
– తిరుమల కొండపై ఆదిపురుష్ యూనిట్ ముద్దుల పురాణం
– బహిరంగంగానే కృతిసనన్‌ను ముద్దుపెట్టుకున్న దర్శకుడు ఓం రౌత్
– సోషల్‌మీడియాలో హగ్గుల సీన్లు హల్‌చల్
– శ్రీవారి సన్నిధిలో ఇవేం శృంగార చేష్టలు?
– ఆదిపురుష్ యూనిట్ రోత చర్యలపై భక్తుల ఆగ్రహం
– భక్తి సినిమాలోనే కాదు బయట కూడా ఉండాలంటున్న భక్తులు
– క్షమాపణ చెప్పాలంటున్న హిందూ సంస్థలు
– ఇదేనా హిందువులకు మీరిచ్చే సంకేతమన్న బీజేపీ నేత నాగోతు రమేష్ నాయుడు
– శ్రీవారి కొండ ముద్దులకు కేంద్రం కాదని ఆగ్రహం
– భక్తిని అమ్ముకుంటున్నారని భక్తుల మండిపాటు
( మార్తి సుబ్రహ్మణ్యం)
సినిమా వారికి ముద్దులు.. గుద్దులు మామూలే. బయట సినిమా ఫంక్షన్లలో అందరి ఎదుటా, హగ్ చేసుకోవటం వారికి అలవాటే. కాకపోతే.. బయట గుళ్లకు వచ్చినప్పుడూ అదే పనిచేస్తేనే, రచ్చ రంబోలా అవుతుంది. ఆదిపురుష్ దర్శక, నటీమణి తిరుమల కొండ కేంద్రంగా చేసుకున్న ముద్దులపర్వం, ఇప్పుడు ఆ సినిమాకు పరోక్ష ప్రచారం కల్పించేలా చేసింది. వారికి ముద్దులు పెట్టుకోవడం అలవాటయి ఉండవచ్చు. కానీ తాము ఉన్నది దేవుడు సన్నిధిలో అన్న విషయం మరిచి, తాదాత్మ్యంతో ‘కిస్సు’మనడమే చిక్కులు తెచ్చింది. ఇంతకూ సదరు దర్శకుడికి కిస్సిచ్చిన తారామణి.. ఆదిపురుష్ సినిమాలో సీతమ్మ వారి పాత్రధారట! అదీ ఇక్కడ వైరటీ!!
అది శ్రీవారి సన్నిథి. తిరుమల కొండ పై కొలువైన శ్రీవారి దర్శనానంతరం.. శృంగార పర్వానికి తెరలేపిన ఆ సినిమా తారల మన్మథ వేషాలతో, హిందువుల మనోభావాలు దారుణంగా దెబ్బతిన్నాయి. కొండపై ఒకరికొకరు ముద్దులు పెట్టుకోవడంతో, కొండెక్కిన అపచారాన్ని హిందూ సంఘాలు
తూర్పారపడుతున్నాయి. ’కొండపై ఇదేం పాడు బుద్ధి’ అంటూ భక్తులు ఆగ్రహిస్తున్నారు. ఈ రోతను చూడ్డానికేనా మేం కొండకొచ్చిందని భక్తజనం రుసరుసలాడుతోంది. దేవుడిపై భక్తి సినిమాలోనే కాదు, బయట కూడా చూపించాలంటూ నెటిజన్లు అగ్గిరాముళ్లవుతున్నారు. ఇదంతా ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఆదిపురుష్ సినిమా, ప్రీ.. ‘ఫ్రీ కిస్ ఫంక్షన్’ దృశ్యాలు.
పాన్ ఇండియా హీరోగా అవతరించిన ప్రభాస్ నటించిన, ఆదిపురుష్ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ తిరుపతిలో అంగరంగ వైభవంగా జరిగింది. సదరు కార్యక్రమానికి చినజీయర్‌స్వామి కూడా వచ్చి, అనుగ్రహభాషణం చేశారు. ఇలాంటి సినిమా తీసి మహోపకారం చేశారని కీర్తించారు. సీన్ కట్ చేస్తే.. సినీ దర్శకుడు ఓం రౌత్, నటి కృతిసనన్ సహా పలువురు యూనిట్ సభ్యులు, స్వామివారి దర్శనానికి వెళ్లారు. అంతవరకూ బాగానే ఉంది.
కానీ కొండపై స్వామి వారి దర్శనం తర్వాత.. రౌత్, కృతి ముద్దుల పోటీకి దిగిన దృశ్యాలు సోషల్‌మీడియాకు చిక్కాయి. ఇద్దరూ ఒకరినొకరు ముద్దులు పెట్టుకోవడం, రౌత్ సదరు హీరోయిన్‌కు ఫ్లైయింగ్ కిస్ లాంటిది ఇవ్వడం, శరవేగంగా జరిగిపోయింది. ఈ శృంగార దృశ్యాలు చూసిన భక్తులు నివ్వెరపోయారు. కొండపై ఇదేం రోత పనులని మండిపడ్డారు. అంతదూరం నుంచి కొండ కొచ్చింది, ఈ పాడుపనులు చూడటానికా అని చీత్కరించారు.
రంగంలోకి దిగిన హిందూ సంఘాలు, జరిగిన అపచారానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాయి. కొండపై కనీస సంస్కారం పాటించాలన్న స్పృహ లేదా అని మండిపడ్డాయి. చేసిన దానికి క్షమాపణ చెప్పాలని, ఇలాంటి ఘటనలు కోట్లాది వెంకన్న భక్తులను, యావత్ హిందూ సమాజం మనోభావాలను గాయపరిచాయని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్‌నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సినిమాలో పవిత్రంగా కనిపించే పాత్రలు, బయట సమాజంలో కూడా అంతే పవిత్రంగా కనిపించాలన్నారు. భక్తి సినిమాలోనే కాదు. బయట కూడా కనిపించాలంటూ.. అటు నెటిజన్లు కూడా ఆదిపురుష్ యూనిట్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు. ఇప్పుడుది సొషల్‌మీడియాలో ట్రెండింగ్‌గా నిలిచింది.