Home » బీజేపీ జాతీయ కమిటీలో ‘తెలుగు’ వెలుగు

బీజేపీ జాతీయ కమిటీలో ‘తెలుగు’ వెలుగు

– 10 మందికి జాతీయ కార్యవర్గంలో చోటు
– ఏపీ నుంచి కన్నా ఒక్కరే
– తెలంగాణ నుంచి ఆరుగురికి చోటు
– విజయశాంతి, ఈటలకు ప్రత్యేక ఆహ్వానితుల హోదా
– ఏపీ, తెలంగాణకు ప్రాధాన్యం
( మార్తి సుబ్రహ్మణ్యం, హైదరాబాద్)
చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్న బీజేపీ జాతీయ కార్యవర్గ ఏర్పాటుకు ఎట్టకేలకూ మోక్ష, లభించింది. మొత్తం 80 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులతో కూడిన కమిటీని గురువారం పార్టీ జాతీయ అధ్యక్షుడు జెపి నద్దా ప్రకటించారు. తాజాగా ప్రకటించిన జాబితాలో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇవ్వడం విశేషం. మొత్తం 10 మంది తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహించే అవకాశం తొలిసారి వచ్చింది.
బీజేపీ చీఫ్ నద్దా ప్రకటించిన 80 మంది జాతీయ కార్యవర్గ సభ్యుల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి పార్టీ మాజీ అధ్యక్షుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఒక్కరికే స్థానం లభించగా, తెలంగాణ నుంచి కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, మాజీ ఎంపి గరికపాటి మోహన్‌రావు, జితేందర్‌రెడ్డి, జి. వివేక్ వెంకటస్వామికి చోటు లభించింది. ఇక విజయశాంతి, ఈటల రాజేందర్‌కు ప్రత్యేక ఆహ్వానితులుగా స్థానం లభించింది. ఇప్పటికే ఏపీ నుంచి పురందీశ్వరి జాతీయ ప్రధాన కార్యదర్శి, సత్యకుమార్ జాతీయ కార్యదర్శిగా పనిచేస్తున్నారు.
ఇక ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణపై, బీజేపీలోని ఒక వర్గం జాతీయ నాయకత్వానికి ఫిర్యాదులు చేసిన ఫలితంగా, ఆయనను ఏడాది క్రితం ఆ పదవి నుంచి తొలగించారు. వైసీపీ సర్కారుపై దూకుడుగా వెళ్లిన కన్నా నాయకత్వంలోని బీజేపీ.. ఒకదశలో ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీని కూడా వెనక్కి నెట్టేసింది. దానితో చాలామంది టీడీపీ సీనియర్లు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న సమయంలో, హటాత్తుగా కన్నాను తొలగించడంతో టీడీపీ నుంచి వలసలు నిలిచిపోయాయి.
ఆయన స్థానంలో కాపు వర్గానికే చెందిన సోము వీర్రాజును నియమించినప్పటికీ, ఏపీలో పార్టీ విస్తరించకపోగా కనీసం స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయలేని దుస్థితికి చేరింది. జాతీయ ప్రధాన కార్యదర్శి, సహ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి కూడా అనేక వేదికలపై సోము నాయకత్వంలోని పార్టీ పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వంపై పోరాటం చేయడంలో ఏపీ బీజేపీ నాయకత్వం విఫలమయిందని, గతంలో కొందరు నేతలు కన్నా లక్ష్మీనారాయణపై చేసిన ఆరోపణల్లో పసలేదని జాతీయ నాయకత్వం ఆలస్యంగా గ్రహించింది. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోవడంతో, కన్నాకు సముచిత స్ధానం కల్పిస్తామని జాతీయ నాయకత్వం కొద్దినెలల క్రితం హామీ ఇచ్చినట్లు పార్టీలో ప్రచారం జరిగింది. దానికి తగినట్లుగానే తాజా జాతీయ కమిటీలో కన్నాకు స్థానం లభించడం బట్టి, ఆయనకు పార్టీ నాయకత్వం ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోంది. తెలంగాణలో ఆరుగురికి స్థానం కల్పించిన జాతీయ నాయకత్వం, ఏపీ నుంచి మాత్రం కన్నా ఒక్కరికే చోటివ్వడమే దానికి నిదర్శనమని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, రాజ్‌నాధ్‌సింగ్, గడ్కరీ వంటి ప్రముఖులున్న జాతీయ కార్యవర్గ సభ్యుల జాబితాలో తెలుగువారయిన కన్నా లక్ష్మీనారాయణ, కిషన్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, వివేక్, జితేందర్‌రెడ్డికి స్థానం కల్పించడం బట్టి.. జాతీయ నాయకత్వం దృష్టి త్వరలో తెలుగు రాష్ట్రాలపై పడబోతోందని అర్ధమవుతోందని పార్టీ అగ్రనేతలు విశ్లేషిస్తున్నారు.
ఇక తెలంగాణలో ఇటీవలి కాలంలో పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా వ్యవహరిస్తున్న మాజీ ఎంపి గరికపాటి మోహన్‌రావు, జితేందర్‌రెడ్డి, జి. వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, ఈటల రాజేందర్‌కు స్థానం కల్పించడం ద్వారా వారి సేవ లను గుర్తించినట్టయింది. నిజానికి గరికపాటి, జితేందర్‌రెడ్డి, వివేక్ ముగ్గురూ తెలంగాణ రాష్ట్రంలో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటు, అసెంబ్లీ ఉప ఎన్నికల్లో సొంత నిధులు వెచ్చించారు. పార్టీ కార్యక్రమాలను తెరవెనుక ఉండి నడిపించారు. విజయశాంతి కూడా ఇటీవలి కాలంలో కేసీఆర్ సర్కారుపై విరుచుకుపడుతూ, క్రియాశీలకమవుతున్నారు.
పార్టీకి సేవలందిస్తున్న వీరికి, జాతీయ కమిటీలో స్థానం లభించడంపై హర్షం వ్యక్తమవుతున్నప్పటికీ.. ఇటీవలే పార్టీలో చేరిన ఈటలకు ప్రత్యేక ఆహ్వాతునిడిగా స్థానం ఇవ్వడంపైనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన కంటే సీనియర్లు చాలామంది ఉన్నప్పటికీ, వారిని పరిగణనలోకి తీసుకోకపోవడం వెనుక, రాష్ట్ర పార్టీని నడిపిస్తున్న ఒక ప్రముఖుడి హస్తం ఉందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా ఇప్పటికే తెలంగాణ నుంచి డికె అరుణ జాతీయ ఉపాధ్యక్షురాలిగా పనిచేస్తున్నారు. తాజా నియామకాలతో తెలంగాణ నుంచి ఏడు, ఆంధ్రా నుంచి ముగ్గురికి జాతీయ కమిటీలో స్థానం లభించినట్టయింది.

Leave a Reply