చదువుకున్న ‘తమ్ముళ్లు’

– టీడీపీ జాబితాలో విద్యాధికులు
– 30 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు
– 63 మంది గ్రాడ్యుయేట్లు
– చంద్రబాబు ఎన్టీఆర్ ప్రయోగం
( మార్తి సుబ్రహ్మణ్యం)

దివంగత నేత ఎన్టీరామారావు టీడీపీ స్థాపించినప్పుడు అభ్యర్ధులంతా డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, లెక్చరర్లు, ఉద్యోగాలకు రాజీనామా చేసి వచ్చిన ఉన్నత స్థాయి అధికారులే. రాజకీయాలు తెలియని వారితో టీడీపీ ఏం సాధిస్తుందని, అప్పట్లో కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేశారు. కానీ సమాజంలో బాధ్యతగల స్థానంలో ఉన్న వారిని రాజకీయాల్లోకి తీసుకువస్తే, సమాజంలో మార్పు వస్తుందన్నది ఎన్టీఆర్ లక్ష్యం.

అందుకే ఎవరి ఒత్తిళ్లకూ లొంగకుండా, యువకులు-విద్యాధికులను బరిలోకి దింపిన అన్నగారి ప్రయోగం సూపర్ డూపర్ హిట్టయింది. ఇప్పుడు టీడీపీ,కాంగ్రెస్, వైసీపీ, టీఆర్‌ఎస్‌లో 60 ఏళ్లు దాటిన అనేకమంది తొలి తరం ప్రముఖులు.. అలా అన్న గారి ప్రయోగంతో రాజకీయ అరంగేట్రం చేసినవారే.

సుదీర్ఘ కాలానంతరం ఇప్పుడు చంద్రబాబునాయుడు కూడా.. సరిగ్గా అలాంటి ప్రయోగమే చేసి, అన్నగారినిగుర్తుకు తెచ్చారు. తొలిజాబితాలో ప్రకటించిన 99 మంది అభ్యర్ధుల్లో అంతా ఉన్నత విద్యావంతులే కావడం చూస్తే.. విద్యావంతులు-మేధావులు-నిరుద్యోగులు, ఏ పార్టీకి ఓటు వేస్తారో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఇది సమాజంలో విద్యాధికులకు పెద్దపీట వేసినట్లే. తమ జాబితా తీరు చూస్తే పార్టీ విధానం ఏమిటన్నది చంద్రబాబు నాయుడు యువతకు చెప్పకనే చెప్పినట్లయింది. ఎర్రచందనం స్మగ్లర్లు, భూకబ్జాదారులు, హత్యలు చేసే వారికి వైసీపీ సీట్లు ఇస్తే..టీడీపీ మొత్తం విద్యాధికులకు సీట్లు ఇచ్చిందని చంద్రబాబు వ్యాఖ్యానించడం గమనార్హం.

టీడీపీ-జనసేన అభ్యర్ధుల తొలి జాబితాలో, అంతా చదవుకున్నవారే స్థానం సంపాదించుకున్నారు. గతంతో పోలిస్తే ఈ సంఖ్య చాలా ఎక్కువ. తాజాగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు-జనసేనాధిపతి పవన్ కల్యాణ్ ఉమ్మడిగా విడుదల చేసిన అభ్యర్ధుల జాబితాలో, 99 సీట్లలో మొత్తం విద్యాధికులే ఉండటం విశేషం.

అందులో ఒకరు ఐఏఎస్, ఇద్దరు పీహెచ్‌డి, 30 మంది పోస్టు గ్రాడ్యుయేట్లు, ముగ్గురు ఎంబిబిఎస్ డాక్టర్లు, 63 మంది గ్రాడ్యుయేట్లు ఉన్నట్లు జాబితా చూస్తే స్పష్టమవుతోంది. ఇక 99 మంది అభ్యర్ధుల్లో.. 86 మంది పురుషులు, 13 మంది మహిళలున్నారు. అభ్యర్ధులలో మధ్య వయస్కుల సంఖ్య ఎక్కువగా ఉండటం కనిపించింది. 25-35 వయసున్న వారు ఇద్దరు, 36-45 మధ్య ఉన్న వారు 22 మంది, 46-60 మధ్య ఉన్న వారు 55 మంది, 61-75 మధ్య వయసున్న వారు 20 మంది జాబితాలో చోటుచేసుకున్నారు. మొత్తానికి టీడీపీ జాబితా అంతా చదవుకున్న తమ్ముళ్లతోనే నిండింది.

Leave a Reply