ఆడింది క్రికెట్.. వేసింది టెన్నిస్ బాల్!

– ఆడుదాం ఆంధ్రా ప్రారంభించిన సీఎం జగన్
– క్రికెట్ ఆడిన సీఎం జగనన్న
– కొట్టింది క్రికెట్ బాల్‌ను కాదు
– టెన్నిస్ బంతితో క్రికెట్ ఆడిన జగనన్న
– సోషల్‌మీడియాలో పేలుతున్న సెటైర్లు
– ఇదేం క్రికెట్టెన్నీస్ అంటూ నెటిజన్ల వ్యంగ్యాస్త్రాలు
– ప్లాస్టిక్ బాల్ అయితే ఇంకా బాగుంటుంది కదా అని సెటైర్లు
( మార్తి సుబ్రహ్మణ్యం)

క్రికెట్ గ్రౌండ్‌లో టెన్నిస్ ఆడితే ఎలా ఉంటుంది? ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో క్రికెట్ ఆడితే ఎలా ఉంటుంది? టెన్నిస్ కోర్టులో క్రి కెట్ ఆడితే ఎలా ఉంటుంది? ఇదిగో.. ‘తెలుగింగ్లీష్’ మాదిరిగా, ఏపీ సీఎం ఆడిన ‘క్రికెట్టెన్నీస్ గేమ్’లా ఉంటుంది! ఇప్పుడు సోషల్‌మీడియాలో నెటిజన్లు పేలుస్తున్న సెటైర్లు ఇవే. ఇక ‘ఆడుదాం ఆంధ్రా’లోకి వెళ్లి ఆ ముచ్చట్లేవో చూద్దాం రండి!

ఏపీలో క్రీడలను ప్రోత్సహించి, దేశానికి ఆణిముత్యాలను ఆందిస్తామని ఏపీ సీఎం జగనన్న ప్రకటించారు. హ్యాపీస్! అందుకే ఆడుదాం ఆంధ్రాను ప్రారంభించామని చెప్పారు. డబుల్ హ్యాపీస్!! ఆ మేరకు 50 కోట్లకు పైగా ఖర్చు పెట్టి ఆడుదాం ఆంధ్ర పేరుతో ఒక సంబరానికి తెరలేపారు. ఇందులో తప్పుపట్టాల్సిన అంశాలేమీ లేవు. ఆంధ్రా పిల్లకాయల గొప్పతనం, ప్రపంచానికి చాటాలనుకోవడం తప్పెలా అవుతుంది?

ఆ మేరకు జగనన్నయ్య గుంటూరులో ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడోత్సవాలను ప్రారంభించారు.

క్రికెట్ ఆడటం ద్వారా ఆడుదాం ఆంధ్రాను ప్రారంభించిన జగనన్నయ్య.. బ్యాట్‌తోపాటు క్రికెట్ బంతితో ఆడి, ప్రారంభిస్తే అసలు ఎలాంటి పంచాయతీ ఉండేదే కాదు. కానీ జగనన్నయ్య క్రికెట్ బ్యాట్‌తో

క్రికెట్ బంతిని కాకుండా… టెన్నిస్ బంతిని కొట్టారు. అటు వైపు బైరెడ్డి సిద్దార్ధరెడ్డి వేసింది కూడా టెన్నిస్ బాలే మరి! ఆయన మాత్రం ఏం చేస్తారు? అధికారులు ఏ బంతి ఇస్తే దానితో బౌలింగ్ చేశారాయన.

ఏమాటకామాట! సీఎం జగనన్నయ్య మాత్రం ఒక సచిన్, ఒక విరాట్ కోహ్లీ, ఒక కపిల్‌దేవ్‌లా పక్కా ప్రొఫెషనల్ మాదిరిగా షాట్లు అదరగొట్టేశారు. సీఎం సార్ క్రికెట్ షాట్లన్నీ సోషల్‌మీడియాలో బ్రహ్మాండంగా వైరల్ అయ్యాయి. ఫ్రంట్ ఫుట్ వేసి మరీ కొట్టిన షాట్లు చూడముచ్చటగానే ఉన్నాయి. కానీ సోషల్‌మీడియాలో వీటిని విశ్లేషించడానికి, నెటిజన్లు అనే ఒక సెక్షన్ ఉంటుంది కదా? వాటి చేతులు ఊరుకోవు కదా? అటు జగనన్నయ్య క్రికెట్ ఆడే ఫొటోలు సోషల్‌మీడియాలో రావడం.. ఇటు వాటిపై వ్యంగ్యాస్త్రాలు సంధించడం చకచకా జరిగిపోయాయి. ఆ ముచ్చటే ఈ ముచ్చట!

‘ఇంతోటి దానికి క్రికెట్ బ్యాటే ఎందుకు? మామూలు చెక్క బ్యాట్లు సరిపోతాయి కదా?’.. అక్కడికేదో ఒరిజినల్ క్రికెట్ బాల్‌ను కొట్టినట్లు బిల్డప్ ఎందుకు? కొట్టింది టెన్నిస్ బాల్‌నే కదా?.. ‘ఇంత పెద్ద క్రికెట్ టోర్నమెంటుకు రోజక్క కీపర్‌గా ఉండటం ఎందుకో? ఏ బాల బచ్చాను పెట్టినా సరిపోతుంది కదా?’.. ‘ అన్నయ్య ఈ మ్యాచ్ కోసం చాలా కష్టపడి ప్రాక్టీస్ చేసి ఉంటారు’.. ‘కనీసం సహజత్వం కోసమైనా నిజమైన క్రికెట్ బాల్‌తో ఆడి ఉంటే బాగుండేది. ఎట్‌లీస్ట్ మీడియాకు ఫొటోల కోసం, కనీసం కార్కు బాల్ అయినా వేస్తే పుణ్యం పురుషార్ధం దక్కేది’..

‘తెలుగింగ్లీష్’ మాట విన్నాం. కానీ ‘క్రికెట్టెన్నీస్’ ఇప్పుడే చూస్తున్నాం. కొంపదీసి ఆడుదాం ఆంధ్రాలో క్రికెట్ మ్యాచ్‌లన్నీ ఇలా టెన్నిస్ బాల్‌తో జరుగుతాయా ఏందబ్బా’.. ‘చిన్నపిల్లలు టెన్నిస్ బాల్‌తో క్రికెట్ ఆడుకోవడం చూశాం. కానీ ఈ వయసు వాళ్లు కూడా టెన్నిస్ బాల్‌తో ఆడటం ఇప్పుడే చూస్తున్నాం సామీ’.. టెన్నిస్ బాల్ కాకుండా ప్లాస్టిక్ బాల్‌తో వేస్తే ఇంకా యమా వీజీగా ఉంటుంది కదా?’.. ‘ అసలు క్రికెట్టెన్నీస్ వరల్డ్ కప్ టోర్నమెంటు పెడితే బాగుంటుంది బాసూ’అని, నెటిజన్లు ‘క్రికెట్టెన్నీస్’ ఆడేసుకున్నారు.

అయినా బ్యాట్‌తో దేనిని కొడితే ఏంటి? తగిలిందా? పోయిందా? చప్పట్లు కొట్టారా? ఫొటో వచ్చిందా? లేదా? అని కదా ముఖ్యం?! ఇదీ బుద్ధిజీవుల ఉవాచ!!

Leave a Reply