Suryaa.co.in

Editorial

పంతుళ్లు సరే…మంత్రులు, ఎమ్మెల్యేల హాజరు సంగతేమిటి?

– ఎస్పీలు, కలెక్టర, కమిషనర్లకు హాజరు ఉండదా?
– వారికి గవర్నమెంటు యాప్‌ డౌన్‌లోడ్‌ చేయించరా?
– అన్ని శాఖలకూ 9 గంటల నిబంధన పెట్టరా?
– పంతుళ్ల కొత్త పంచాయితీ
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో పంతుళ్లు ఠంచనుగా 9 గంటలకే హాజరుకాకపోతే గైర్హాజరు వేస్తామంటున్న జగనన్న సర్కారు.. మరి మిగతా శాఖలకూ ఆ రూలు ఎందుకు వర్తింపచేయడం లేదు? తమ మాదిరిగానే కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్ల నుంచి ఆర్డీఓ-ఎమ్మార్వో వరకూ యాప్‌ ఎందుకు డౌన్‌లోడ్‌ చేయించడం లేదన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా లక్షల రూపాయల జీతాలు తీసుకుంటున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల హాజరు సంగతేమిటన్న పంతుళ్ల వాదన ఆసక్తి కలిగిస్తోంది.

సమయానికి హాజరుకాకుండా, అసలు స్కూళ్లకే నెలల తరబడి డుమ్మా కొట్టి.. తమ బదులు వేరే వారితో చదువులు చెప్పిస్తున్నారంటూ, తమపై నిందలు వేయడాన్ని పంతుళ్లు సహించలేకపోతున్నారు. నిజంగాTEACHERS-app అలాంటి వాళ్లు మీ దృష్టిలో ఉంటే, ఇప్పటిదాకా వారిపై చర్యలు తీసుకోకుండా గాడిదలు కాస్తున్నారా? అంటూ పంతుళ్లు పళ్లు నూరుతున్నారు. తమ మెడపై హాజరు కత్తి వేళ్లాడదీస్తున్న ప్రభుత్వం.. మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల హాజరును ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదన్న కొత్త లాజిక్కును సంధిస్తున్నారు.

నిజమే. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు ఏడాదికి 100 రోజులు కూడా అసెంబ్లీ, కౌన్సిల్‌ సమావేశాలు ఉండవు. కానీ దాదాపు ఒక్కో ప్రతినిధి రెండు లక్షలు జీతంగా తీసుకుంటున్నారు. పోనీ, సమావేశాలు జరిగే సమయంలో ఏమైనా ఉదయమే వెళతారా అంటే అదీ ఉండదు. వారిష్టం వచ్చినప్పుడు వెళతారు. లేకపోతే లేదు. ఇంకా సమావేశాలకు హాజరయినప్పుడు టీఏ, డీఏలు కూడా తీసుకుంటున్నారు. వారు సమావేశాల సమయంలో ఆలస్యంగా హాజరయితే, ఒకరోజు జీతం కోత అన్న నిబంధనలేమీ లేవు. కాబట్టి.. ముందు మంత్రులు, ఎమ్మెల్యే-ఎమ్మెల్సీలకూ హాజరు నిబంధన పెట్టాలన్నది పంతుళ్ల కొత్త వాదన. ఆలోచిస్తే ఇదేదో బాగానే ఉన్నట్లు కనిపిస్తోంది.

పంతుళ్ల వాదనను కాసేపు పక్కనపెడితే.. నిజానికి కలెక్టర్లు, ఎస్పీలు, డీఎస్పీ, సీఐ, ఆర్డీఓ, ఎమ్మార్వో, కార్పొరేషన్‌ చైర్మన్లు, మునిసిపల్‌ కమిషనర్లు, ఐఏఎస్‌, ఐపిఎస్‌లకు ఫలానా సమయానికి హాజరుకావాలన్న నిబంధనలేమీ లేవు. వారి దయ, జనం ప్రాప్తం. వీరంతా లక్షల్లో జీతాలు తీసుకునే ప్రముఖులే. అంటే టీచర్ల కంటే ఎక్కువ జీతగాళ్లు. లెక్క ప్రకారం మంత్రులు రోజూ సచివాలయానికి రావాలి. కానీ గత మూడేళ్ల కాలంలో సచివాలయానికి ఠంచనుగా వచ్చిన మంత్రులు భూతద్దం వేసినా కనిపించరు. వారివద్ద పనిచేసే పీఏ, పీఎస్‌, ఓఎస్‌డీలు కూడా ఉదయం 9 గంటలకే సచివాలయానికి హాజరు కారు. వాళ్ల బాసులు ఎక్కడ ఉంటే వాళ్లూ అక్కడే ఉంటారు. దానికి లెక్కాపత్రం ఏమీ ఉండదు. అవన్నీ టీచర్లు, డాక్టర్లు, నర్సులూ, సచివాలయంలో పనిచేసే ఉద్యోగులు.. కింద స్ధాయి ప్రభుత్వ ఉద్యోగులకే పరిమితం.

పోలీసు శాఖలో కూడా డీజీపీ నుంచి ఎస్‌ఐ వరకూ ఉదయం 9 గంటలకే వచ్చి హాజరు ఇవ్వాలన్న నిబంధన ఏదీ లేదు. ఇప్పుడు ఎలాగూ టీచర్లకు ఆ నిబంధన తెచ్చారు కాబట్టి.. పనిలో పనిగా ఆ యాప్‌ను పోలీసు శాఖ కూడా డౌన్‌లోడ్‌ చేసుకుంటే, అందరికీ సమ న్యాయం చేసినట్టవుతుంది. అలాగే రెవిన్యూలోSIMsకలెక్టర్‌ నుంచి ఎమ్మార్వో వరకూ ఉదయం 9 గంటలకే రావాలన్న నిబంధన విధిస్తే, అందరికీ క్రమశిక్షణ అలవాటవుతుంది. కొత్తగా తెచ్చిన యాప్‌ను రెవిన్యూ అధికారులు కూడా డౌన్‌లోడ్‌ చేసుకోమని ఆదేశిస్తే మంచిది. మరి క్రమశిక్షణ ఒక్క పంతుళ్లకే ఎందుకు? జీతాలు తీసుకుంటున్న పెద్ద సార్లకూ అలవాటు చేయాలి కదా అన్నది బుద్ధిజీవుల వాదన.

ఇటీవల బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు ఇలాంటి లాజిక్కును, ఏకంగా సీఎం జగనన్నపైనే సంధించి సంచలనం సృష్టించారు. ‘‘ముఖ్యమంత్రి జగన్‌ అసలు సచివాలయానికి వెళ్లరు. ఆయన వర్క్‌ ఫ్రం హోం చేస్తున్నారు. మరి సీఎం హాజరు సంగతేమిట’’న్నది జీవీఎల్‌ సంధించిన లాజిక్కు. నిజమే కదా? ‘న్యాయం ముందు తన ఇంటి నుంచి మొదలుపెట్టాల’ని పెదరాయుడు సినిమాలో మోహన్‌బాబు చెప్పినట్లు.. టీచర్లకు సుద్దులు చెప్పిన సీఎం కూడా, అదే సూత్రాన్ని పాటించాలి కదా అన్నది పంతుళ్ల వాదన. కరక్టే. కానీ ఆ విషయాన్ని జగనన్న ముందు చెప్పే దమ్మెవరికి ఉంది నాయకా?

LEAVE A RESPONSE