కోడెల కోరికకు భిన్నంగా కొడుకు శివరాం!

– తన వారసులు రాజకీయాల్లోకి రారని స్పష్టం చేసిన దివంగత నేత కోడెల
– తనకు వారసత్వ రాజకీయాలు ఇష్టం లేదని కోడెల శివప్రసాద్ స్పష్టీకరణ
– అందుకు భిన్నంగా కొడుకు శివరాం అడుగులు
– పార్టీ నాయకత్వంపై తిరుగుబాటును అంగీకరించలేకపోతున్న తమ్ముళ్లు
-దానితో టీడీపీలో కోడెల శివరాం ఒంటరి!
– సత్తెనపల్లిలో శివరాంతో కలసిరాని తమ్ముళ్లు
– పార్టీ ఆదేశాలే శిరోధార్యమన్న టీడీపీ సీనియర్లు
– వైవి, మల్లి వర్గమంతా కన్నా వైపే
– బాబు ఆదేశాలు పాటిస్తామన్న ఆ ఇద్దరు నేతలు
– కోడెల శివరామ్‌కు వ్యతిరేకంగా సర్వే ఫలితాలు
– నాటి ఘటనలే కారణమంటున్న తమ్ముళ్లు
– ఆయన తీరు వల్లే పార్టీకి వ్యతిరేకత నివేదికల నిర్థరణ
– అయినా నాయకత్వానికి వ్యతిరేకంగా శివరాం వ్యాఖ్యలు
– పార్టీపై శివరాం పోరాటం ఫలిస్తుందా?
– వైసీపీ మీడియాలో శివరామ్‌కు స్థానంపై తమ్ముళ్ల అనుమానాలు
– శివరామ్ పోరాటానికి వైసీపీ మీడియాలో ప్రముఖ స్ధానమా?
– ఆయన వెనుక ఎవరున్నారన్న చర్చ
– శివరాం పార్టీలో కొనసాగే అంశంపై తమ్ముళ్ల అనుమానాలు
– పార్టీలోనే ఉంటేనే శివరామ్‌కు గౌరవమంటున్న తమ్ముళ్లు
– బాబును తిట్టిన కన్నాను ఎలా చేర్చుకుంటారంటూ శివరాం ప్రశ్నాస్త్రాలు
– గతంలో టీడీపీని తిట్టిన కాంగ్రెస్ నేతలను కోడెల ఎలా చేర్చుకున్నారంటూ శివరాంపై తమ్ముళ్ల ఎదురుదాడి
– పార్టీ సూచనల మేరకు నర్సరావుపేట నుంచి సత్తెనపల్లికి మారిన కోడెల శివప్రసాదరావు
– నర్సరావుపేటలో ఓడిపోతారన్న నివేదికలతోనే సత్తెనపల్లికి సిఫార్సుచేసిన నాయకత్వం
– అందుకే అక్కడ గెలిచారని తమ్ముళ్ల విశ్లేషణ
– ఇప్పుడు అందుకు విరుద్ధంగా శివరాం తీరుపై తమ్ముళ్ల విస్మయం
– సత్తెనపల్లిలో శివరామ్‌కు పూర్తి వ్యతిరేకత ఉందన్న టీడీపీ సర్వే నివేదికలు
– అందుకే కన్నా లక్ష్మీనారాయణకు ఇన్చార్జి బాధ్యతలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

డాక్టర్ కోడెల శివప్రసాదరావు.. ఈ పేరు చెబితే ఒక వైబ్రేషన్. నరసరావుపేట గుంటూరు రోడ్డులో లక్ష్మీ నర్సింగ్‌హోం పెట్టుకుని, హస్తవాసి ఉన్న డాక్టర్‌గా పేరున్న ఆయనకు, తెలుగుదేశం పార్టీ పిలిచి టికెట్ ఇచ్చింది. అప్పటివరకూ రెడ్లకు కేంద్రస్థానంగా ఉన్న నరసరావుపేట రాజకీయాలను, తిరగరాసిన పోరాటయోద్ధ డాక్టర్ కోడెల. మంత్రి నుంచి స్పీకర్ పదవులన్నీ పార్టీ ఇచ్చినవే. అప్పటికే సీనియర్లను కాదని, ఆ పదవులు ఆయనను వరించాయి. కోడెల ఉన్నతి కోసం ఎంతోమంది పనిచేశారు.అందుకే కోడెల అంటే టీడీపీ. టీడీపీ అంటే కోడెల!

ప్రధానంగా.. మానవ హక్కుల కమిషన్ మాజీ చైర్మన్.. నాటి గ్రంధాలయ సంస్థ చైర్మన్ కాకుమాను పెద పేరిరెడ్డి, ఆయన ఉన్నతి కోసం పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఆయనకు వ్యూహకర్త అన్న పేరు. తర్వాత కాలంలో రోశయ్య, మేకపాటి రాజమోహన్‌రెడ్డికి ఆయనే రాజకీయ సలహాదారు. అప్పట్లో రాజకీయాలు తెలియని కోడెల వెన్నంటి , పేరిరెడ్డి దన్నుగా నిలిచారు. కోడెల లెటర్‌హెడ్స్ ఆయన దగ్గరుంటే, మేటర్ తయారుచేస్తే సంతకం మాత్రమే చేసే బాధ్యత కోడెలది. ఇద్దరూ కలసి ఎన్టీఆర్ వద్దకు వెళ్లేవారు.

ఇప్పుడంటే హైదరాబాద్‌కు వెళ్లాలంటే కార్లు, విమానాలు. అప్పట్లో ఆర్టీసీ బస్సులే దిక్కు. అ బస్సుల్లో ఇద్దరూ ఆబిడ్స్‌లోని ఎన్టీఆర్ ఇంటికి వెళ్లేవారు. చాలా సందర్భాల్లో కోడెల రాకపోతే ఆయనకు బదులు, జిల్లా ఏకైక సెక్రటరీ జనరల్ పేరిరెడ్డి ఆ సమావేశాలకు హాజరయ్యేవారు. అలా ఏళ్లు గడిచాయి. కోడెల కూడా రాజకీయాల్లో రాటుదేలారు. సీన్ కట్ చేస్తే.. తన కోసం అంత అంకితభావంతో పనిచేసిన పేరిరెడ్డి బదులు, కోడెల మరొకరికి ఎమ్మెల్యే సీటు సిఫార్సు చేశారు. ఆ తర్వాత కోడెల ప్రస్థానం ఎదురులేకుండా సాగింది.

పనిచేయడం, చేయించడంలో ఆయన తర్వాతనే ఎవరైనా. ఆరోజుల్లో నర్సరావుపేటకు కోడలిగా పంపించాలంటే ఏ తండ్రయినా భయపడేవారు. నీటి సౌకర్యం లేదు. గంటలు వేచి చూసి బిందె నీళ్లు తెచ్చుకోవడం గగనం. అలాంటి దుర్భిక్ష పరిస్థితిని కోడెల మార్చివేశారు. మంచినీటిని అందుబాటులోకి తెచ్చారు. ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టినా, వాటిని నరసరావుపేటలో అమలు చేయించేవారు. మంత్రులను తన నియోజకవర్గానికి తీసుకువచ్చి, నిధులు పారించేవారు. కోటప్పకొండ అభివృద్ధి ప్రదాత కూడా ఆయనే.

అలా అంచెలంచెలుగా ఎదిగిన కోడెల, పల్నాడులో పార్టీకి ఆశ, శ్వాసగా మారారు. ఇప్పుడు గుంటూరు జిల్లాలో ప్రముఖ టీడీపీ నేతలంతా ఆయన అనుచరులే. స్పీకర్‌గా ఎంపిక కానంతవరకూ ఉన్నతంగా కనిపించిన కోడెల తీరు, ఆ తర్వాత సమూలంగా మారిపోయింది. కారణం వారసుల ఒత్తిడి. ప్రతి తండ్రీ ధృతరాష్డ్రున్న సామెత నిజమయిన రోజులవి. వారసుల రంగప్రవేశంతో.. ఆయన దశాబ్దాలు కష్టపడి సాధించుకున్న ఇమేజ్, డామేజీ అయిన దారుణం. ప్రత్యర్థుల గుండెల్లో డైనమేట్లు పేల్చిన ఆ యోధుడు, రకస్తసంబంధానికి లొంగిపోయి ఉరి వేసుకున్న దయనీయ వైనం.

ఫలితంగా.. నర్సరావుపేట-సత్తెనపల్లి నియోజకవర్గాల్లో తొలగించుకోలేనంత అప్రతిష్ఠ, ప్రతి దానికీ మూల్యం కట్టే దుస్థితి. కార్యకర్తలకు సైతం మినహా లేని అరాచకం. కుటుంబంలో వారసులే పవర్‌సెంటర్లు. కోడెలను ప్రాణంగా ప్రేమించిన వారే.. ఆయన వారసుల చేష్టలతో ఆయనకు దూరమైన విషాదం. కమిషన్ల బెదిరింపులతో రైల్వే కాంట్రాక్టర్లు, చివరకు ప్రధాని కార్యాలయానికి ఫిర్యాదు చేసిన వైనం.

తోపుడుబండ్ల నుంచి ఇసుక, మైనింగ్, అవుట్ సోర్సింగ్ కంపెనీలు, క్వారీల కమిషన్లతో మసక బారిక డాక్టర్ గారి ప్రతిష్ఠ. తన భవనాన్ని సర్కారుకు అధిక అద్దె ఇచ్చిన కక్కుర్తి మీడియాలో అభాసుపాలైన వైనం. అప్పటివరకూ నేతల సమస్యను తానే స్వయంగా పరిష్కరించిన కోడెల… తర్వాత ‘పెద బాబును కలిశారా’ అని అడిగే పరిస్థితి. దానితో దశాబ్దాల పాటు, ఆయనతో సన్నిహితంగా ఉంటున్న నేతలంతా దూరమైన పరిస్థితి. పిల్లాడి ముందు నిలబడాల్సిన దుస్థితి సహించలేకనే, డాక్టర్ కోడెలకు దూరమైన దుస్థితి. ‘ఆ బాబు’‘ కోసం ఎంతటివారైనా గంటలు వేచి చూసి, వెళ్లిపోయేంత అహంకార పరిస్థితి.

గుంటూరు జిల్లాలో ఏ పోస్టింగ్ కావాలన్నా, దానికో రేటు కట్టిన సంస్కృతి. మొత్తంగా… కోడెల అనే హిమాలయ పర్వతమనే ప్రతిష్ఠ, వారసుల చేష్టలతో ఐస్‌క్రీములా కరిగిపోయి, చివరాఖరకు అదే ఆత్మహత్యకు ప్రేరేపించిన విషాదం. కోడెల వంటి పోరాట యోధుడి జీవితం, అలాంటి విషాదంతో ముగింపు పలకడం ఆయన అభిమానుల గుండె పిండే సే వార్తనే. పల్నాటి పులి కోడెల కే వలం కుటుంబమనే బలహీనతకు చిక్కి, మృత్యువాత పడ్డారన్నది ఆయన అభిమానుల నిశ్చితాభిప్రాయం.

అలాంటి కోడెల తన వారసులపై.. మీడియాలో వస్తున్న కథనాలకు తెరదించే ప్రయత్నం చేశారు. తనకు రాజకీయ జీవితం ఇచ్చిన ఎన్టీఆర్, చంద్రబాబుకు కృతజ్ఞతలు చెప్పిన కోడెల.. తన వారసులెవరూ

రాజకీయాల్లోకి రారని, వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకమని మీడియా సమక్షంలో స్పష్టం చేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు ప్రోత్సాహం వల్లే, తాను ఈ స్థాయికి ఎదిగానని డాక్టర్ కోడెల వినమ్రంగా ప్రకటించారు.

కానీ అందుకు భిన్నంగా ఆయన తనయుడు శివరాం వేస్తున్న అడుగులు, కోడెల శివప్రసాద్ అభిమానులను కలవర పరుస్తున్నాయి. సత్తెనపల్లి టీడీపీ ఇన్చార్జిగా మాజీ మంత్రి కన్నా

లక్ష్మీనారాయణను ప్రకటించిన టీడీపీ నాయకత్వ నిర్ణయాన్ని.. కోడెల శివరాం బహిరంగంగా విమర్శిస్తున్న తీరు, కోడెల అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. కోడెల కుటుంబానికి అన్యాయం జరిగిందన్న కోణంలో, పార్టీ నాయకత్వాన్ని ముద్దాయిగా నిలబెట్టే శివరాం వ్యూహాన్ని.. కోడెల మద్దతుదారులు, అభిమానులు వ్యతిరేకిస్తున్న పరిస్థితి.

అసెంబ్లీలో ఫర్నీచర్‌ను సొంతానికి వాడుకున్న అత్రిష్ఠతో, టీడీపీ ఇమేజ్‌ను డామేజ్ చేసిన వారసుల చేష్టలను, కోడెల అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. సేఫ్ కంపెనీ కార్మికులకు అన్న క్యాంటీన్ నుంచి తెప్పించిన బిల్లులపై, వైసీపీ మీడియా రాసిన కథనాలు గుర్తు చేస్తున్నారు. డాక్టర్ కోడెల జీవించినంత వరకూ, ఆయన ఇమేజీని డామేజ్ చేసిన వైసీపీ అనుకూల మీడియా.. ఇప్పుడు ఆయన కొడుకు శివరామ్‌కు, ఏ అజెండా లేకుండా విస్తృత ప్రచారం కల్పించడాన్ని, ఏవిధంగా చూడాలని తెలుగు తమ్ముళ్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు అదే వైసీపీ మీడియా.. కోడెల శివరాంను ఆకాశానికెత్తేస్తూ, ఆయన వాదనను ప్రముఖంగా ప్రసారం-ప్రచారం చేయడం వెనుక, మతలబేమిటన్న ప్రశ్నలు సంధిస్తున్నారు. టీడీపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న మూడు మీడియా సంస్థలు, కోడెల శివరామ్‌ను హైలెట్ చేస్తున్నాయంటే.. దాని వెనుక ఏ శక్తులు ఉన్నాయన్న చర్చ టీడీపీ వర్గాల్లో జరుగుతోంది.

ఏరికోరి టీడీపీని వ్యతిరేకించే మీడియాతో మాట్లాడుతున్నారంటే.. కోడెల శివరాం అజెండా ఏమిటో అర్ధమవుతోందంటున్నారు. ఈ పరిణామాల వెనుక ఏ సలహాదారు అదృశ్య హస్తం.. ఒక మంత్రి, మరో ఎమ్మెల్యే దన్ను ఉందన్న చర్చ టీడీపీ వర్గాల్లో జోరుగా జరుగుతోంది. ఎన్నికల ముందు వరకూ.. కోడెల కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని రచ్చ చేసిన తర్వాత, ఒక సంచలన నిర్ణయం తీసుకునే అవకాశం లేకపోలేదని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అయితే టీడీపీ నేతగా జన హృదయాల్లో నిలిచిన.. దివంగత నేత డాక్టర్ కోడెల శివప్రసాద్ తనయుడు శివరాం గత కొద్దిరోజుల నుంచి, పార్టీకి వ్యతిరేకంగా చేస్తున్న ప్రకటనల వల్ల ఆయనపై కొద్దో గొప్పో ఉన్న

సానుభూతి కూడా దూరం చేసుకుంటున్నారన్నది కోడెల అభిమానుల ఆవేదన. నిజానికి కన్నాకు ఇన్చార్జి ఇచ్చే ముందు.. టీడీపీ చేయించిన సర్వేలో శివరామ్‌కు, సత్తెనపల్లి నియోజకవర్గంలో పూర్తి వ్యతిరేకత ఉన్నట్లు తేలిందన్నది సమాచారం.

ఆయనకు తండ్రి సానుభూతి లేదని.. టీడీపీ నేతలు, కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారన్నది ఆ నివేదికలో తేలిన సారాంశం. కమ్మ వర్గంలో ఆయనకు అసలు సానుకూల లేదన్నది మరో షాకింగ్ న్యూస్. మాజీ ఎమ్మెల్యే వైవి, సీనియర్ నేత మల్లి వర్గీయులంతా, పార్టీ నిర్ణయానికే కట్టుబడతామని స్పష్టం చేశారు. ఆ మేరకు ప్రకటనలు కూడా విడుదల చేశారు. వారితో చంద్రబాబునాయుడు, లోకేష్ ఆమేరకు మాట్లాడి, ఏకాభిప్రాయం సాధించారు.

దానితో సత్తెనపల్లి నియోజకవర్గంలో కార్యకర్తలు, పార్టీ నాయకులంతా ఒకవైపు.. శివరాం ఒక్కరే ఒకవైపు నిలిచిన పరిస్థితి.ప్రస్తుతం ఆయన వెంట ఉన్న టీడీపీ నేతల్లో చాలామంది జారిపోయే అవకాశాలు

కనిపిస్తున్నాయి. కోడెల మేనల్లుడు సైతం వారసుల పెత్తనం భరించలేక, చాలా ఏళ్ల నుంచే కోడెల వారసులకు దూరంగా ఉన్న పరిస్థితి.

నర్సరావుపేట ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం పనిచేసిన కోడెల శివప్రసాదరావుకు, తర్వాత కాలంలో అక్కడ సొంత సామాజికవర్గంలోనే వ్యతిరేకత వ్యక్తమయింది. పార్టీకి డబ్బు ఖర్చు పెట్టిన సొంత కులం వారే, ఆయనకు దూరమయ్యారు. దానితో ఆయన గెలవని పరిస్థితి. అటు పార్టీ సర్వేలోనూ అదే తేలింది. చివరకు చంద్రబాబు సూచనతో డాక్టర్ కోడెల సత్తెనపల్లికి మారిన పరిస్థితి. అదే తరహాలో ఇప్పుడు పార్టీ చేసిన సర్వేలో.. శివరామ్‌కు సొంత కమ్మవర్గం, పార్టీ కార్యకర్తలు, ప్రజల్లో పూర్తి వ్యతిరేకత ఉందన్నది బయటపడ్డ వాస్తవం. దానిని అంగీకరించి, పార్టీ నిర్ణయాన్ని గౌరవించకుండా తిరుగుబాటు చేస్తున్న శివరాం వైఖరిని.. తెలుగుతమ్ముళ్లు తప్పు పడుతున్నారు.

ఈ నేపథ్యంలో కోడెల శివరాం తిరుగుబాటు వల్ల, ఆయనకు వచ్చే లాభమేమి ఉండదన్నది శివప్రసాద్ అభిమానుల వాదన. చంద్రబాబును తిట్టిన కన్నాకు ఇన్చార్జి ఎలా ఇస్తారన్న శివరాం వాదనలో అర్ధం

లేదన్నది, దివంగత డాక్టర్ కోడెల శివప్రసాదరావు అభిమానుల మరో వాదన. దివంగత నేత కోడెల జీవించిన సమయంలో.. టీడీపీని విమర్శించిన అనేకమంది కాంగ్రెస్ నేతలను, టీడీపీలో చేర్పించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అది తప్పు కానప్పుడు.. కన్నా విషయంలో, పార్టీ నిర్ణయం ఎలా తప్పవుతుందని ప్రశ్నిస్తున్నారు.

కన్నాకు.. శివరామ్‌కు పోలికేంటి: రాజా కాశి
‘‘నేను కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల నుంచి పనిచేశా. కాసు కుటుంబానికి సన్నిహితుడిని. తర్వాత కోడెల, కాసుకు వ్యతిరేకంగా ఇండిపెండెంట్‌గా పోటీ చేశా. అలాంటి నన్ను డాక్టర్ కోడెల టీడీపీలోకి తీసుకొచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో నేను పార్టీకి ఆర్ధికంగా సాయం చేశా. ఆ విషయాన్ని డాక్టర్ కోడెల బహిరంగంగానే చెప్పి నాకు కృతజ్ఞతలు చెప్పారు. కానీ ఆయన నాకేమీ చేయలేదు. అప్పట్లో నాలాంటి బలిజీవులు చాలామంది ఉన్నారు. మరి అలాంటప్పుడు కన్నా లక్ష్మీనారాయణను టీడీపీలోకి తీసుకుంటే తప్పేంటి? అయినా రాజకీయ పార్టీలు వ్యక్తుల సంస్థానాలు కాదు కదా? శివరాం అనుభవానికి, కన్నా అనుభవానికీ నక్కకూ నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కన్నాకు క్లీన్ ఇమేజ్ ఉంది. ఆయనతో నాకు కొన్నేళ్ల అనుబంధం ఉంది. కన్నాకు సత్తెనపల్లి ఇన్చార్జి ఇవ్వాలన్న చంద్రబాబు నిర్ణయం సమంజసం. నేను శివప్రసాద్ సత్తెనపల్లి అభ్యర్ధిగా ఉన్నప్పుడు, అక్కడ కొన్ని మండలాల్లో నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల ప్రచారం చేశా. బీసీ కులాలను ఏకం చేశా. కోడెల గెలిచిన తర్వాత ఆయన పేరు, వారసుల చేష్టలతో చెడిపోతుంటే చూడలేకపోయా. చివరకు నన్ను కూడా మోసం చేశారు. దానితో ఆర్ధికంగా భారీగా నష్టపోయా. ఇప్పటికీ కోలులేలేదు. కాబట్టి శివరాం వేసే కేకలు పార్టీ పట్టించకోవలసిన అవసరం లేదు’ అని టీడీపీ బీసీ నేత రాజా కాశి వ్యాఖ్యానించారు.

ప్రధానంగా.. తన కుటుంబం పార్టీకి విధేయతగా ఉంద ని చెబుతున్న శివరాం.. టీడీపీని వ్యతిరేకించే వైసీపీ మీడియాకు, ఎలా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు? ఆ మీడియాలో ఆయనను ఎలా హైలెట్ చేస్తోంది? అంటే దీన్ని బట్టి ఈ ఎపిసోడ్ వెనుక ఎవరున్నారు? ఎవరి ఆదేశాల ప్రకారం ఆయన పార్టీని రచ్చ చేస్తున్నారు? ఈ రచ్చ ఎన్నికల ముందు వరకూ కొనసాగి, ఆయన పార్టీకి నష్టం కలిగించే ఒక సంచలన నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ జరుగుతోంది. ఇప్పటికే ఒక ప్రభుత్వ సలహాదారు, ఒక మంత్రి, ఇంకో ఎమ్మల్యే.. ఈ ఎపిసోడ్‌ను స్వయంగా పర్యవేక్షిస్తున్నారన్న ప్రచారం టీడీపీ వర్గాల్లో జరుగుతోంది.

అసలు తన వారసులెవరూ రాజకీయాల్లోకి రారని..తాను వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని డాక్టర్ కోడెల శివప్రసాదరావు స్పష్టం చేస్తే, ఆయన కొడుకు అందుకు భిన్నంగా ఎందుకు వ్యవహరిస్తున్నారన్నది దివంగత కోడెల అభిమానుల ప్రశ్న. సెంటిమెంట్ కోసం తన తల్లి పేరు చెబుతున్న శివరాం.. తన వారసులు రాజకీయాల్లోకి రారని స్పష్టం చేసిన తండ్రి మాటను, ఎందుకు గౌరవించడం లేదన్నది కోడెల శివప్రసాదరావు అభిమానుల ప్రశ్న. ఇప్పుడు కోడెల జీవించి ఉన్న్పుడు. తన వారసులు రాజకీయాల్లోకి రారంటూ, కోడెల చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఆయన టీడీపీకి వ్యతిరేకంగా సొంతంగా లేదా మరొక పార్టీ అభ్యర్ధిగా పోటీ చేసిన్పటికీ.. దివంగత కోడెల శివప్రసాదరావు అభిమానులెవరూ, ఆయనను ఆదరించే ప్రశ్నే లేదంటున్నారు.

Leave a Reply