Suryaa.co.in

Family

భార్య చనిపోతే భర్త ఎందుకు కుంగిపోతాడు?

– ఒక శాస్త్రీయ అధ్యయనం ఏం చెప్పింది?
– ‘ఆమె’ లేని మగాడి జీవితం, మోడువారిన చెట్టుతో సమానం
– తన కన్నా చిన్నదైన భార్య చనిపోతుందనే సన్నద్ధత పురుషుల్లో ఉండదట
– భార్య దూరమైన మనోవ్యథతో మరణించిన బాపు, రంగనాధ్
– భావోద్వేగ బలం ఆమెదే
– రోచెస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తల అధ్యయనం

భర్తకు భార్య తోడు గురించి..
ఇందులో ప్రతి మగవాడు తెలుసుకోవాల్సిన అద్భుతమైన సూచనలు ఎన్నో ఉన్నాయి.
2012లో రోచెస్టర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ శాస్త్రవేత్తలు ఒక అధ్యయనం చేశారు.
అందులో ఒక ఆసక్తికరమైన అంశం వెల్లడైంది.
సాధారణంగా భార్యాభర్తల్లో.. పురుషులు వయసులో పెద్దవారై ఉంటారు. కాబట్టి, వారు తమ కన్నా ముందే మరణిస్తారనే అంశాన్ని జీర్ణించుకోవడానికి, మహిళలు సిద్ధమై ఉంటారట.
తన కన్నా చిన్నదైన భార్య చనిపోతుందనే సన్నద్ధత పురుషుల్లో ఉండదట. భార్య చనిపోతే భర్త కుంగుబాటుకు గురవడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణమని వారు విశ్లేషించారు.
భార్య మీద జోకులేస్తారు. కోపమొస్తే అరుస్తారు, అలుగుతారు, తిడతారు. ఆమె శాశ్వతంగా దూరమైతే మాత్రం, తట్టుకొని బతికేంత మానసిక బలం పురుషులకు ఉండదు. ‘ఆమె’ లేని మగాడి జీవితం, మోడువారిన చెట్టుతో సమానం !
అడగకుండానే అన్నీ అమర్చిపెట్టినన్నాళ్లూ, ఆమె విలువ తెలుసుకోలేని మహానుభావులుంటారు . ఆమె వెళ్లిపోయిననాడు, మనసులో మాటను చెప్పుకొనే తోడు లేక.., అందరితో కలవలేక..మనసులోనే కుమిలిపోయి శారీరకంగా క్షీణించిపోతారు.

“నేను ముందు పోతే పసుపు, కుంకాలు మిగిలిపోతాయేమో గానీ.. ఆ జీవుడు ఎంత అవస్థపడతాడో నాకు తెలుసు. పైనున్న భగవంతుడికి తెలుసు. ఒరే.., పచ్చటి చెట్టుకింద కూర్చుని చెబుతున్నా. ‘దేవుడా ఈ మనిషిని తీసుకెళ్లు, ఆ తర్వాత నా సంగతి చూడు’ అని రోజూ దణ్నం పెట్టుకునేదాన్ని. ‘మొగుడి చావు కోరుకునే వెర్రిముండలుంటారా ? అని అనుకోకు., ఉంటారు.

నాకు మీ మావయ్యంటే చచ్చేంత ఇష్టంరా. ఆయన మాట చెల్లకపోయినా, కోరిక తీరకపోయినా, నా ప్రాణం కొట్టుకుపోయేది.
చీకటంటే భయం.
ఉరిమితే భయం.
మెరుపంటే భయం.
నే వెన్నంటి ఉండకపోతే ధైర్యం ఎవరిస్తారు ?
అర్ధరాత్రిపూట ఆకలేస్తోందని లేచి కూర్చుంటే ఆవిరికుడుములూ, కందట్లూ, పొంగరాలూ ఎవరు చేసి పెడతారు ?’’
ప్రముఖ రచయిత శ్రీరమణ రాసిన.., నటుడు ప్రయోక్త తనికెళ్ళ భరణి తీసిన ‘మిథునం’లో భర్త మరణం గురించి బుచ్చిలక్ష్మి పాత్ర ఆవేదన ఇది !

నటుడు రంగనాథ్‌ గుర్తున్నారా ? భార్యతో అపూర్వమైన అనుబంధం ఆయనది. మేడ మీద నుంచి పడటంతో, నడుం విరిగి ఆవిడ మంచాన పడితే.. పద్నాలుగేళ్లపాటు ఆమెకు సేవలు చేశారాయన ! తాను ఎంతగానో ప్రేమించిన భార్య, శాశ్వతంగా దూరమవడాన్ని తట్టుకోలేక కుంగుబాటుకు గురై 2015లో ఉరి వేసుకుని చనిపోయారు.
ప్రముఖ చిత్రకారుడు, దర్శకుడు బాపు సైతం, భార్య భాగ్యవతి మరణాన్ని తట్టుకోలేక ఆమె వెళ్లిన ఏడాదిన్నరలోపే తుదిశ్వాస విడిచారు.

సాధారణంగా భార్య అంటే చాలా మందికి చులకన భావం ఉంటుంది. భార్య తన మీద ఆధారపడి ఉందని.,తాను తప్ప ఆమెకు దిక్కులేదని, చాలామంది పురుషులు అనుకుంటారు.
కానీ వాస్తవంలో అందుకు విరుద్ధంగా జరుగుతుంది.
చాలామంది పురుషులు తమకు తెలియకుండానే, భార్యపై మానసికంగా ఆధారపడిపోతారు.
భార్యను కోల్పోయినప్పుడు ఆ లోటు వారికిబాగా తెలుస్తుంది. వారి జీవితం గందరగోళంలో పడిపోతుంది.
భాగస్వామి దూరమైనప్పుడు మహిళలు స్పందించే తీరు భిన్నంగా ఉంటుంది. భర్తకు దూరమైన తరువాత మహిళలు, కుటుంబ సభ్యులతో కలిసిపోవడం, కొన్ని బరువు బాధ్యతలు తీసుకుంటారు.
స్త్రీ చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా బతుకుతుంది. తండ్రికి బాగోకపోయినా, భర్తకు జ్వరం వచ్చినా, పిల్లలకు జలుబు చేసినా, తనే సేవ చేస్తుంది. అదే తనకు ఏదైనా అయితే ఎవరి కోసం ఎదురు చూడదు. తనకు తానే మందులు వేసుకుంటుంది.

ఓపిక లేకపోయినా లేచి పనులు చేసుకోవడానికి యత్నిస్తుంది. ఆ మనోబలమే., భర్త లేకపోయినా ధైర్యంగా బతకడానికి ఉపయోగపడుతుంది.
భావోద్వేగ బలం ఆమెదే !
_పురుషుడు శారీరకంగా బలంగా ఉంటే, స్త్రీ భావోద్వేగాలపరంగా బలంగా ఉంటుంది.
సామాజిక బాధ్యతలు భర్త తీసుకుంటే, భార్య కుటుంబ బాధ్యత మోస్తుంది.
ఒక విధంగా చెప్పాలంటే.. ఇంట్లో ఆమే రిమోట్‌ కంట్రోల్‌. ఎక్కడ ఏది నొక్కాలో ఆమెకే తెలుసు.
ఎంతటి భావోద్వేగాన్నయినా భరిస్తుంది. పిల్లలే సర్వస్వంగా బతుకుతుంది.
అందుకే భర్త తనువు చాలించినా, పిల్లల కోసం తను కష్టపడుతుంది.
ఆడదే మగాడికి సర్వస్వం..!
“యత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత”
ప్రతి భర్తకు భార్య దేవత స్వరూపం

– సంపత్‌రాజు

LEAVE A RESPONSE