– పార్టీ కోసం రాజీనామా చేయక తప్పని పరిస్థితి
– సలహాదారులకు గీత గీసిన ఈసీ
– వారూ ప్రభుత్వ సేవకులేనని స్పష్టీకరణ
– సలహాదారులకూ ప్రవర్తనా నియమావళి వర్తిస్తుందని జీఏడీ నోట్
– ఎన్డీయేపై రోజూ విమర్శలు కురిపిస్తున్న సజ్జల
– ఇప్పటికే ఆయనపై కూటమి ఫిర్యాదు
– దీనితో నైతిక సంకటంలో సజ్జల
– చివరికి రాజీనామా చేయాలనే నిర్ణయం?
– ఇక పూర్తి స్థాయి పార్టీ నేతగా తెరపైకి వచ్చే అవకాశం
( మార్తి సుబ్రహ్మణ్యం)
ప్రభుత్వ సలహాదారు, సీఎం జగన్‌కు నమ్మినబంటు సజ్జల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇకపై ఆయన పూర్తి స్థాయి పార్టీ నేతగా, తెరపైకి రానున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న సలహాదారులందరికీ, ఎన్నికల నియమావళి వర్తిస్తుందని తాజాగా ఎన్నికల సంఘం స్పష్టమైన ఆదేశాలిచ్చింది.
నిజానికి సీఈసీ కేవలం సజ్జలపై వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకునే, ఆ ఆదేశాలు జారీ చేయడం ప్రస్తావనార్హం. ఆమేరకు రంగంలోకి దిగిన సాధారణ పరిపాలన శాఖ, సలహాదారులందరికీ నోట్ పంపింది. కాగా అధికారికంగా 40 మంది ప్రభుత్వ సలహాదారులుండగా, కొన్ని జీఓలను రహస్యంగా ఉంచినందున అసలు ఎంతమంది సలహాదారులను నియమించారన్నది ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు.
ఇది సహజంగానే సజ్జలకు నైతిక సంకటంగా మారింది. ఇప్పటివరకూ ఆయన ప్రభుత్వ సలహాదారుతోపాటు, వైసీపీ ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రతిరోజూ ఎన్డీఏ కూటమిపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అందులో ఆయన చేసిన కొన్ని విమర్శలను, ఎన్డీఏ కూటమి నేతలు ఈసీకి సైతం ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ జీతం తీసుకుంటున్న సజ్జల, తమపై ఎలా విమర్శలు చేస్తారని ప్రశ్నించారు. ఎన్నికల నియమావళి ఆయనకూ వర్తిస్తుంది కాబట్టి, సజ్జలపై చర్యలు తీసుకోవాలని ఈసీని డిమాండ్ చేశారు.
దానితో ఇరకాటంలో పడ్డ సజ్జల.. ఈ పరిస్థితిలో సలహాదారు పదవికి రాజీనామా చేయడమే మంచిదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. సలహాదారు హోదాలో ఉండి రోజూ ఎన్డీఏను విమర్శించి, వారి ఫిర్యాదులు ఎదుర్కొనే బదులు..అసలు ఆ హోదాకే రాజీనామా చేయటమే ఉత్తమని సజ్జల భావిస్తున్నట్లు తెలుస్తోంది. సలహాదారు పదవికి రాజీనామా చేసి, పార్టీ ఆఫీసు కేంద్రంగా ఇక పూర్తి స్థాయి రాజకీయ కార్యకలాపాలు నిర్వహించ డం వల్ల, అటు పార్టీకి సైతం ఉపయోగపడుతుందని ఆయన యోచిస్తున్నట్లు చెబుతున్నారు.
ఎలాగూ ఇప్పుడు కోడ్ అమలులో ఉన్నందున, ప్రభుత్వపరమైన వ్యవహారాలు ఉండవు. కోడ్‌ను దృష్టిలో ఉంచుకుని సీఐ నుంచి ఐపిఎస్ వరకూ.. ఎమ్మార్వో నుంచి ఐఏఎస్ వరకూ, తమకు కావలసిన వారికి కావలసిన చోట ముందస్తు పోస్టింగులు ఇప్పించారు కాబట్టి, వారంతా ఎవరి ‘కర్తవ్యం’ వారు నిర్వహిస్తారు. ఇక కొత్తగా ఇప్పుడు అధికారులపై ఒత్తిడి చేసినా దానివల్ల ఫలితం శూన్యం.
ఇలాంటి వాస్తవ పరిస్థితిలో ప్రభుత్వంలో ఉండే బదులు, పార్టీ నేతగానే ప్రజలముందు వస్తే మంచిదన్న అభిప్రాయంతో సజ్జల ఉన్నట్లు చెబుతున్నారు. పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో అభ్యర్ధులతో సమన్వయం, ప్రచార కార్యక్రమాలు, మీడియాతో సమన్వయం వంటి పనులు చూడటం వల్ల.. పార్టీకి ఎక్కువ మేలు జరుగతుందని ఆయన భావిస్తున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. దీన్నిబట్టి నేడో, రేపో సజ్జల తన పదవికి రాజీనామా చేసే అవకాశం ఉందంటున్నారు.