‘పువ్వు’కు ‘ఫ్యాను’ గాలి!

– కమలం ముద్దు.. కూటమి వద్దు
– కూటమిపై జగన్ ధ్వజం
– టీడీపీ-జనసేనపై విసుర్లు
– బీజేపీని మాత్రం విమర్శించని లౌక్యం
– మరి కూటమిలో కమలం లేదా?
– జగన్‌పై బీజేపీ నేతల విమర్శల వర్షం
– పురందేశ్వరి నుంచి పాతూరి వరకూ విమర్శలు
– అయినా బీజేపీపై ఎదురుదాడి చేయని వైసీపీ
– ఇదేం అనుబంధంమంటూ విశ్లేషకుల విస్మయం
– జగన్ వైఖరిపై వైసీపీ సీనియర్ల అసంతృప్తి
– కనీస విమర్శలు చేయకపోతే అనుమానిస్తారన్న ఆందోళన
– ఇప్పటికే రాజుకు ఎంపీ రాకుండా జగన్ బీజేపీలో చక్రం తిప్పారన్న ప్రచారం
– జగన్ బంధంతోనే రాజుకు బీజేపీ సీటివ్వలేదన్న భావన
– పువ్వు-ఫ్యాను బంధంపై రాజకీయ వర్గాల్లో చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)

టీడీపీ-జనసేన-బీజేపీ ఎన్డీఏ కూటమి. కాంగ్రెస్-వామపక్షాలు కూటమిగా ఏర్పడేందుకు చర్చిస్తున్నాయి. ఇక వైసీపీ ఒంటరిగానే ఎన్నికల బరిలోకి దిగింది. ఇదీ ఏపీలో ఎన్నికల రాజకీయ ముఖ చిత్రం. అంటే సహజంగా ఒక కూటమి తన ప్రచారంలో, ఎదుటి కూటమిపై విమర్శలు కురిపిస్తుంటుంది. ఎవరైనా కూటమిని విమర్శిస్తారే తప్ప, కూటమిలోని పార్టీలను విమర్శించరు. ఇది ఎక్కడైనా జరిగేదే. ఇప్పుడు కాంగ్రెస్ నేతృత్వం వహిస్తున్న ఇండియా కూటమి, ఆవిధంగానే ఎన్డీఏపై విమర్శలు ఎక్కుపెట్టింది.

కానీ ఏపీలో మాత్రం అందుకు భిన్నమైన వ్యవహారం. ఎన్డీఏ కూటమిలోని టీడీపీ-బీజేపీ-జనసేన నేతలు వైసీపీని తూర్పారపడుతున్నారు.అయితే వైసీపీ అధినేత జగన్ నుంచి సలహాదారు సజ్జల వరకూ అందరూ టీడీపీ-జనసేనను మాత్రమే విమర్శించి, బీజేపీపై ఎదురుదాడిని మినహాయించడమే ఆశ్చర్యం. ‘సిద్ధం’ కానీ.. ‘మనం సిద్ధం’ పేరుతో జగన్ చేస్తున్న ఎన్నికల ప్రచారంలో గానీ, జగన్ ఎక్కడా ఇప్పటిదాకా బీజేపీని పల్లెత్తు విమర్శించిన దాఖలు లేకపోవడం సొంత పార్టీలోనే విస్మయపరుస్తోంది.

చంద్రబాబునాయుడు-పవన్‌ది అపవిత్ర కలయిక అని, టీడీపీ రాసిచ్చిన స్క్రిప్టును పవన్ చదువుతున్నారని, జనసేనకు కాపు జనాభా నిష్పత్తితో సీట్లు ఎందుకు ఇవ్వలేదంటూ, వైసీపీ నేతలు రోజూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. టీడీపీ టి కెట్ల పంపిణీలో సామాజికన్యాయం పాటించలేదని ఆరోపిస్తున్నారు. అయితే ఇదే ప్రశ్నలను బీజేపీపై మాత్రం సంధించకుండా, లౌక్యం పాటిస్తున్న వైనం సహజంగానే వైసీపీ-బీజేపీ బంధంపై అనుమానాలకు తావిస్తోంది.

నిజానికి ఉత్తరాంధ్రలో బీజేపీ బీసీ- కాపులకు సీట్లు ఇవ్వలేదని, అక్కడ కనీస బలం లేని కమ్మ-వెలమ కులాలకు ఎలా సీట్లు ఇస్తారంటూ, ఆ పార్టీలోనే పంచాయతీ నడుస్తోంది. దానిపై ఇటీవల విశాఖకు వెళ్లిన జాతీయ నేతలపై, ఉత్తరాంధ్ర బీజేపీ పదాధికారులు విరుచుకుపడ్డారు. ఇక బీజేపీ తన సీట్లను, సింహభాగం ఒకే సామాజికవర్గానికి కేటాయించిందంటూ ఆ పార్టీలో అసంతృప్తి పెరుగుతోంది. అది మీడియాలోనూ వస్తున్నవే.

కానీ దానిని ప్రస్తావించకుండా, టీడీపీలో ఒకే కులానికి ఎక్కువ సీట్లు ఇచ్చి సామాజికన్యాయానికి సమాధి చేశారంటూ, వైసీపీ నేతలు విమర్శిస్తున్న వైనంపై సొంత పార్టీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబునాయుడును ముసలాయన అని నేరుగా విమర్శిస్తున్న జగన్.. వయసులో అంతకంటే పెద్దవాడైన ప్రధాని మోదీని మాత్రం, పలెత్తు వ్యాఖ్య చేయకపోవడం ఆశ్చర్యం.

చంద్రబాబు గతంలో ఇచ్చిన హామీలు అమలుచేయలేదని విరుచుకుపడుతున్న జగన్… ఈ ఐదేళ్లలో ఏపీకి ఇచ్చిన హామీలను అమలుచేయని బీజేపీని మాత్రం, విమర్శించకపోవడమే వింత. రైల్వే జోన్, ప్రత్యేక హోదా, విభజన చట్టం అమలు వంటి అంశాలపై.. బీజేపీ ఇచ్చిన మాట తప్పిందన్న ప్రస్తావన, పొరపాటును కూడా తీసుకురాకుండా జాగ్రత్త పడటం గమనార్హం.

కానీ.. అటు బీజేపీ రాష్ట్ర నేతలు మాత్రం, జగన్ సర్కారుపై ఎదురుదాడి చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఎంపి అభ్యర్ధి సీఎం రమేష్, మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ముఖ్య అధికార ప్రతినిధి పాతూరి నాగభూషణం వంటి నేతలు ప్రతిరోజూ జగన్‌ను తూర్పారపడుతున్నారు. స్టిక్కర్ల పాలన.. అప్పులపాలన.. రౌడీరాజ్యం అంటూ విరుచుకుపడుతున్నారు. అయినప్పటికీ.. జగన్ మాత్రం బీజేపీ జోలికి వెళ్లకుండా.. కేవలం టీడీపీ-జనసేనలపై ఎదురుదాడికే పరిమితమవుతుండటం, అటు వైసీపీ వర్గాల్లోనే చర్చనీయాంశమయింది.

ఇది బీజేపీ-వైసీపీ బంధం ఇంకా కొనసాగుతోందన్న అనుమానాలకు తావిస్తుందని, వైసీపీ సీనియర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల ముస్లిం ఓట్లు దూరమయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ‘‘బీజేపీని గానీ, మోదీని గానీ జగన్ గారు ఒక్క మాట అనకుండా.. కేవలం బాబు-పవన్‌ను మాత్రమే తిడుతుంటే, మెడపై తల ఉన్న ఎవరైనా బీజేపీ-వైసీపీ ఇంకా కలిసే పనిచేస్తున్నాయని అనుకోరా’’ అని గుంటూరు జిల్లాకు చెందిన ఓ సీనియర్ వైసీపీ నేత వ్యాఖ్యానించారు.

పైగా బీజేపీ-మోదీని విమర్శించపోతే, ముస్లిం ఓట్లు తమకు ఎలా పడతాయని అటు వైసీపీ అభ్యర్ధులు కూడా ప్రశ్నిస్తున్నారు. ఐదేళ్లు పార్లమెంటులో ఎన్డీఏ ప్రవేశపెట్టిన అన్ని బిల్లులనూ వైసీపీ ఆమోదించిన విషయాన్ని, కాంగ్రెస్-వామపక్షాలు మైనారిటీల్లోకి బలంగా తీసుకువెళుతున్నాయి. దేశవ్యాప్తంగా ముస్లిం-క్రైస్తవులపై జరుగుతున్న దాడులను, జగన్ ఒక్కసారి కూడా ఖండించలేదన్న ప్రచారాన్ని ఆ పార్టీలు క్షేత్రస్థాయికి తీసుకువెళుతున్నాయి. వైసీపీ నేతలు సైతం అదే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

కూటమి ఏర్పడిన తర్వాత టీడీపీ-జనసేన లక్ష్యంగా విమర్శిస్తున్న జగన్.. కూటమిలోని జాతీయ పార్టీ అయిన బీజేపీని మాత్రం, పల్లెత్తుమాట అనకపోవడం వల్ల.. కూటమి కుదిరినా, తెరవెనుక వైసీపీ-బీజేపీ బంధం కొనసాగుతుందన్న అనుమానాలకు, జగనే ఆస్కారం ఇస్తున్నారన్న వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

‘టీడీపీ,జనసేనను విమర్శిస్తున్న జగన్‌గారు బీజేపీని విమర్శించపోవడం వల్ల మాకు ముస్లిం ఓట్లు దూరమవడం ఖాయం. బీజేపీ కూటమిలో ఉన్నందున ముస్లింలకు రక్షణ ఉండదన్న మా ప్రచారాన్ని ఎవరూ నమ్మరు. పైగా గతంలో కూటమి అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ మైనారిటీలపై దాడులు జరగలేదు. నిజానికి మా హయాంలోనే మైనారిటీలపై అనేక దాడులు జరిగాయి. చాలామందిని చంపారు. మరి అలాంటిది ముస్లింలు మా పార్టీని ఎంచుకుంటారా? కూటమిని ఎంచుకుంటారా? పార్లమెంటులో ఎన్డీఏ ప్రవేశపెట్టిన అన్ని బిల్లులనూ వైసీపీ సమర్థించింది కాబట్టి.. బీజేపీ-వైసీపీ ఒకటేనన్న విషయం మైనారిటీ విద్యావంతులు, మేధావులకు తెలులు. అందువల్ల ఈ ముసుగులో గుద్దులాట అనవసరం. బీజేపీని విమర్శిస్తే ఎక్కడ మోదీకి కోపం వస్తుందోనన్న మొహమాటం పక్కనపెట్టాలి. బీజేపీపై ఎదురుదాడి చేయకపోయినా, మోదీని విమర్శించకపోయినా మా పార్టీని ముస్లిం-క్రైస్తవ వర్గాలు నమ్మవు’’ అని ఓ మాజీ మంత్రి కుండబద్దలు కొట్టారు.

Leave a Reply