Suryaa.co.in

Editorial

వర్మ ‘వ్యూహం’పై ప్రశ్నలు వేయి!

– వర్మ సినిమాలో విలన్లే హీరోలు
– తమ అధినేతను విలన్‌గా చూపించడం సంతోషమన్న ఎంపి రఘురామకృష్ణంరాజు
– తమ అధినేత ఇమేజ్‌ను డామేజీ చేస్తున్నారన్న ఎంపీ రాజు
– రిలయన్స్‌పై జగన్ అభిమానుల నాటి దాడులు చూపిస్తారా?
– వైఎస్ మరణంపై సీబీఐ డిమాండ్ దృశ్యం ఉంటుందా?
– నత్వానీకి ఎంపీ సీటు ఇచ్చే సీన్ చూపిస్తారా?
– హోదాపై నాటి జగనన్న పోరాట వ్యాఖ్యలు ఉంటాయా?
-సీపీఎస్‌పై ఉద్యోగులకు హామీ చూపిస్తారా?
– కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పర్మినెంట్ హామీలు చూపిస్తారా?
– హెలికాప్టర్ ప్రమాదంపై బొత్స ఆరోపణలు ఉంటాయా?
– ఫిరాయింపులపై అనర్హత వేటు వ్యాఖ్యలు చూపిస్తారా?
– అమరావతికి భూములపై జగన్ వ్యాఖ్యలు చూపిస్తారా?
– షర్మిలతో వైరం ‘వ్యూహం’లో ఉంటుందా? లేదా?
– షర్మిల పాదయాత్ర దృశ్యాలుంటాయా?
– బ్రదర్ అనిల్ సువార్త ప్రచార సన్నివేశాలు చూపిస్తారా?
– వివేకా గుండె పోటు సీన్లు ఉంటాయా? ఉండవా?
– వెంకన్న ‘పింక్ డైమండ్’ ప్రస్తావన ఉంటుందా?
– వర్మ ‘వ్యూహం’పై సోషల్‌మీడియాలో ప్రశ్నల వర్షం
– టీడీపీ-జనసైనికుల ఎదురు ‘వ్యూహం’
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎంకిపెళ్లి సుబ్బిచావు కొచ్చినట్లు… వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మ తీస్తున్న ‘వ్యూహం’ సినిమా, ఇప్పుడు వైసీపీ అధినేత-ఏపీ సీఎం జగనన్న పాతకథను కొత్తగా రచ్చ చేసేలా మారింది. జగన్ కథ ఆధారంగా వర్మ తీసిన వ్యూహం సినిమా టీజర్‌పై , సోషల్‌మీడియా వేదికగా ఇప్పుడు జగనన్న ప్రత్యర్ధులు ఆయన విపక్ష నేతగా చేసిన వ్యాఖ్యలు గుర్తు చేస్తున్నారు. అప్పటి సంఘటనలు గుర్తు చేస్తూ.. అవన్నీ వర్మ సినిమాలో ఉంటాయా? లేవా అని నిలదీసే పనిలో ఉండటం ఆసక్తిక రంగా మారింది.

రానున్న ఎన్నికల్లో వైసీపీని తిరిగి విజయతీరాలకు చేర్చే వ్యూహంలో భాగంగా.. వైసీపీ నాయకత్వం అదే వ్యూహం పేరుతో రాంగోపాల్‌వర్మతో రెండు సినిమాలు ప్లాన్‌చేసింది. అందులో ఒకటి వ్యూహం కాగా, రెండోది శపథం. వ్యూహం సెప్టెంబర్ నెలాఖరులో విడుదల చేస్తుండగా, శపథం ఎన్నికలకు ముందు విడుదల చేయాలన్నది వర్మ ఆలోచన. దీనికి సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు, చిరంజీవి, పవన్ కల్యాణ్, సోనియాగాంధీ, జగన్ పాత్రలతో వర్మ విడుదల చేసిన టీజర్ చర్చనీయాంశమయింది.

వర్మ ‘వ్యూహం’ ఫలిస్తుందా? వికటిస్తుందా? అన్నది మరికొద్దిరోజుల్లో తేలిపోనుంది. సహజంగా ప్రభుత్వంలో ఉన్న వారికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు సినిమాలు తీస్తాయి. కానీ ఏపీలో విచిత్రంగా ప్రతిపక్షాలపై, అధికారపక్షమే సినిమాలు తీయిస్తోంది. వర్మ విడుదల చేసిన టీజర్ చూస్తే.. ఆయన ‘వ్యూహం’ అంతా వైసీపీ అధినేత జగనన్నకు అనుకూలం-టీడీపీ అధినేత చంద్రబాబు-పవన్‌కు వ్యతిరేకంగానే ఉంటుందన్నది మెడమీద తల ఉన్న ఎవరికైనా అర్ధమవుతుంది. ఈ సినిమాలో జగన్ అరెస్టుకు దారితీసిన పరిణామాలు, అందులో కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, రాష్ట్ర విభజన అంశాలుంటాయని వర్మ సినిమా టీజర్ చూస్తే స్పష్టమవుతుంది.

వర్మ సినిమాలో చూపించిన చంద్రబాబు, చిరంజీవి, పవన్ క ల్యాణ్, సోనియా, జగన్, భారతి పాత్రలు అచ్చం వారినే పోలి ఉన్నాయి. వర్మ ప్రత్యేకత అదే. అంతవరకూ బాగానే ఉన్నా.. వ్యూహంలో నాడు జగన్ అసెంబ్లీలో-బయటా వివిధ అంశాలపై చేసిన ప్రసంగాలు-వ్యాఖ్యలు ఉంటాయా? ఉండవా?.. జగనన్న పాదయాత్రలో ఇచ్చిన హామీలు చూపిస్తారా? లేదా?.. అసెంబ్లీలో జగన్‌కు వ్యతిరేకంగా ఇప్పటి మంత్రి బొత్స సత్యనారాయణ, అప్పటి పీఆర్పీ నేత కురసాల కన్నబాబు లాంటి వారు చేసిన వ్యాఖ్యలు ఉంటాయా? ఉండవా?

హెలికాప్టర్ మరణంపై సీబీఐ విచారణ చేయాలని, వైఎస్ మృతి వెనుక రిలయన్స్ హస్తం ఉందంటూ జగన్ కుటుంబం చేసిన ఆరోపణలు చూపిస్తారా? లేదా? ఆరోజు అభిమానులు రిలయన్స్ షాపులపై దాడుల దృశ్యాలు ఉంటాయా? లేదా? మళ్లీ అదే రిలయన్స్‌కు చెందిన పరిమళ్ నత్వానీకి వైసీపీ రాజ్యసభ సీటు ఇచ్చిన దృశ్యాలు చూపిస్తారా? లేదా? వంటి ప్రశ్నాస్త్రాలు వర్మను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. టీడీపీ-జనసేన సోషల్‌మీడియా సైనికులు.. ఇలాంటి ప్రశ్నలతో వర్మను ఆడేసుకోవడం ఆసక్తికరంగా మారింది. ఇప్పుడు సోల్‌మీడియాలో ఇదే హాట్ టాపిక్.

వైఎస్ హత్యకు రిలయన్స్ కంపెనీ అధినేత అంబానీయే కారణమంటూ, నాటి జగనన్న కుటుంబం మీడియాకెక్కిన విషయం తెలిసిందే. ఆ మృతిపై సీబీఐ విచారణ చేయాలని డిమాండ్ చేసింది. దానితో ఆగ్రహించిన అభిమానులు రిలయన్స్ షాపులపై దాడులు చేయగా, నాటి ప్రభుత్వం వారిపై కేసులు పెట్టింది.

జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, అదే రిలయన్స్ కంపెనీకి చెందిన పరిమళ్ నత్వానీకి, ఆశ్చర్యంగా వైసీపీ రాజ్యసభ సీటు ఇచ్చింది. దానిపై పెద్ద ఎత్తున విమర్శలు వినిపించాయి. ఈ కథ కూడా వర్మ వ్యూహంలో ఉంటుందా లేదా అని సోషల్ మీడియా వేదికగా, టీడీపీ-జనసైనికులు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

అక్రమాస్తుల కేసులో జగనన్న జైలులో ఉన్న సమయంలో… పార్టీ శ్రేణుల మనోస్థైర్యం దెబ్బతినకుండా, ఆయన చెల్లి షర్మిల పాదయాత్ర నిర్వహించి పార్టీని కాపాడారు. ఒక మహిళ అన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేయటం, అప్పట్లో దేశంలోనే రికార్డు.

షర్మిల భర్త బ్రదర్ అనిల్ కూడా, ఎన్నికల ముందు క్రైస్తవ ప్రచారకులను భారీ స్థాయిలో సేకరించారు. లోటస్‌పాండ్ వేదికగా రహస్య సమావేశాలు నిర్వహించారు. సువార్త కూటములతో, క్రైస్తవ-దళిత క్రైస్తవులను వైసీపీ వైపు మళ్లించారు. జగన్ గెలవాల్సిన అవసరాన్ని ప్రతి క్రైస్తవుడికీ గుర్తు చేశారు. జగన్ విజయంలో బ్రదర్ అనిల్‌ది కీలకపాత్ర అన్నది మనం మనుషులం అన్నంత నిజం.

ఆ తర్వాత తలెత్తిన పరిణామాల్లో షర్మిల తన అన్న జగన్‌కు దూరమై, తెలంగాణలో పార్టీ పెట్టారు. తల్లి విజయమ్మ కూడా తన వైసీపీ గౌరవాధ్యక్ష పదవికి రాజీనామా చేసి, కూతురు షర్మిల వెంట నడవడం సంచలనం సృష్టించింది. ఆ ఘట్టాలన్నీ వర్మ సినిమాలో ఉంటాయా? ఉండవా అన్న చర్చకు టీజర్ విడుదల తెరలేపింది. ఒకవేళ ఇవన్నీ వ్యూహంలో చూపించకపోయినా, తర్వాత తీయబోతే ‘శపథం’లోనయినా చూపిస్తారా? లేదా? అన్న ఆసక్తి నెలకొంది.

ప్రధానంగా గత ఎన్నికల్లో వైసీపీ గెలిచేందుకు కారణమైన వివేకా హత్య కేసును వర్మ వ్యూహంలో చూపిస్తారా? లేదా? అన్న ఆసక్తి నెలకొంది. వివేకాది తొలుత గుండెపోటు అని చెప్పడం, తర్మాత గొడ్డలిపోటుగా నిర్ధరణ కావడంతో.. దానిపై ఆయన కుమార్తె డాక్టర్ సునీత ఫిర్యాదు చేసి, కోర్టుకెక్కడం సంచలనం సృష్టించింది.

ఆ తర్వాత సీబీఐ విచారణ, ఈ మొత్తం పరిణామాల్లో షర్మిల తన బాబాయ్ కుటుంబానికి అండగా ఉండి సీబీఐకి స్టేట్‌మెంట్ ఇవ్వడం, జగన్ సోదరుడైన ఎంపి అవినాష్‌రెడ్డిని సీబీఐ అరెస్టు చేసి బెయిలివ్వడం, ఆయన తండ్రి భాస్కరరెడ్డిని అరెస్టు చేయడం వంటి కీలక ఘట్టాలు కూడా, వర్మ సినిమాలో ఉంటాయని వైఎస్ అభిమానులు ఆశిస్తున్నారు.

గత ఎన్నికల్లో టీడీపీ సర్కారుపై వైసీపీ సంధించిన వెంకన్న పింక్ డైమండ్ సెంటిమెంట్ అస్త్రం సన్నివేశాలు కూడా, వర్మ వ్యూహంలో ఉంటాయా లేవో చూడాలి. పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందంటూ విజయసాయిరెడ్డితో పాటు, రమణదీక్షితులు చేసిన ఆరోపణలు హిందూ సమాజంలో కలకలం రేపాయి. ఆ తర్వాత టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి.. అసలు వెంకన్నకు పింక్‌డైమండ్ లేనేలేదని స్పష్టం చేశారు.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై, తన అనుమతి లేకుండానే వేయమని నిండుసభలో జగన్ శాసనసభ స్పీకర్‌ను కోరారు. ఆ తర్వాతనే టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరారు. ఆ ఘట్టాలు కూడా వర్మ తన వైరంలో చూపిస్తారా? అని టీడీపీ-జనసేన సోషల్ మీడియా సైనికులు వర్మను ప్రశ్నిస్తున్నారు.

జగనన్న ఎన్నికల ముందు చేసిన పాదయాత్రలో.. ఉద్యోగులకు సీపీఎస్ వారంలో రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్టు-అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తానని హామీ ఇచ్చారు. తనకు ఎంపీ సీట్లన్నీ ఇస్తే కేంద్రం మెడలు వంచి, ప్రత్యేక హోదా తీసుకువస్తానని హామీ ఇచ్చారు. రాజధానిని అమరావతిని అక్కడే నిర్మిస్తామని, 25 వేల ఎకరాలు సరిపోవన్న జగన్ వాదన, తర్వాత మూడురాజధానుల ప్రకటన కూడా సినిమాలో చూపించే సాహసం వర్మ చేస్తారా? లేదా? అన్న చర్చ సోషల్‌మీడియా వేదికగా జరుగుతోంది.

అయితే వర్మ వ్యూహంపై వైసీపీ రెబెల్ ఎంపి రఘురామకృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు ఆసక్తి కలిగిస్తున్నాయి. తాను ఎంతో అభిమానించే దర్శకుడు.. తాను తీవ్రంగా అసహ్యించుకునే వ్యక్తి జీవితచరిత్ర తీయడం బాధగా ఉందని వ్యాఖ్యానించారు.

అయితే.. వర్మ సినిమాల్లో సహజంగా విలన్లను హీరోగా చూపిస్తారని, మరి ఆ ప్రకారంగా తమ అధినేతను విలనుగా చూపించడం, తనకు సంతోషం వేసిందన్న వ్యంగ్యాస్త్రం చర్చనీయాంశమయింది. ఆవిధంగా తమ అధినేత ఇమేజ్ భారీగా డామేజీ కావడం బాధాకరమన్న రాజు గారి సెటైర్లను నెటిజన్లు, వీడియో పెట్టి మరీ ర్యాంగింగ్ చేస్తున్నారు.

1 COMMENTS

LEAVE A RESPONSE