కపట్టి వస్తున్న ఏడుపును ఆపేసుకుని.. జగనన్న, వదినల ఓదార్పు కోసం ఎదురుచూస్తున్న ఎర్నలిస్టుల వెయిటింగ్ దృశ్యాలు కమనీయం. రమణీయం! ఎన్నిసార్లు చూసినా తనివితీరని అదో చూడచక్కని ముచ్చట.
* * *
సాక్షి స్టుడియోలో కూర్చుని ఫలితాలపై విశ్లేషిస్తున్న ఎర్నలిస్టులు కమ్ జనరలిస్టులు, ముందస్తు ఓటమిపై ఇచ్చిన వక్రభాష్యం భలేగా ఉంది. అసలు జగనన్న తప్పేమీ లేదట. తప్పంతా జనాలదేనట. ఇందులో ‘వైసీపీ గెలవకపోతే నేను ఉండను. ఫలితాల తర్వాత మా ఇంటికి వచ్చి మా ఆవిడ ఇచ్చేది తిని, నా ఫొటోకు దండ వేసి వెళ్లిపొమ్మన్న’ ఒక ‘అతి ఎర్నలిస్టు’ కూడా ఉండటమే విచిత్రం. వీళ్లంతా ఏమంటారంటే.. జగనన్న ఇచ్చిన పథకాలు తీసుకున్న లబ్థిదారులు, వైసీపీకి చివరాఖరిలో చేయిచ్చారట. అన్నియ్య పార్టీకి ఓట్లేయలేదట. చంద్రబాబు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు-పాసు పుస్తకాలపై జగన్ ముద్ర గురించి విష ప్రచారం చేసి, ఓటర్ల మెదళ్లను ఖరాబు చేశారట. ప్రజలు ఆశపోతులు కాబట్టి కూటమి వైపు మొగ్గుచూపారట. వారికి ఎంత చేసినా విశ్వాసం లేదట. జ్ఞాపకశక్తి తక్కువట. ఇలా సాగింది ఆ ఎర్నలిస్టులు-కమ్ జనరిస్టుల విశ్లేషణ పైత్యం!
* * *
అంతే తప్ప.. జగన్ ప్రజలను-ప్రజాప్రతినిధులను పూచికపుల్లలా చూశారని గానీ, తానొక దైవాంశసంభూతుడిలా భావించి నియంతగా పాలించారని గానీ, ప్రజలపై దాడులు చేయించే జగన్ క్రూరమనస్తత్వమే అన్ని వర్గాలను దూరం చేసిందని గానీ, ఒక్క ముక్క కూడా చెప్పకపోవడమే వింత. మరొక ఎర్నలిస్టుయితే.. ఇంకా చాలా రౌండ్లు ఉన్నాయి కదా? అని దింపుడుకల్లం ఆశ కనబరిచారు. అసలు ఇంకో గమ్మతేమిటంటే.. అన్ని చానెళ్లూ మొదటి రౌండు నుంచే కూటమికి 50 సీట్ల ఆధిక్యం ఇస్తే.. జగన్మోహన్‌రెడ్డి మానసపుత్రిక సాక్షిలో మాత్రం.. వైసీపీకి 50, టీడీపీకి 6+ అని ప్రసార చేయడం. కొద్దిసేపటి తర్వాత కనిపించిన మరొక విషాదమమేమిటంటే.. సాక్షి ప్రారంభించిన తర్వాత తొలిసారిగా టీడీపీకి ఆధిక్యమని ప్రకటించడం! శత్రువులకూ రాకూడని విషాద దృశ్యాలివి.
* * *
మొన్నటి ఎగ్జిట్‌పోల్స్‌లో వైసీపీ గెలుస్తుందన్న సెఫాలజిస్టులను సాక్షి ఎందుకు చర్చకు పిలవలేదన్నది ప్రశ్న. సహజంగా ప్రచార పిపాసులయిన సెఫాలజిస్టులు కూడా ఎగబడి, తాము చర్చకు వస్తామని సాక్షికి ఎందుకు చెప్పలేదన్నది మరో సందేహం. జర్నలిస్టు విప్లవ నేతలయిన శ్రీమాన్ దేవులపల్లి అమర్.. వైసీపీని భుజం పుళ్లు పడేలా మోసిన మరో మీడియా మేధావి కొమ్మినేని శ్రీనివాసరావు.. గత ఏడాది నుంచి జూనియర్ సజ్జల పోషించిన నవ రత్నాల వంటి ఎవర్నలిస్టులంతా, ఫలితాల రోజు సాక్షి డిబేట్‌లో ఎందుకు కనిపించలేదు చెప్మా?
* * *
నిన్నటి వరకూ.. మాకు ఓట్లేసే సెక్షన్ వేరే ఉంది. టీడీపీ, దాన్ని సమర్ధించే మీడియాది శునకానందం. మేం మళ్లీ గెలవబోతున్నామని అరిగిపోయిన గ్రాంఫోన్‌రికార్డులా చెప్పిన సర్కారు సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి.. ఇల్లలకగానే పండగ కాదు. అధికారంలోకి వచ్చాక మీ సంగతి తేలుస్తామని బెదిరించిన పేర్ని నాని.. నీ జీవితంలో ఇక సీఎం కాలేవు చంద్రబాబూ అన్న కొడాలి నాని గానీ.. వైసీపీ అధికారంలోకి రాకపోతే ఆరా మస్తాన్ అనే వ్యక్తి ఉండడు అని ధీమాతో ప్రకటించిన, సెఫాలజిస్టు ఆరా మస్తాన్ గానీ.. ఎక్కడా టీవీలలో కనిపించకపోవడమే గమ్మతు.

Leave a Reply