అర్ధమయిందా రాజా?

( మార్తి సుబ్రహ్మణ్యం)

‘చంద్రబాబు రాజమండ్రి జైల్లో ఉన్నారు. కాబట్టి మీరంతా విజయవాడనో, కర్నూలో, గుంటూరులోనో ధర్నాలు చేసుకోండి. హైదరాబాద్‌లో ఏం పని? ఇక్కడ ధర్నాలు చేస్తే ఒప్పుకోం. హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతింటుంది’- బాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్‌లో ధర్నాలు చేసిన ఐటి ఉద్యోగులపై నాటి మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలివి.

సీన్ కట్ చేస్తే బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాతిపిత కేసీఆర్ బిడ్డ బతుకమ్మ కవితక్క అరెస్టుకు నిరసనగా ధర్నాలు చేయాలన్న బీఆర్‌ఎస్ పిలుపు నేపథ్యంలో, అప్పటి కేటీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ గుర్తుకురావడంలో వింతేమీ లేదు. సారా కేసులో సారు బిడ్డ అరెస్టయినప్పుడు, ఆ సందర్భంలో అన్నయ్య కేటీఆర్ ఈడీ-ఐటీ అడ్డుకుని వారించి.. ధర్మపన్నాలు చెప్పిన తీరు, చూచువారలకు చూడముచ్చట. తమ పదేళ్లపాలనలో ఆ ధర్మపన్నాలను జమ్మిచెట్టుకెక్కించిన సత్యమూర్తులు, ఇప్పుడు వాటి గురించి మాట్లాడటమే వింత.

కర్మసిద్ధాంతంపై నమ్మకం ఉన్నవారికి, కేసీఆర్ బిడ్డ కవిత అరెస్టు పరిణామం పెద్దగా ఆశ్చర్యపరచదు. కానీ పదేళ్లు ధర్మాన్ని నాలుగుపాదాల ‘చేతులు పట్టుకుని’ మరీ నడిపించి, తెలంగాణను రామరాజ్యంగా మార్చిన గులాబీదండు దృష్టిలో మాత్రం ఆమె అరెస్టు అక్రమం, అన్యాయం! అన్నయ్య కేటీఆర్ దృష్టిలో మాత్రం చెల్లి అరెస్టు అప్రజాస్వామ్యం. శుక్రవారం అరెస్టు చేయడం మరీ దారుణం. కాకి పిల్ల కాకికి ముద్దే కదా? కాని చట్టం తన పని తాను చేసుకుంటుంది కదా?

ఇక చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ హైదరాబాద్‌లోని సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు నాయకుడెవరూ లేకుండానే భారీ ర్యాలీ, ఆందోళన చేయటం ఢిల్లీ వరకూ పాకింది. గచ్చిబౌలి స్టేడియంలో కూడా వేలాదిమందితో నిర్వహించిన సభ ఢిల్లీని ఆకర్షించింది. హైదరాబాద్ టు రాజమండ్రి వరకూ ఐటీ ఉద్యోగులు నిర్వహించిన కార్ల ర్యాలీతో ట్రాఫిక్ జామయిపోయింది.

ఆ సందర్భంలో ఐటీశాఖమంత్రిగా ఉన్న కేటీఆర్ అక్కడెక్కడో చంద్రబాబును అరెస్టు చేస్తే ఇక్కడ ధర్నాలు చేయడం ఏమిటి నాన్సెన్స్? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుంది కదా అని కన్నెర్ర చేశారు. ఐటీ కంపెనీలతో మాట్లాడతానని హెచ్చరించారు. వెళ్లి ఆంధ్రాలో ఆందోళన చేసుకోమని సెలవిచ్చారు. బహుశా హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతింటుదన్న ఆందోళనతోనే, కేటీఆర్ అలా మాట్లాడి ఉండవచ్చని మేధావులు కూడా కామోసనుకున్నారు.

అప్పటి బీఆర్‌ఎస్ ఉత్తరాధికారి ధర్మాగ్రహం నిజమైతే… మరి ఇప్పుడు కవిత అరెస్టుకు నిరసనగా ధర్నా చేస్తున్న బీఆర్‌ఎస్ వల్ల హైదరాబాద్ బ్రాండ్ దెబ్బతినదా? బరాబర్ తింటుంది కదా?! అయినా మరి బీఆర్‌ఎస్ ధర్నాలకు ఎందుకు పిలుపునిచ్చినట్లు? అంటే మన బతుకమ్మ కవితక్క కోసమైతే ధర్నాలు చేయవచ్చా? అప్పుడు మన సిటీ బ్రాండు జేమ్సుబాండులా వర్ధిల్లుతుందా? అంటే బ్రాండ్లలో బాబు బ్రాండ్, కవిత బ్రాండ్లు ఉంటాయా?

మరి ఆంధ్రాలో ఆందోళన చేసుకోమని నాడు సెలవిచ్చిన తారకరత్నం, ఇప్పుడు గులాబీదళాలు ధర్నాలు చేయాల్సింది ఢిల్లీలో తప్ప, హైదరాబాద్‌లో కాదు కదా అని మర్చిపోతే ఎలా? ఎందుకంటే సారా కేసులో అరెస్టయిన సారుబిడ్డ కవిత, ఇప్పుడు ఉన్నది ఢిల్లీ జైల్లో కాబట్టి. ఆ ప్రకారంగా గులాబీదళాలు ఢిల్లీ వెళ్లి, జంతర్‌మంతర్ వద్ద ధర్నాలు చేయాల్సిందే. ప్రపంచమేధావి తారకరాముడు ఈ చిన్న లాజిక్ మిస్సవడమే వింత.

ఇక ట్రాన్సిట్ వారెంటు గురించి కవిత నివాసంలో, ఈడీ అధికారులతో తారకరాముడు చేసిన వింత వాదన మరో విడ్డూరం. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా చెల్లెమ్మను ఎలా అరెస్టు చేస్తారన్నది లాయర్ కేటీఆర్ చేసిన వాదన. ఇందుకు మీరు కోర్టులో ఇబ్బందిపడతారని జస్టిస్ తారకరాముడు, అధికారులను హెచ్చరించడమే హాశ్చర్యం. హైదరాబాద్‌లో ఉన్న ఎంపి రఘురామకృష్ణంరాజును కూడా ఇలాగే, ఏపీ సీఐడీ పోలీసులు ట్రాన్సిట్ వారెంట్ లేకుండానే ఇంట్లోకి జొరబడి, ఆయనను అరెస్టు చేసి తీసుకువెళ్లారు. అందుకు అనుమతి ఇచ్చిన తన సర్కారు ఘనతను, కేటీఆర్ అప్పుడే మర్చిపోతే ఎలా?

అప్పుడు ఎంపి రాజును ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్టు చేసేందుకు, కేసీఆర్ సర్కారు అనుమతించడం రైటయితే.. ఇప్పుడు ఈడీ-ఐటీ అధికారులు జమిలిగా వచ్చి, బతుకమ్మ కవితక్కను ట్రాన్సిట్ వారెంట్ లేకుండా అరెస్టు చేసి తీసుకువెళ్లడం కూడా, రైటేనన్నది బుద్ధిజీవుల ఉవాచ. తాను చేస్తే సంసారం. ఎదుటివాళ్లు చేస్తే వ్యభిచారం అంటే కుదరదు కదా?

ఇక కావాలనే శుక్రవారం వచ్చి తెలంగాణ చెల్లెమ్మను అరెస్టు చేయడం దారుణమని కూడా, గులాబీ యువనేత వాపోవడం ఈ శతాబ్దపు జోక్ కిందే లెక్క. అసలు తమ పదేళ్ల రామరాజ్యంలో, శుక్రవారం ఎవరినీ అరెస్టు చేయనట్లు… ఐపీసీ పుట్టిన తర్వాత మొట్టమొదట చెల్లెమ్మనే మొదటిసారి శుక్రవారం అరెస్టు చేసినట్లున్నాయి తారకరాముడి మాటలు! రాష్ట్రాల్లో పాలకుల చేతిలో ఉండే సీఐడీ, పోలీసు, టాస్క్‌ఫోర్సు ఎలాగైతే శుక్రవారం అరెస్టు చేస్తుందో.. కేంద్రం చేతిలో ఉండే ఈడీ,ఐటీ, సీబీఐ కూడా అదే ‘శుక్రవారం సెంటిమెంటు’ను పాలో అవుతుంది.

ఎందుకంటే శుక్రవారం సాయంత్రం అరెస్టు చేస్తే, శని-ఆదివారాలు కోర్టుకు సెలవులు కాబట్టి. అంటే ఆ మూడురోజులు ప్రత్యర్ధులు జైల్లో ఉండాల్సిందే. న్యాయశాస్త్రాన్ని అవపోసన పట్టిన తారకరాముడి పాత సర్కారుకే అన్ని తెలివితేటలుంటే.. అదే న్యాయశాస్త్రాన్ని ఫాలో అయ్యే దర్యాప్తు సంస్థలకు ఇంకెన్ని తెలివితేటలుండాలి? అయినా ఫ్రైడే సెంటిమెంటుకు బంధాలు-బంధుత్వాలు గుర్తుకురావు.

తెలంగాణ చెల్లెమ్మ అరెస్టుతో ఆగ్రహోదగ్రుడయిన తారకరాముడు ట్వీటిన ట్వీటు పరిశీలిస్తే.. అంతలావు దు:ఖంలో కూడా పక్కరాష్ట్ర మిత్రుడు జగనన్నకు మేలు చేయాలన్న త్యాగనిరతి గుర్తుకు రావడమే గ్రేట్. గత ఎన్నికల సమయంలో మోదీకి వ్యతిరేకంగా చంద్రబాబు చేసిన ట్వీట్‌ను తారకరాముడు ఇంత దు:ఖంలో కూడా రీట్వీట్ చేయడం బట్టి.. జగన్-కేసీఆర్ మధ్య ఉన్న ఫెవికాల్ బంధం సులభంగా అర్ధమవుతుంది.

నిజంగా కేటీఆర్ సంప్రదాయాన్నే కాంగ్రెస్-టీడీపీ సోషల్‌మీడియా దళాలు ఫాలో అయితే, ఎన్నికల ముందు నిజంగా నష్టపోయేది గులాబీ పార్టీనే. ఎందుకంటే కేసీఆర్ టీడీపీలో ఉన్నప్పుడు జోనల్ వ్యవస్థపై అసెంబ్లీలో చేసిన ప్రసంగం, మహాకూటమి సభలపై చంద్రబాబును ఆకాశానికెత్తిన ప్రసంగాల వీడియోలు, విజన్ – సంపద ఎలా సృష్టించాలో తెలిసిన దార్శనికుడని పొగిడిన వీడియోలు, మోదీకి సగానికి వంగి ప్రణమిల్లిన కేసీఆర్ ఫొటోలు ఇలా డజన్ల కొద్దీ గులాబీ ప్రత్యర్ధులకు అస్త్రాలవుతాయని తారకరాముడు మర్చిపోవడమే ఆశ్చర్యం.

కానీ గులాబీదళాలంతా కవితక్క అరెస్టుపై ఆందోళన చెందుతున్న ఆ సమయంలో కూడా.. అంత టెన్షన్‌లో కూడా.. తన మిత్రుడు జగన్‌కు ఎన్నికల్లో లాభం కలిగించే ట్వీట్ చేయడమే అద్భుతం. అంటే ఆ ట్వీట్ చూసి, ఆంధ్రా ఓటర్లు చంద్రబాబు పాత ట్వీట్‌కు ప్రభావితులయి, బీజేపీని ఓడించాలని కేటీఆర్ కవిభావన కామోసు.

ఇటీవలి కాలంలో తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణ జాతిపిత కేసీఆర్‌ను తిట్టిపోస్తున్న తీరుపై, గులాబీదళాలు టన్నుల కొద్దీ ఆవేదన కుమ్మరిస్తుండటమే వింత. ప్రపంచం పుట్టిన తర్వాత రేవంత్ మాత్రమే, అన్నేసి తిట్లు తిడుతున్నారని గులాబీదళాలు కుమిలిపోవడం ఆశ్చర్యమే మరి!

అసలు కేసీఆర్ పుట్టి బుద్ధెరిగిన తర్వాత, ఇప్పటివరకూ ఎవరినీ పల్లెత్తు మాట కూడా అననట్లు.. తెలుగుబాలశిక్షలోని పదాలు మాత్రమే వాడినట్లు.. మీరు అన్న గౌరవ వాచకం మాత్రమే వాడినట్లు.. కడియం, హరీష్ అండ్ కో చేస్తున్న యాగీ వినడానికే వింత. అసలు అలాంటి పదాలు వినడానికే గులాబీదళాలకు రోతగా ఉందట. సీఎం స్థాయి వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడమేంటన్నది వారి వేదనాభరిత తాత్పర్యం.

థూ మీ బతుకులు చెడ.. ముఖాలు ఎక్కడపెట్టుకుంటారు?.. రండలు.. పెండముఖాలు.. దిక్కుమాలిన.. మిమ్మల్ని పదడుగులలోతు పాతరేస్తానన్న పదాల సృష్టికర్త కేసీఆర్ మాత్రమేనని, ఆయన చూపిన మాటలోనే రేవంత్ నడుస్తున్నారన్నది అందరికీ తెలిసిన ముచ్చటనే. ఆ లెక్కన తెలంగాణ జాతిపిత కేసీఆర్ బాటలోనే రేవంత్ నడుస్తున్నందుకు గర్వించాలే గానీ.. ఈ గాయగత్తర ఎందుకన్నది తెలంగాణ తెలుగుభాషా కోవిదుల ప్రశ్న.

Leave a Reply