బీజేపీ జాతీయ కమిటీలో మన ‘బాలు’

( మార్తి సుబ్రహ్మణ్యం)
కామర్సు బాల సుబ్రమణ్యం. మన తెలుగువాడే. బీజేపీ, ఏబీవీపీలో పనిచేసిన చాలామందికి తెలిసిన ‘బాలు’కు, బీజేపీ జాతీయ కార్యవర్గంలో మరోసారి స్థానం దక్కింది. పూర్వాశ్రమంలో జర్నలిస్టు అయిన బాలు.. న్యాయవాద వృత్తి చేపట్టి, ఏబీవీపీ నుంచి బీజేపీలో క్రియాశీలకంగా పనిచేశారు. సుప్రీంకోర్టులో పలు కేసులు వాదించారు. ప్రస్తుతం బాలు బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయ కార్యదర్శిగా అత్యంత కీలక, గౌరవప్రదమైన హోదాలో తన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
ప్రధాని మోదీ నుంచి అధ్యక్షుడు నద్దా వరకూ, బీజేపీ ప్రధాన కార్యాలయంలో టైపిస్టు నుంచి చప్రాసీ వరకూ అందరూ ఆయనకు ఎరుకే. కేంద్రమంత్రుల గురించి చెప్పాల్సిన పనిలేదు. పార్లమెంటు జరిగే సమయంలో మంత్రులు, ఎంపీలకు వివిధ అంశాలకు సంబంధించి నోట్స్ ఇచ్చేది ఆయన సారధ్యంలోని బృందమే. మన తెలుగువాడు ఈ స్థాయికి ఎదగడం తెలుగువారందరికీ గర్వకారణమే. తెలుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీ వెళ్లే బీజేపీ నేతలను, పార్లమెంటుకు తీసుకువెళ్లి అగ్రనేతలతో భేటీ వేయించే బాధ్యత కూడా నిర్వర్తిస్తున్నారు.
బాలు గతంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా పనిచేయగా.. తాజాగా మరోసారి ఆయనను అదే పదవిలో కొనసాగిస్తూ, బీజేపీ బాస్ నద్దా, బాలు బాధ్యతను మరింత పెంచారు. 90’లలో ‘ఆంధ్రభూమి’లో బాలూతోపాటు కలసి పనిచేసిన రోజులు గుర్తుకొచ్చాయి.తాజాగా తన నియామకంపై కామర్సు బాల సుబ్రమణ్యం సంతోషం వ్యక్తం చేశారు.
‘బిజెపి కేంద్ర కార్యవర్గ సభ్యులుగా మరియు బిజెపి పార్లమెంటరీ పార్టీ కార్యదర్శిగా మరోసారి నన్ను కొనసాగిస్తూ బిజెపి జాతీయ నాయకత్వం తీసుకున్న నిర్ణయానికి సర్వదా కృతజ్ఞుడను. నా కార్యాచరణ, నిబద్ధతపై నమ్మకం ఉంచి బాధ్యతలను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్న గౌరవనీయులు ప్రధానమంత్రి నరేంద్రమోదీ , బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి. నడ్డా , బిజెపి సీనియర్ నేతలు అమిత్ షా , బిఎల్ సంతోష్ గార్కి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
బిజెపి జాతీయ వాద సిద్ధాంతాలను ప్రజలలోకి తీసుకువెళ్లడానికి గత నాలుగు దశాబ్దాలుగా నన్ను వెన్నంటి ప్రోత్సహిస్తున్న సహోదర పార్టీ కార్యకర్తలు, నేతలు, మిత్రులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యులు ఇతరులందరికి నా వినమ్ర నమస్కారములు’ అన్నారు.

Leave a Reply