కమలం పోయి.. కాంగ్రెస్ వచ్చె ఢాం.. ఢాం.. ఢాం

– రాజకీయ ప్రత్యర్ధి విషయంలో మారిన కేసీఆర్ వ్యూహం
– కాంగ్రెస్ పార్టీనే బీఆర్‌ఎస్ పోటీదారన్న నిర్థరణ
– అందుకే ఆ రెండు సభల్లోనూ కాంగ్రెస్‌పైనే మాటల దాడి
– ‘పువ్వు పార్టీ’పై పల్లెత్తు విమర్శ చేయని కేసీఆర్
– గతంలో బీజేపీ, మోడిని దునుమాడిన బీఆర్‌ఎస్ అధినేత
– కర్నాటక ఫలితాలతో కేసీఆర్ వ్యూహం మారిందా?
– తెలంగాణలో బీజేపీకి ప్రమోట్ చేసినా కనిపించని ఫలితం
– బెదిరింపులు, ప్రకటనలు, హెచ్చరికలే తప్ప కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా ఎదగని బీజేపీ
– అందుకే తెలంగాణలో బీజేపీతో లాభం లేదని కేసీఆర్ గ్రహించారా?
– కాంగ్రెస్‌ను టార్గెట్ చేయడం వెనుక కేసీఆర్ అసలు వ్యూహం అదేనా?
– ఇక తెలంగాణలో యుద్ధం కాంగ్రెస్-బీఆర్‌ఎస్‌కే పరిమితం
– నిర్మల్, నాగర్ కర్నూల్ బహిరంగసభల్లో కేసీఆర్ ఇచ్చిన సంకేతాలు
( మార్తి సుబ్రహ్మణ్యం)

తెలంగాణ సీఎం కేసీఆర్ ఏది చేసినా సంచలనమే. ఏది చెప్పినా విచిత్రమే. సారుకు ఎవరిపైనయినా కోపమొస్తే.. ప్రపంచమంతా ఆయనను అనుసరించాలి. సారుతోపాటు జనం కూడా కన్నెర్ర చేయాలి. సారు ఎవరినయినా అనుగ్రహిస్తే, లోకమంతా ఆయన బాటలోనే నడవాలి. సారు అవునంటే తెలంగాణ సమాజం అంతా అవునని తీరాలి. కాదంటే యావత్ తెలంగాణ జనం కూడా, కాదని గర్జించాల్సిందే. దటీజ్ కేసీఆర్ సార్!

మళ్లీ మామూలే. నిన్నటి వరకూ కమలంపై కన్నెర్ర చేసి.. ఆ పార్టీ అరాచకవాదంపై తాను చేసే పోరాటంలో, దేశమంతా తన వెనక నిలబడాలని పిలుపునిచ్చిన కేసీఆర్ సారు, ఇప్పుడు తుపాకీని కాంగ్రెస్ వైపు తిప్పారు. 50 ఏళ్లలో దేశ ప్రజలకు మంచినీరు ఇచ్చిన పాపాన పోలేదని, కాంగ్రెస్‌పై కయ్యిమని లేచారు. కాంగ్రెస్‌ను నమ్మితే రైతుబంధు ఆగమవుతుందని హెచ్చరించారు. కాంగ్రెస్‌ను బంగాళాఖాతంలో కలిపేస్తామని విరుచుకుపడ్డారు. ఇవన్నీ అచ్చంగా.. అబ్‌కీ బార్.. కిసాన్ సర్కార్ అంటూ హడావిడి చేసి, కమలాన్ని కమిలేసేలా విమర్శించిన కేసీఆర్ వ్యాఖ్యలే!

సో..ఇవి.. తెలంగాణ యుద్ధక్షేత్రంలో, తన రాజకీయ ప్రత్యర్ధి ఎవరన్నది సారు స్పష్టమైన సంకేతామివ్వడమే. నిజానికి ఈ నాలుగేళ్లు కేసీఆర్..కాంగ్రెస్‌ను వెనక్కినెట్టి, బీజేపీని ప్రమోట్ చేశారు. మొదటి రెండేళ్లు కేంద్రంతో దోస్తీ, ఇప్పుడు కుస్తీ. అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మోదీని విమర్శిస్తే, స్వయంగా కేసీఆర్ సారే అడ్డుకుని, మోదీకి వకాల్తా పుచ్చుకున్న అద్భుత సన్నివేశం.

తెలంగాణలో తన ప్రత్యర్ధి బీజేపీ మాత్రమేనన్న భావన కల్పించి, యుద్ధం తమ ఇద్దరికే పరిమితయ్యేందుకు సారు చాలా కష్టపడ్డారు. బీజేపీని మాత్రమే టార్గెట్ చేయడం- బీజేపీ కూడా ఎదురుదాడి చేసే యుద్ధ వాతావరణం. మధ్యలో సంజయ్ అరెస్టులు. కవితను జైలుకు పంపిస్తామని..కేసీఆర్ జైలుకెళ్లడానికి సిద్ధంగా ఉండాలన్న బీజేపీ నేతల గంభీర హెచ్చరికలతో, ఇక భవిష్యత్తులో యుద్ధమంతా బీజేపీ-బీఆర్‌ఎస్ మధ్యనే ఉంటుంది కామోసన్న భ్రమలు కలిగిన-కల్పించిన వాతావరణం.

దానితో పోటీ అంతా, బీజేపీ-బీఆర్‌ఎస్ మధ్యనే ఉంటుందన్న భావన, ప్రజల్లో కల్పించాలన్నది సీఎం కేసీఆర్ కోరిక. అటు బీజేపీ కూడా కావలసిందీ అదే. రోగి-వైద్యుడి చందాన.. బీఆర్‌ఎస్ గెలిచినా బీజేపీకి బేఫికర్. కానీ కాంగ్రెస్ మాత్రం అధికారంలోకి రాకూడదన్నదే పువ్వు పార్టీ పాలిసీ. ఎవరి వ్యూహాలు ఎలా ఉన్నా, ప్రజల లెక్కలు-అంచనాలు, రాజకీయ పార్టీల ఆకాంక్షలకు అనుగుణంగా ఉండవు కదా?!

తాజాగా కేసీఆర్ వ్యూహం మారడానికి కనిపించే కారణాలు సుస్పష్టం. తెలంగాణ నేలపై కమలానికి, ఎన్ని టీఎంసీల నీళ్లు పోసినా వికసించడం కష్టంగానే కనిపిస్తోంది. నీళ్లు వృధా తప్ప, కమలవికాసం కనిపించడం లేదు. బీజేపీలో బండి సంజయ్ లాంటి ఏకవీరులే ఎక్కువ. సంజయ్ ఇచ్చే ప్రకటనలు, చేసే హెచ్చరికలు, కనిపించే భావోద్వేగం పరిశీలించే వారికి.. బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్న భ్రమలు కలగడం సహజం.

కానీ క్షేత్రస్థాయిలో బీజేపీ సైన్యం తక్కువ. నేతల హడావిడి ఎక్కువ. ఎంతసేపూ మతానికి సంబంధించిన లొల్లి తప్ప.. గల్లీల్లో జనం గోస పట్టించుకుని, పోరాటాలు చేసే నేతలెవరూ లేని దుస్థితి. నేతలే తప్ప జెండా పట్టుకునే కార్యకర్తల సంఖ్య అత్యల్పం. అసలు అధికారంలోకి వస్తామని నేతల గంభీర ప్రకటనలే తప్ప, పట్టుమని రెండు, మూడు డజన్ల మంది.. అసెంబ్లీకి నిలబడే మొనగాళ్లు, భూతద్దం వేసి వెతికినా కనిపించని దయనీయం.

ఏదో కష్టపడి పార్టీ ‘బండి’ లాగిస్తున్న సంజయుడి కాళ్లకు, సొంత పార్టీలోనే గుచ్చుకునే ముళ్లు ఎక్కువ. ఆయన తొలగించాలని ఒకవర్గం, ఉంచాలని ఇంకో వర్గం. ఈ గత్తరలో మాకు పదవులేమీ వద్దని ఢిల్లీ బాసుల వద్ద వైరాగ్యం ప్రదర్శించే నేతలు మరికొందరు. తాజాగా అధ్యక్షుడి అసమ్మతి శిబిరం మరోసారి భేటీ అయి, సంజయుడి సంగతి తేల్చాలని ఢిల్లీకి కబురు పంపింది.

ఆయన తన ‘బండి’లో, ఎవరినీ ఎక్కించుకోకుండా సొంతంగా వెళుతున్నారని.. ఎవరికీ బాధ్యతలు ఇవ్వకుండా, ఒక్కడే ఫోకస్ అవుతారన్నది కొత్తగా వచ్చిన వారితో సహా, పాత కాపులు కూడా చేసే ఫిర్యాదు. చివరాఖరకు కర్నాటక ఫలితాల పుణ్యాన, పార్టీలో ఎన్నికల వరకూ ఎంత మంది ఉంటారో, ఎంతమంది పీచేముఢ్ అవుతారో తెలియని గందరగోళం. రెడ్లలో ఎంతమంది ఉంటారో కూడా తెలియని గందరగోళం. ఏతావతా తెలంగాణలో బీజేపీకి అంత సీన్ లేదని.. పోటీ అంతా కాంగ్రెస్-బీఆర్‌ఎస్ మధ్యనే, పరిమితం అవుతున్న రాజకీయ వాతావరణం స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి.

అందుకే రాజకీయాల్లో, ఇలాంటి తీసివేతలు-కూడికల్లో మొనగాడైన కేసీఆర్.. పువ్వు పార్టీ ఎదిగి, ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడం ద్వారా, ‘కారు’కు ఇంధనంగా మారడం కష్టమన్న నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోంది. ఆయన తాజాగా మాట్లాడిన.. నిర్మల్, నాగర్ కర్నూల్ బహిరంగసభలు ఆ సంకేతాలే ఇచ్చాయన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.

ఆ రెండు సభల్లో ‘పువ్వు పార్టీ’పై పల్లెత్తు మాట అనని కేసీఆర్ సారు.. ఉన్నట్లుండి కాంగ్రెస్ లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధించారు. ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కారును ఆగం పట్టిస్తున్న బీజేపీ సర్కారు తీరుపై ,కేసీఆర్ విరుచుకుపడతారని ఆశించిన వారి ఆశలు ఆవిరయ్యాయి. గిరిజన మహిళ అయిన రాష్ట్రపతిని పిలవకుండానే, పార్లమెంటు భవనం ప్రారంభించిన మోదీపై.. సారు అగ్గిరాముడవుతారని, గులాబీ దళాలు వేసిన అంచనాలు కూడా దారుణంగా ఫెయిలయ్యాయి. బీజేపీ సర్కారుపై భూకంపం సృష్టిస్టారనుకున్న కేసీఆర్ సారు.. కాంగ్రెస్‌పై కత్తులుదూసి ఆవిధంగా ముందుకెళ్లారు.

రాష్ట్రాలపై కేంద్రం పెత్తనంపై మరోసారి దుమెత్తిపోస్తారనుకుంటే, అసలు ఆ ఊసే లేదు. రాష్ట్రానికి కేంద్రం యర్ర యాగాణీ కూడా ఇవ్వకుండా సతాయిస్తోందని, లెక్కల చిట్టా విప్పుతారనుకున్న వారికి మిగిలింది నిరాశే. మొత్తంగా మోదీ సర్కారును దునుమాడతారనుకున్న కేసీఆర్.. కమలాన్ని కరుణించి, హటాత్తుగా కదనాన్ని కాంగ్రెస్ వైపు మళ్లించి అందరినీ ఆశ్చర్యపరిచారు.

తాజా పరిణామాలు పరిశీలిస్తే.. ఇక కేసీఆర్ సారు కమలం జోలికి వెళ్లకుండా, కాంగ్రెస్‌పైనే అస్త్రశస్త్రాలు సంధిస్తారని, మెడపై తల ఉన్న ఎవరికయినా అర్ధమవుతుంది. అది ఒకందుకు కాంగ్రెస్ నెత్తిన పాలుపోసినట్లే. బీజేపీ-బీఆర్‌ఎస్ ఒకటేనన్న కాంగ్రెస్ భవిష్యత్తు ప్రచారానికి, కేసీఆర్ మారిన వ్యూహం ఉపయోగపడనుంది. ఆ ప్రకారంగా.. రేపటి ఎన్నికల సమరంలో కలబడి-నిలబడేవి.. కాంగ్రెస్-బీఆర్‌ఎస్ మాత్రమేనన్న వాస్తవాన్ని, కేసీఆర్ తనకు తెలియకుండానే జనాలకు బోధించినట్లయింది.