Suryaa.co.in

Editorial

రామూ భయపడ్డాడా?..

– తానెవరికీ భయపడనని గతంలో చెప్పిన రాంగోపాల్‌వర్మ
– వివాదాస్పద సినిమాలు తీసినా బెదరని వర్మ
– మాఫియాపైనే ఎన్నో సినిమాలు తీసిన సాహసి
– విమర్శలు, ఆరోపణలకు తొణకని వైనం
– ఇప్పుడు దళిత మేధావి కొలికపూడి హెచ్చరికకే ఫిర్యాదు
– ఏపీ డీజీపీకి కొలికపూడి శ్రీనివాసరావుపై ఫిర్యాదు
– తన హత్యకు సుపారీ ఇచ్చాడని వర్మ ఆరోపణ
– స్వయంగా డీజీపీనే ఫిర్యాదు తీసుకున్న వైనం
– ఆర్జీవీ కూడా మామూలు బెదురుజీవేనా?
– టీవీల ముందు చెప్పేవన్నీ ఉత్తుత్తి కహానీలేనా?
– వర్మ ఇమేజీపై సోషల్ మీడియాలో సరికొత్త చర్చ
– గతంలో మాజీ సీఎం బాబు, ఎమ్మెల్యే, ఎంపీలకే అపాయిట్‌మెంట్ ఇవ్వని డీజీపీ
– మహామొండి వర్మ దళిత మేధావి కొలికపూడి హెచ్చరికకే భయపడ్డారా?
( మార్తి సుబ్రహ్మణ్యం)

రాంగోపాల్‌వర్మ పరిచయం అవసరం లేని పేరు. ఓడ్కా ప్రియులు.. పోర్ను ముచ్చట్లు విని- చూసే శృంగారప్రియులు.. మాఫియా డాన్లతో యుద్ధాలు.. నడిరోడ్లపై హత్యాకాండలు.. బాంబులు పెట్టి ప్రత్యర్ధులను లేపేసి భయోత్పాతం సృష్టించే సన్నివేశాలతోపాటు, సైకిల్ చైన్‌ను ఒంటిచేత్తో సర్రున లాగేసే హీరోయిజాన్ని ఇష్టపడేవారికి.. అంతకుమించి.. వివాదాలు ఇష్టపడే అదోరకం శాల్తీలకు, ఆర్జీవీ అంటే అదో రకమైన ఇష్టం. ఆయన టేస్టంటే వారికి అదోరకమైన తుత్తి. ఇది కూడా చదవండి: వర్మ ‘వ్యూహం’పై ప్రశ్నలు వేయి!

నిజానికి ఆర్జీవీ కూడా ఎవరినీ లెక్కపెట్టే టైపు కాదు. సమాజంలోనే ఉన్నా.. ఆయన సమాజాన్ని లెక్కచేయరు. నా సినిమా ఇష్టం ఉంటే చూడండి. లేకపోతే పొమ్మని నిర్లక్ష్యంగా చెబుతారు. నేను నేలటికెట్ల వాళ్ల కోసమే సినిమా తీస్తానని నిర్మొహమాటంగా చెబుతారు. మాఫియాపై సినిమా తీసినా.. నిర్భయంగా ముంబయిలో జీన్స్, జర్కిన్ వేసుకుని ఇష్టమైన నటీమణులతో డాన్సులు వేసి, ఎర్లీమార్లింగ్ ఓడ్కా తాగే టైపు ఆయన. ఎంతమంది హెచ్చరించినా.. దాడులు చేస్తామని బెదిరించినా ఎవరినీ లెక్కచేయరు. ఫ్యాక్షన్ కుటుంబాలపై ఎన్నో సినిమాలు తీసినా, ఎప్పుడూ బెదిరిపోని నైజం ఆయనది. తనకు నచ్చినట్లు బతుకుతానే తప్ప ఎదుటివారికి నచ్చినట్లు బతకనని నిష్కర్షగా చెప్పే ‘నిస్సగ్గరి’ వర్మ.

ఇప్పుడు ఈ ఉపోద్ఘాతాలు, ఇంట్రడక్షన్లూ దేనికంటే… అంతలావు ఆర్జీవీ, ఒక టీవీ చర్చావేదికలో పాల్గొన్న డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు అనే దళిత మేధావి, విద్యావేత్త.. తనను చంపడానికి కోటి రూపాయలు సుపారీ ఇచ్చాడంటూ డీజీపీకి ఫిర్యాదు చేసినందుకు! ఒక చానెల్‌లో మాట్లాడిన కొలికపూడి, ఆర్జీవీ తల తెచ్చిన వారికి కోటి రూపాయలు ఇస్తానని ప్రకటించారు.

ఎంతోమందిని ఐఏఎస్‌లుగా తీర్చిదిద్దిన కొలికపూడి శ్రీనివాసరావు దగ్గర.. అసలు కోటి రూపాయలున్నాయా? ఆయనకు అంత ఆర్ధిక స్తోమత ఉందా? కోటిరూపాయలిచ్చేంత తాహతు ఉన్న వాడా? కాదా? అన్నది బుర్ర- బుద్ధి ఉన్నవారు ముందుగా ఆలోచించాల్సిన ప్రశ్న.

ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమాలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్, జనసేనాధిపతి పవన్ కల్యాణ్‌ను పోలిన పాత్రలను, విలన్లుగా చూపిస్తున్నారన్నది ప్రధాని విమర్శ. దాని వైసీపీ ఆర్ధికసాయం ఉందన్నది టీడీపీ-జనసేన ఆరోపణ. ఆమేరకు విడుదలైన ప్రోమోలు కూడా అలాగే ఉన్నాయి మరి.

ఇది తెలిసిన టీడీపీ-జనసేన కార్యకర్తలు, ఆర్జీవీపై కారాలు మిరియాలు నూరుతున్నారు. హైదరాబాద్‌లో తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి ఆధ్వర్యంలో ఆర్జీవీ దిష్టిబొమ్మ తగులబెట్టగా.. జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ తిరునగరి జోత్స్న ఏకంగా, ఆర్జీవీపై పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. అటు లోకేష్ కూడా ఆ సినిమాపై కోర్టులో కేసు వేశారు. ఇదీ అసలు కథ.

అయితే ‘వ్యూహం’ సినిమాలో జగన్ బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య, సీబీఐ దర్యాప్తు, ఎంపి అవినాష్ రెడ్డి అరెస్టు, షర్మిలతో విబేధాలు వంటి అంశాలు కూడా వ్యూహం సినిమాలో ఉంటేనే.. కథ రక్తి కడుతుందన్నది, ఆర్జీవీ అభిమానుల కోరిక. మరి అవన్నీ ఆ సినిమాలో ఉంటాయా? లేవా? అన్నది వేరే కథ.

పెద్ద పెద్ద మాఫియా డాన్లూ, సీమ ఫ్యాక్షనిస్టుల హెచ్చరికలకే బెదరని ఆర్జీవీ అనే సాహసి.. ఒక దళిత మేధావి చేసిన వ్యాఖ్యకు బెదిరిపోయి.. హడావిడిగా ఫ్లైట్‌లో తాను తీసిన ‘బెజవాడ’కు వెళ్లి, కొలికపూడిపై చర్యలు తీసుకోవాలని కోరడమే వింత. నిజానికి ఆర్జీవీ వంటి ధీశాలి అంత బేలగా వ్యవహరిస్తారని ఎవరూ ఊహించి ఉండరు.

ఎవరైనా తమను బెదిరిస్తే వారిపై, పోలీసులకు ఫిర్యాదు చేసే హక్కు ఎవరికయినా ఉంటుంది. దానిని తప్పుపట్టాల్సిన పనిలేదు. కానీ అభిమానుల దృష్టిలో ఆర్జీవీ టైపు వేరు కదా? ఆయన ఎవరికీ బెదరడన్న బిల్డప్ ప్రచారంలో ఉంది కదా? అందుకు భిన్నంగా జరగడమే అందరి ఆశ్చర్యానికి కారణం!

సరే.. పోలీసులు కొలికపూడిపై చర్యలు తీసుకుంటారా? లేదా? హైదరాబాద్ వచ్చి ఆయనను ఎత్తుకెళతారా? అందుకు తెలంగాణ పోలీసులు ఇప్పుడున్న పరిస్థితుల్లో అంగీకరిస్తారా? లేదా? అన్నది వేరే ముచ్చట. ఇంతోటి హెచ్చరికకే రామూ, కిందూమీదయి పోలీసుల శరణు వేడటమే అందరి ఆశ్చర్యం.

అంటే ఆర్జీవీ ఇప్పటిదాకా టీవీ ఇంటర్వ్యూలలో, అందమైన యాంకరమ్మల ముందు కాలుమీదకాలేసుకుని.. కాఫీ తాగుతూ కేర్‌లెస్‌గా చెప్పినవన్నీ ఉత్తి ముచ్చట్లేనా? నేనింతే.. నన్నెవరూ భయపెట్టలేరన్న కబుర్లన్నీ ఉత్తి కహానీలేనా?.. అంటే ఆర్జీవీ కూడా మనలాంటి ‘బెదురుజీవి’ కామోసని.. ఆయనను అభిమానించే లక్షలాది మంది భావిస్తే, వర్మగారి ఇమేజీకి భారీ డ్యామేజీనే కదా? అసలు ఆర్జీవీ మార్కెటింగ్ అంతా ఆయన పెంచుకున్న ఇమేజీపైనే కదా? మరలాంటి ఇమేజీ డ్యామేజీ అయితే, రేపటి నుంచి వర్మను ఎవరు దేకుతారు? ఈ ఆర్జీవీ మనలా బెదురుజీవి అనుకోరూ?!

అయినా కొలికపూడి మాట్లాడింది హైదరాబాద్‌లో అయితే.. ఆర్జీవీ బెజవాడ పోలీసులకు ఫిర్యాదు చేయడం ఏమిటి చెప్మా?! ఏపీలో అయితే.. ‘మీది బెజవాడ మాది బెజవాడ’ కాబట్టి, ‘అటుంచి నరుక్కురావాల’న్న ఐడియా ఉండవచ్చన్నది, ఆర్జీవీ అభిమానుల ఉవాచ. అయితే ఆయన అభిమానులు మాత్రం దీనిని జీర్ణించుకోలేపోతున్నారు. ఇది వర్మకు వచ్చిన ఆలోచన కాకపోవచ్చని, జగనన్న సర్కారును రోజూ ఉతికిఆరేస్తున్న కొలికపూడి.. తనకు తెలియకుండా పడిన ఉచ్చులో అలాగే బంధించేందుకు, రాజకీయ బుర్రలు పన్నిన ‘వ్యూహం’ కావచ్చన్నది వారి డౌటనుమానం.

అయితే.. ఇక్కడ మరో విచిత్రం కూడా కనిపించింది. ఏపీలో దారితప్పుతున్న శాంతిభద్రతలు, తమ పార్టీ నేతల అక్రమ అరెస్టులను డీజీపీ దృష్టికి తీసుకువెళ్లేందుకు.. మాజీ సీఎం చంద్రబాబు సహా ఎమ్మెల్యేలు, ఎంపీలు చాలాసార్లు ప్రయత్నించి విఫలమయ్యారు. డీజీపీ సారు, వారికి ఇప్పటిదాకా అపాయింట్‌మెంట్ ఇచ్చిన దాఖలాలు లేవు. ఎవరైనా ఎమ్మెల్యేలు కలవాలనుంటే.. చీఫ్ ఆఫీస్‌లో ఏ అడిషనల్ డీజీనో, ఏ డీఎస్పీనో కలసి వినతిపత్రాలు ఇవ్వాల్సిందే.

కానీ హింసాత్మక-వివాదాస్పద సినిమాలు తీసే ఆర్జీవీ ఇచ్చిన ఫిర్యాదును, స్వయంగా డీజీపీ వంటి పెద్దాఫీసరు తీసుకోవడమే ఆశ్చర్యం. అలా చేయడం మంచిదా ? కాదా? అన్నది వేరే చర్చ. ఇప్పటికే ఆర్జీవీ మీద అనేక కేసులు అటు కోర్టుల్లో, ఇటు పోలీసుస్టేషన్లలో పెండింగ్‌లో ఉన్న విషయం, బహుశా డీజీపీకి తెలియకపోవచ్చేమో మరి! ఆర్జీవీ చెప్పినట్లు.. ఎవరి ‘వ్యూహం’ వారిది!!

LEAVE A RESPONSE