Suryaa.co.in

Editorial

ఫాఫం.. ప్రతిపక్ష హోదా కూడా పాయె!

– తిరగబడిన దేవుడి స్క్రిప్టు
– వైసీపీకి విషాద సంఖ్య
– జనసేనకు దక్కనున్న విపక్ష హోదా
( మార్తి సుబ్రహ్మణ్యం)

వైసీపీకి ఇదో విషాదం. పార్టీ స్థాపించిన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో 67 స్థానాలు సాధించింది. అధికారం సాధించిన టీడీపీకి కేవలం ఐదున్నర లక్షల ఓట్ల తేడా మాత్రమే. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీకి విపక్షంగా ఉన్న టీడీపీకి వచ్చిన సీట్లు 23. ఇప్పుడు జగన్మోహన్‌రెడ్డి చెప్పే రివర్స్ సిద్ధాంతమే ఫలితాల్లో అమలయింది.

మధ్యాహ్నం 12 గంటల సమయానికి వచ్చిన ఫలితాల ప్రకారం.. టీడీపీ 134, వైసీపీ 13, జనసేన 20, బీజేపీ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. అంటే వైసీపీకి విపక్ష హోదా కూడా దక్కే అవకాశం కూడా దక్కదన్నమాట. ఇది వైసీపీకి విషాద ఘంటికనే. కన్నూమిన్నూ కానక అహంకారం, నియంతృత్వ పోకడలు అవలంబించి, ప్రత్యర్థులపై రాక్షస దాడులతో శునకానందం పొందిన వైసీసీ నేతలకు… ఈ ఘోర పరాజయం ఓ చెంపదెబ్బ. ఇక కొత్త అసెంబ్లీలో సరికొత్త దృశ్యాలు చూడబోతున్నాం. ఆ ప్రకారం విపక్ష హోదా దక్కనున్న జనసేన దళపతి పవన్‌కల్యాణ్, ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించనున్నారు. తాజా మాజీ సభాపక్షనేత జగన్ మాత్రం అవమానభారంతో అడుగుపెట్టనున్నారు.

అన్నట్లు.. జగన్ తరచూ చెప్పే దేవుడి స్క్రిప్టు ఈ ఎన్నికల్లో తరగబడింది. ‘దేవుడిబిడ్డ’కు ఆ దేవుడి ఆశీస్సులు లేవని ఫలితాలు తేల్చాయి. అంటే ఆ దేవుడి చల్లని చూపులు, అన్న పార్టీ మీద పడలేదని తేలిపోయింది. అక్కాచెల్లెమ్మలు-అవ్వా తాతలు ఎవరూ ఈ ‘మేనమామ’కు ఓటు వేయలేదని స్పష్టమయిందన్నమాట. ఆ ప్రకారంగా అన్నయ్య బటను నొక్కితే డబ్బులు తీసుకున్న అక్కచెల్లెమ్మలు కూడా.. అన్నయ్య ఇచ్చిన డబ్బులు తీసుకుని మోసం చేశారన్నమాట. సో.. సంక్షేమ పథకాలు ఓట్లు కురిపించవన్న నగ్నసత్యం నిన్న తెలంగాణలో, నేడు ఏపీలో తేలిపోయిందన్నమాట!

LEAVE A RESPONSE