కూటమి వైపే కొత్త ఓటర్లు!

-మొత్తం ఓటర్లు 4,08,07,256 మంది
-మహిళా ఓటర్లు 2,07,065 మంది
-పురుష ఓటర్లు 2,00,09,275 మంది
-సర్వీసు ఓటర్లు 67,434
-థర్డ్ జెండర్ ఓటర్లు 3482 మంది
-కొత్తగా నమోదయిన యువ ఓటర్లు 8.13 లక్షల మంది
-ముసాయిదా తర్వాత పెరిగిన కొత్త ఓటర్లు 5.08 లక్షల మంది
-నిరుద్యోగులు, యువకులు ఎన్డీఏ వైపే
-జగన్ హయాంలో రాని పరిశ్రమలు
-వచ్చినవే వెనక్కి వెళ్లిన వైనం
-బాబు వస్తేనే కొత్త కంపెనీలు వస్తాయన్న ఆశ
-పంచడమే తప్ప ఉద్యోగాలు లేవన్న అసంతృప్తి
-అమరావతి నిర్మిస్తే లక్షల ఉద్యోగాలు వచ్చేవన్న భావన
-జగన్ పనితీరుపై ఉత్తరాంధ్ర, కోస్తా నిరుద్యోగుల ఆగ్రహం
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘ ప్రజలు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించుకుని కడుతున్న పన్నును పప్పు బెల్లాల్లా ఓట్ల కోసం ఇతరులకు పంచడం తప్ప ఈ ప్రభుత్వం చేసిందేమిటి? మేం కట్టిన పన్నును ఇతరులకు ఉచితంగా పంచే అధికారం ఎవరిచ్చారు? అసలు ప్రజలు మాకు ఉచితంగా ఇవ్వమని ఏమైనా అడిగారా? ఈ ఐదేళ్లలో కొత్తగా ఎవరికైనా ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా? ఉన్న కంపెనీలను వెనక్కి పంపించడమేనా ఈ ప్రభుత్వ గొప్పతనం? మళ్లీ మేం హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు వెళ్లడానికి కారణమెవరు? అమరావతిలో రాజధాని నిర్మిస్తే ఎన్ని లక్షల ఉద్యోగాలు వచ్చేవి? అయినా పన్నులతో వసూలయిన డబ్బును పంచడానికి సీఎం ఎందుకు? బటన్లు నొక్కడానికి చప్రాసీ అయినా సరిపోతారు కదా? అందుకే మేం ఈ ప్రభుత్వానికి ఓటేయం. మళ్లీ చంద్రబాబు వస్తే కంపెనీలు వస్తాయన్న నమ్మకం మాకుంది’’- ఇదీ ఏపీలో కొత్తగా నమోదయిన యువ ఓటర్లు, నిరుద్యోగుల మనోగతం.

ఈ ఎన్నికల్లో కొత్త ఓటర్లు కీలకపాత్ర పోషించబోతున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత నమోదయిన కొత్త ఓటర్లు.. అంటే గత చంద్రబాబు పాలనను చూసిన యువకులు- నిరుద్యోగులు- అప్పటి కొత్త ఓటర్లు.. ఇప్పుడు ఐదేళ్లలో జగన్ పాలనను పరిశీలిస్తూ, కొత్తగా నమోదయిన కొత్త ఓటర్ల సంఖ్య కోటి 10 లక్షల మంది అన్నది ఒక అంచనా.

గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు, అనేక కంపెనీలు ఏపీకి తరలివచ్చాయి. దానికోసం ఆయన కాళ్లకు బలపాలు కట్టుకుని పారిశ్రామికవేత్తల చుట్టూ తిరిగారు. చివరకు తన స్థాయి తగ్గించుకుని మరీ, వారిని తన కారులో ఎయిర్‌పోర్టు వరకూ వెళ్లి వీడ్కోలు పలికిన సందర్భాలు బోలెడు.

విశాఖ, విజయవాడ, మంగళగిరి, కర్నూలు, అనంతపురం వంటి ప్రాంతాల్లో జాతీయ-అంతర్జాతీయ పరిశ్రమలు, స్టార్టప్ కంపెనీలు కుప్పలు తెప్పలుగా వచ్చాయి. ఫలితంగా ఉత్తరాంధ్ర-కోస్తా నిరుద్యోగ యువకులకు, బయట రాష్ట్రాలకు వెళ్లే పని తప్పింది. రాయలసీమ నిరుద్యోగులకు చెన్నై, బెంగళూరుకు వలస పోవాల్సిన పనిలేకుండా పోయింది. అమరావతి ప్రాంతంలో కొత్త భవన నిర్మాణాల వల్ల సివిల్ ఇంజనీర్లకు చేతినిండా పని ఉండేది.

కానీ వైసీపీ అధినేత జగన్ అధికారంలోకి రావడంతో, బాబు హయాంలో వచ్చిన కంపెనీలన్నీ ఒక్కొక్కటిగా పక్క రాష్ట్రాలకు పరుగులు పెట్టడం ప్రారంభించాయి. ప్రధానంగా విశాఖలో బాబు హయాంలో వచ్చిన కంపెనీలన్నీ, దాదాపు పక్కరాష్ట్రాలకు వెళ్లిపోయాయి. గల్లా జయదేవ్‌కు చెందిన అమరరాజా కంపెనీ హైదరాబాద్‌కు తరలివెళ్లిన విషాదం. ఇలాంటి కంపెనీలు కోకొల్లలు.

ఏ పరిశ్రమలయినా ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి తరలిపోతే పాలకులు సిగ్గుపడి, దిద్దుబాటు చర్యలు చేపడతారు. కానీ ప్రభుత్వ సలహాదారు సజ్జల లాంటివారు మాత్రం ఆ కంపెనీలను మేమే వెళ్లమంటున్నామని వ్యాఖ్యానించారంటే, పాలనపై వారికున్న అవగాహన ఏమిటన్నది తేలిపోయింది. ఒక కంపెనీ కట్టే వివిధ పన్నులతో, సర్కారు ఖజానాకు వందలకోట్లు జమ అవుతాయన్న కనీస స్పృహ కూడా పాలకులకు లేకపోవడమే వింత.

ఇక బాబు హయాంలో హైదరాబాద్ నుంచి తరలివచ్చిన వందల స్టార్టప్ కంపెనీలన్నీ ..జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత, అంతే వేగంగా హైదరాబాద్‌కు తరలివెళ్లిన వైనం. బాబు హయాంలో రియల్‌ఎస్టేట్ పంచకల్యాణి గుర్రంలా విస్తరించింది. ఫలితంగా వేలాదిమంది నిరుద్యోగులకు ఉపాథి లభించింది. విజయవాడ, విశాఖ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు వంటి జిల్లాల్లో నివసించే నిరుద్యోగ యువకులకు, బాబు హయాంలో విస్తరించిన రియల్‌ఎస్టేట్ గొడుగు పట్టింది. కానీ జగన్ అధికారంలోకి రాగానే రియల్‌ఎస్టేట్ రంగం కుప్పకూలింది.

ఫలితంగా ఏపీ నిరుద్యోగ యువత మళ్లీ పొట్టచేతపట్టుకుని హైదరాబాద్, చెన్నై, బెంగళూరుకు వలస వెళుతున్న విషాద దృశ్యం. జగన్ అధికారంలోకి రాగానే దాదాపు 16 లక్షల మంది, తమ గ్యాస్ సిలెండర్లను హైదరాబాద్‌కు మార్చుకున్నారంటే.. జగన్ జమానా ఏ స్థాయిలో వలసకు కారణమవుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదన్నది విశ్లేషకుల వ్యాఖ్య.ప్రధానంగా కొత్తగా ఓటు హక్కు పొందిన మహిళలు జగన్ ప్రభుత్వ విధానాలపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు కనిపిస్తోంది.

‘ఈసారి పొరపాటున ఖర్మకాలి మళ్లీ జగన్ వస్తే కృష్ణా జిల్లా వాళ్లు సూర్యాపేట నుంచి.. గుంటూరు జిల్లా వాళ్లు నాగార్జున సాగర్, మిర్యాలగూడ నుంచి, అనంతపురం వాళ్లు బెంగళూరు వైపు, నెల్లూరు జిల్లా వాళ్లు చెన్నైకు వలస వెళ్లడం ఖాయం. ఇప్పటికే పెట్రోలు-డీజిల్ కోసం ఆ రాష్ట్రాలకు వెళ్లి కొట్టించుకుంటున్నారు. రేపు జగన్ వస్తే మొత్తం నిరుద్యోగ యువతనే, గంపగత్తగా ఆయా రాష్ట్రాలకు వలస వెళ్లడం ఖాయమ’ని ఐటీరంగ నిపుణుడొకరు విశ్లేషించారు.

ప్రధానంగా తాము పన్నుల రూపంలో కట్టిన డబ్బులను జగన్ తన ఓట్ల రాజకీయం కోసం పప్పుబెల్లాల మాదిరిగా పంచిపెట్టడాన్ని కొత్త ఓటర్లు, నిరుద్యోగ యువత జీర్ణించుకోలేకపోతున్నారు. సంపద పంచడం గొప్పతనం కాదు. సృష్టించడమే గొప్ప. పునరుత్పాదనకు అవకాశం లేని పథకాలు ఎందుకు? జనాలకు పనికల్పించాలే తప్ప సోమరిపోతులను చేస్తే సమాజంలో చైతన్యం ఎక్కడినుంచి వస్తుంది? అప్పులు తీర్చడానికి మళ్లీ కొత్త అప్పులు చేసి,వాటి ని మళ్లీ మాపై రుద్దితే అది పాలన అనిపించుకుంటుందా?’’ అని కొత్త ఓటర్లు ప్రశ్నిస్తున్నారు.

ఈ ఐదేళ్లలో జగన్ సర్కారు చేసిన అప్పులు రోజూ రచ్చ అవడం కూడా కొత్త ఓటర్లు, నిరుద్యోగ యువకులు, ఎన్డీయే వైపు చూసేందుకు కారణమవుతోంది. దీనికి జగన్‌కు అనుభవం లేకపోవడం, సరైన సలహాదారులు లేకపోవడం, ఎవరి సూచనలు వినకపోవడమే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బూతులు మాట్లాడే వారిని మంత్రులుగా నియమించడాన్ని యువత, విద్యాధికులు జీర్ణించుకోలేకపోతున్నారు.

ప్రధానంగా సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టడం, తాగుబోతులను కూడా తాకట్టు పెట్టి అప్పులు చేయడాన్ని విద్యాధికులు-నిరుద్యోగులు-కొత్త ఓటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సచివాలయాన్ని తాకట్టు పెడితే తప్పేమిటన్న మాజీ మంత్రి కొడాలి నాని ప్రకటనపై యువకుల్లో ఆగ్రహం వ్యక్తమయింది. జగన్ మళ్లీ గెలిస్తే సులభ్ కాంప్లెక్సులనే కాదు, తమ ఇళ్లను కూడా తాకట్టు పెట్టి అప్పులు చేస్తారన్న వ్యంగ్య వ్యాఖ్యలు వారి నుంచి బాహాటంగానే వినిపిస్తున్నాయి.

జగన్ అసమర్ధ నిర్వాకం వల్ల చివరకు ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సైతం సక్రమంగా జీతాలివ్వలేని దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘పాలకుడికి విజన్ ఉండాలి. ఆదాయం-ఖర్చుపై అవగాహన ఉండాలి. అభివృద్ధి-సంక్షేమం అనేవి సమాంతరంగా ఉండాలి. సంక్షేమానికి డబ్బు ఖర్చు పెడితే అభివృద్ధి ఆగిపోతుందన్న కనీస స్పృహ పాలకులకు ఉండాలి.

ఉదాహరణకు ఒక ప్రాంతంలో రోడ్లకు డబ్బు ఖర్చు పెడితే, అక్కడ భూమి విలువ పెరుగుతుంది. వ్యాపారాలు పెరిగి అది ఉపాథికి దోహదపడుతుంది. అది పాత సీఎం చంద్రబాబులో కనిపించిన విజన్. కానీ జగన్ అసలు ఆ రోడ్డు వేయడం వృధా. ఆ డబ్బును ఓట్ల కోసం పంచుదామన్న కోణం. జగన్ ప్రభుత్వంలో పనులుచేసిన కాంట్రాక్టర్లు అడుక్కుతింటున్నారు. ఎవరికీ బిల్లులు ఇవ్వడం లేదు. రాష్ట్రంలో ఒక్క రోడ్డైయినా బాగుందా? పనిచేయడానికి కాంట్రాక్టులెవరైనా ముందుకువస్తున్నారా?

అదే అనుభవం ఉన్న నేతకు, అనుభవం లేని నేతకు ఉన్న తేడా. ఒకసారి అవకాశం ఇస్తేనే జగన్ ఖజానాను ఊడ్చిపెట్టి అప్పులకుప్పగా మార్చారు. ఇంకో అవకాశం వస్తే రాష్ట్రంలోని ఇళ్లను కూడా తాకట్టుపెడతారేమో? ఆయన ఇంకోసారి సీఎం అయితే ఏపీలో వ్యాపారులు, ఉద్యోగులు, మాలాంటి నిరుద్యోగులు, పక్క రాష్ట్రాలకు పారిపోవడం ఖాయమని’’ విశాఖకు చెందిన ఓ నిరుద్యోగి విశ్లేషించారు.

మొత్తంగా గత ఐదేళ్ల క్రితం కొత్తగా ఓటర్లుగా నమోదయిన యువకులు.. నేడు కొత్తగా నమోదైన యువ ఓటర్లు చంద్రబాబు-జగన్ పాలనాతీరుపై బేరీజు వేసుకుని.. అనుభవం లేని నాయకుడు పాలకుడయితే అప్పులు-అమ్మకాలు-తాకట్టు తప్ప మరేమీ చేయలేరన్న నిశ్చితాభిప్రాయానికి వచ్చినట్లు స్పష్టమవుతోంది. ఆ కారణంతోనే వారంతా ఎన్డీయే వైపు చూస్తునట్లు కనిపిస్తోంది.

Leave a Reply