Home » జగన్.. జారిపోతున్నారా?

జగన్.. జారిపోతున్నారా?

– ఎన్నికల ముందు గాంభీర్యం
– పోలింగ్‌కు ముందు గాభరా
– నాడు వెంట్రుక కూడా పీకలేరన్నధీమా
– నేడు మిమ్మల్నే నమ్ముకున్నానని వేడికోలు
– నాపై కుట్రలంటూ గగ్గోలు
– జగన్ వైఖరిపై అభ్యర్ధుల ఆందోళన
– ఇక డబ్బు ఖర్చు పెట్టడం దండగ అన్న నిర్ణయం
– పోలింగుకు ముందు పంపిణీ ఆపేస్తున్న అభ్యర్ధులు
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఎంతమంది వచ్చినా నా వెంట్రుక కూడా పీకలేరు..
చంద్రబాబు ఈజ్ నథింగ్..
వైనాట్ 175?..
వైనాట్ కుప్పం?
నన్నే నమ్మండి…
ఐ హ్యావ్ నో రిగ్రెట్స్..
ఆనందంగా దిగిపోతా..
జగన్‌ను లేకుండా కుట్రలు చేస్తున్నారు..
ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న ఆశలు సన్నగిల్లుతున్నాయి…
మీ చల్లని దీవెనులు నాకు అందించాలి..
అక్కా మన గుర్తు ఫ్యాను.. అన్నా మన గుర్తు ఫ్యాను.. అవ్వా మన గుర్తు ఫ్యాను..
– ఇవన్నీ నా అక్కా చెల్లెమ్మల కోసం 2.70 లక్షల కోట్ల రూపాయలు బటన్ నొక్కి ఇచ్చానని.. 98 శాతం సంతృప్తికర విజయాలు సాధించానని.. చిక్కటి చిరునవ్వుతో అక్కాచెలెళ్లు, అవ్వాతాతలకు మేళ్లు చేశానని సగర్వంగా చెప్పుకునే, వైసీపీ అధినేత-ఏపీ సీఎం జగన్ వ్యాఖ్యలేనంటే నమ్ముతారా? నమ్మలేరు కదా? కానీ ఆయన ఎన్నికల ప్రసంగాలు విన్న తర్వాత నమ్మి తీరాలి.

అభిమానుల దృష్టిలో జగన్ ఒక పులి. ఇంకో సింహం. మరో పులివెందుల టైగర్. మాట తప్పటం-మడమ తిప్పడం తెలియని నేత. ఎవరికీ భయపడని మొండివాడు. ఏదైనా ధైర్యంగా ఎదుర్కొనే ధీరుడు. ఎంత కష్టమొచ్చినా చలించరు. పులికి ఆకలేస్తే గడ్డి తింటుందా? ఆకలి అయినా తట్టుకుని జంతువునే వేటాడి తింటుందన్నది ఆయన అభిమానుల వర్ణన. అది నిజమే కావచ్చు. కానీ అదంతా ఒక మూడు నెలల నాటి ముచ్చట.

ఇప్పుడు కథ మారింది. కథ వ్యధ అయింది. అది వేదన.. దానిని దాటి వేదనగా మారింది. టీడీపీ-జనసేన, అంటే చంద్రబాబు-పవన్ కల్యాణ్ తనకు వెంట్రుకతో సమానమని తల వెంట్రుకలు

చూపించిన ఆ ధీశాలి, ఇప్పుడు జనం మధ్యలో నిలబడి.. ‘అంతా కలసి నన్ను ఓడించే కుట్ర చేస్తున్నారని’ బేలగా అరుస్తుండటం విచిత్రమే కదా? టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు దశాబ్దాల నుంచి గెలుస్తూ వస్తున్న కుప్పం సెంటర్‌లో నిలబడి, వైనాట్ కుప్పం? వైనాట్175? అని తొడగొట్టి సవాల్ చేసిన పులివెందుల పులి.. ఇంకొన్నిరోజుల్లో పోలింగ్ ఉందనగా, ‘‘జగన్‌ను లేకుండా కుట్రలు చేస్తున్నారు. మీరే నన్ను కాపాడాల’’ంటూ, ఆర్తిగా అర్ధిస్తారని ఎవరైనా ఊహించారా? లేదు.

కానీ వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు జనాలను దాదాపు బ్రతిమిలాడుతున్నారు. మీకోసం అన్నిసార్లు బటన్లు నొక్కా కాబట్టి, నాకోసం మీరు రెండు బటన్లు నొక్కమని దీనంగా ప్రార్ధిస్తున్నారు. అసలు తనకు టీడీపీ-జనసేన వెంట్రుకతో సమానమని ధీమాతోచెప్పిన ఆ ధీరుడు, ఇప్పుడు తనను గెలిపించే బాధ్యత మీదేనని చెప్పడమే వింత!

‘ఎన్నికలు సక్రమంగా జరుగుతాయన్న నమ్మకం లేదు. ఇక మీరే దిక్కని’ బొంగురు స్వరంతో, వణుకుతున్న గొంతుతో వేదనాభరిత

ప్రసంగం చేస్తున్న ఈ జగనేనా.. వైనాట్ కుప్పం? వైనాట్ 175? నా వెంట్రుకలు కూడా పీకలేరని చెప్పిందని, ఆశ్చర్యపడక తప్పదు. ఆ మధ్యలో ఒక జాతీయ చానెల్‌తో మాట్లాడుతూ, ‘నాకేమీ రిగ్రెట్స్ లేవు. ఆనందంగా దిగిపోతా’’నని కాడికిందపడేసిన ఆ జగనే.. అంతకుముందు ‘నన్ను మాత్రమే నమ్మండ’ని చెప్పారంటే ఆశ్చర్యపోక తప్పదు మరి.

కొద్దినెలల వ్యవధిలోనే ఇన్ని రసాలు పోసిన పోషించిన వైసీపీ అధినేత జగన్, ఇప్పుడు ఎన్నికలు సక్రమంగా జరగవంటూ పూర్తిగా కాడి కిందపడేయం చూస్తే.. జగన్ జారిపోతున్నారా? జనసేనాధిపతి పవన్ కల్యాణ్ చెప్పినట్లు ‘జగన్‌కు తన ఓటమి ఖాయమని తెలిసిపోయింది’ అన్న అనుమానం రావడం సహజం.

ఫలితాలపై తమ పార్టీ అధినేత జగన్‌లో రోజురోజుకూ మారుతున్న వైఖరి, ఆందోళనతో చేస్తున్న వ్యాఖ్యలు వైసీపీ అభ్యర్ధులపై పెను ప్రభావం చూపిస్తున్నాయి. స్వయంగా తమ అధినేతనే పార్టీ ఓడిపోతుందేమోనన్న సంకేతాలివ్వడమే దానికి కారణం. దానితో కీలకమైన ఈ మూడు రోజుల్లో, ఇక డబ్బు ఖర్చు పెట్టడకూడదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఎలాగూ పార్టీ అధికారంలోకి రాదని స్వయంగా అధినేతనే ఆందోళన పడుతున్నప్పుడు, ఇక చేతి చమురు వదిలించుకోవడం ఎందుకన్న భావన వైసీపీ అభ్యర్ధుల్లో స్థిరపడింది.

అంటే ఓట్లకు డబ్బు పంచడం మాని, పోలింగురోజు వరకూ ఖర్చులు చూసుకుంటే సరిపోతుందన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. పోలింగ్‌బూత్ ఏజెంట్ల ఖర్చులు, ఆరోజు భోజనాల ఖర్చులు, ఓటర్లను తీసుకువచ్చేందుకు ఆటో, రిక్షా ఖర్చులు మాత్రమే పెడితే సరిపోతుందన్న భావన వైసీపీ అభ్యర్ధుల్లో వ్యక్తమవుతోంది.

దానితో పార్టీ అభ్యర్ధులు డబ్బులు ఖర్చు పెట్టడం లేదంటూ.. గుంటూరు-కృష్ణా-ప్రకాశం-నెల్లూరు జిల్లాల నియోజకవర్గనేతలు పార్టీ నాయక త్వానికి, పార్టీ ఇన్చార్జిలకు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎంపీ అభ్యర్ధులు ఇచ్చిన డబ్బులు మాత్రమే ఖర్చు పెడుతున్నారన్నది వారి ఫిర్యాదు. అయితే రాయలసీమలో మాత్రం వైసీపీ అభ్యర్ధులు గెలుపు ధీమాతోనే ఖర్చు పెడుతున్నారట.

విజయనగరం జిల్లా మినహా..ఉభయ గోదావరి, ఉత్తరాంధ్రలోని విశాఖ, శ్రీకాకుళం జిల్లా అభ్యర్ధులు కూడా పార్టీ ఇచ్చిన డబ్బు ఖర్చు పెట్టడం లేదన్న ఫిర్యాదులొస్తున్నట్లు సమాచారం. ఉత్తరాంధ్రలో ఉన్నత హోదాలో పనిచేస్తున్న ఒక అభ్యర్ధి సతీమణి అయితే.. ఓడిపోయే దానికి డబ్బులు ఖర్చు పెట్టడం ఎందుకని, ఖర్చు పెట్టడం మానేశారన్న ఫిర్యాదులొస్తున్నాయట.

ఎన్నికల్లో ఎవరికైనా, ఏ పార్టీకయినా చివరి మూడురోజులే కీలకం. పంపిణీలో సింహభాగం జరిగేది కూడా ఆ మూడురోజులే. సహజంగా కీలక నేతల కొనుగోళ్లు, ఓటర్ల కొనుగోళ్లు, తాయిలాలు వంటివన్నీ ఈ మూడురోజుల్లోనే జరుగుతుంటాయి. అలాంటిది ఈ కీలకమైన సమయంలో అభ్యర్ధులు చేతులెత్తేస్తే తమ పార్టీ విజయం సంగతి ఏమిటని, అభ్యర్ధులపై ఆధారపడే నియోజకవర్గ నేతలు ఆందోళన చెందుతున్నారు.

Leave a Reply