రేవంత్‌కు టచ్‌లో 16 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు?

– వీరిలో గ్రేటర్‌, హైదరాబాద్‌ జిల్లాల వారే ఎక్కువ
– వ్యాపారాలున్న వారే జంప్‌జిలానీలు
– మళ్లీ ‘నియోజకవర్గఅభివృద్ధి’ నినాదమే
– సీఎంగా దానిని సమర్థించిన కేసీఆర్‌
– తప్పేమిటని మీడియాను ఎదురు ప్రశ్నించిన వైనం
– ప్రమాణస్వీకారం తర్వాత చేరికలు ఖరారు
– వాటిని ఖండిస్తూ కేసీఆర్‌ను కలసిన గ్రేటర్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
– కేసీఆర్‌తోనే కలసి నడుస్తామని స్పష్టీకరణ
( మార్తి సుబ్రహ్మణ్యం)

అప్పుడు-ఇప్పుడూ ఒకే నినాదం. అది నియోజకవర్గ అభివృద్ధి! దాని కోసమే పార్టీ మారాం!! ఇలాంటి మాటలు టీడీపీ-కాంగ్రెస్‌ నుంచి గెలిచి, టీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేల నుంచి పదేళ్ల నుంచీ క్రితం వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు సంవత్సరం మారింది. దానితోపాటు అధికారంలో ఉన్న పార్టీ మారింది. బట్‌.. నినాదం మాత్రం సేమ్‌ టు సేమ్‌! ‘మా నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారుతున్నాం’ అనే సాకుతో, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కా్రంగ్రెస్‌లోకి జంపయ్యేందుకు సిద్ధమవుతున్నారు.

చ రిత్ర పునరావృతమవుతోంది. ఒకప్పటి నినాదాల సాకులే మళ్లీ వినిపించబోతున్నాయి. పదేళ్లు పాలించి తాజా ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలలో, చాలామంది కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు. తొలిదశలో భాగంగా దాదాపు 16 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ఆ మేరకు వారంతా కొందరు నేతల ద్వారా రేవంత్‌రెడ్డి టచ్‌లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. అయితే వీరిలో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాలకు చెందిన వారే ఎక్కువగా ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం తర్వాత కాంగ్రెస్‌ నాయకత్వం చేరికలపై దృష్టి సారించనున్నట్లు చెబుతున్నారు. భవిష్యత్తు అవసరాలు, రానున్న లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఈ చేరికలు జరగనున్నట్లు కనిపిస్తోంది.

నిజానికి కాంగ్రెస్‌కు మ్యాజిక్‌ ఫిగర్‌ 60కి నుంచి అదనంగా, ఇంకా 4 స్ధానాలు అంటే 64 స్థానాలు సాధించింది. టీఆర్‌ఎస్‌ 39, బీజేపీ 8, మజ్లిస్‌ 7 సీట్లతో సరిపెట్టుకుంది. కాంగ్రెస్‌ 39.4 శాతం, బీఆర్‌ఎస్‌ 37.3, బీజేపీ 13 శాతం ఓట్లు సాధించాయి. కాంగ్రెస్‌కు 92,33,923 ఓట్లు పోలవగా, బీఆర్‌ఎస్‌కు 87,51,657 ఓట్లు వచ్చాయి. ఇక బీజేపీకి 32,35,583 ఓట్లు, మజ్లిస్‌కు 5,15,809 ఓట్లు పోలయ్యాయి. బీఎస్పీకి 3,20,554 ఓట్లు, సీపీఐకి 80,336 ఓట్లు, సీపీఎంకు 51,828 ఓట్లు పోలయినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. బీఆర్‌ఎస్‌ కంటే కాంగ్రెస్‌కు 2.05 శాతం మాత్రమే ఎక్కువ రావడం! సీట్లు-ఓట్లలో ఇద్దరి మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉండటాన్ని విస్మరించకూడదు. అంటే హోదా హోరీ యుద్ధమే జరిగినట్లు స్పష్టమవుతుంది.

కాంగ్రెస్‌ పోల్‌మేనేజ్‌మెంట్‌లో బలహీనంగా ఉన్నప్పటికీ, ప్రజాభిమానం ఆ అంశాన్ని పక్కనపెట్టిందన్నది నిర్వివాదం. ఈ కోణంలో చూస్తే బీఆర్‌ఎస్‌ సీట్ల కోణంలో తప్ప, ఇతర అంశాల్లో పెద్దగా బలహీనపడలేదని స్పష్టమవుతోంది. పైగా మజ్లిస్‌ ఇంకా బీఆర్‌ఎస్‌తోనే ఉంది.

కాగా మార్చిలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో, రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడంపై కాంగ్రెస్‌ దృష్టి సారించింది. అందులో భాగంగా బీఆర్‌ఎస్‌ నుంచి చేరికలపై కన్నేయడం అనివార్యంగా మారింది. గతంలో కేసీఆర్‌ కూడా అదే పాలిసీని అమలుచేసి, పార్టీని విస్తృతపరిచారు. ఫలితంగా ఓటుబ్యాంకును స్థిరం చేసుకోగలిగారు. ఇప్పటికీ పోల్‌మేనేజ్‌మెంట్‌లో బీఆర్‌ఎస్‌ బలంగా ఉన్న విషయాన్ని విస్మరించకూడదు.

అదీకాక కాంగ్రెస్‌కు అదనంగా మరికొన్ని సీట్లు ఉన్నప్పటికీ, కాంగ్రెస్‌ రాజకీయాలు- ముఠా తగాదాలు-వర్గ విబేధాలు ఎప్పుడు ఏ మలుపు తిరుగుతాయో తెలియనందున.. ముందుజాగ్రత్తగా బీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యేలను ఆకర్షించడంపె,ై దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. దానికి తగినట్లే దాదాపు 16 మంది ఎమ్మెల్యేలు రేవంత్‌ టచ్‌లోకి వెళ్లడం జరిగిపోయింది.

అయితే కాంగ్రెస్‌తో టచ్‌లోకి వెళ్లిన వారిలో వ్యాపారాలు, కాలేజీలు, భూముల వివాదం, కేసులు, ప్రభుత్వ కాంట్రాక్టులతో ముడిపడిన సంబంధాలున్న వారే ఎక్కువగా ఉన్నట్లు, పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రంగారెడ్డి జిల్లాకు చెందిన వారిపై భూముల ఆరోపణలు ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈ తరహాకు చెందిన 16 మంది బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ వైపు చూస్తున్నారు.

పైగా పదేళ్లపాటు అధికారంలో ఉండి, హటాత్తుగా విపక్షంలోకి మారడం ఎవరికైనా ఇబ్బందికర పరిణామమే. అధికారంలో ఉంటే పోలీసు, ఎమ్మార్వో, మున్సిపల్‌శాఖల్లో తమకు ఇష్టమైన వారిని బదిలీ చేయించుకోవచ్చు. అధికారులు కూడా చెప్పినట్లు వింటారు. అదే విపక్షంలోకి వస్తే, ఎస్‌ఐ స్థాయిలోనే ఎవరూ మాట వినని అవమానకర పరిస్థితి. తమ సిఫార్సులను బుట్టదాఖలు చేసే దుస్థితి.

ఈ అవమానకర పరిస్థితులు అధిగమించేందుకే, విపక్ష ఎమ్మెల్యేలు అధికార పార్టీలో చేరడానికి ప్రధాన కారణాలన్నది బహిరంగ రసహ్యం.ప్రధానంగా తమపై ఓడిన వారికి పెత్తనం ఇచ్చి, వారి సిఫార్సులు అధికారులు అమలుచేస్తుంటే సహించలేని ఆగ్రహం. అప్పుడు కాంగ్రెస్‌-టీడీపీ ఎమ్మెల్యేలు చేసింది అదే. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చేయబోయేదీ అదే!

నిజానికి బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి జంపయ్యే తమ పార్టీ ఎమ్మెల్యేలను, ఆ పార్టీ అధినేత కేసీఆర్‌ ఏమీ విమర్శించలేని ఇరకాట పరిస్థితి. వరసగా పదేళ్ల నుంచి టీడీపీ-కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు-ఎమ్మెల్సీలు తమ పార్టీలోకి చేరినప్పుడు, కేసీఆర్‌ ఒక ఆసక్తికర వ్యాఖ్య చేశారు. ‘‘వాళ్లంతా నియోజకవర్గ అభివృద్ధి కోసం, తెలంగాణ మరింత బలపడాలన్న కోరికతో టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. అందులో తప్పేముంది? మీరు కూడా మారాలి. కొత్తగా ఆలోచించాల’’ని మీడియాకు క్లాసు పీకారు.

ఆ తర్వాత ‘‘కష్టపడి సాధించుకున్న తెలంగాణ నక్కలపాలు కాకుండా ఉండాలంటే బలమైన ప్రభుత్వం అవసరం. అందుకే ఇతర పార్టీల వారు వారంతట వారు వస్తే తీసుకున్నాం. అందులో తప్పేంటి నాకర్థం కాదు’’ అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరితే.. ఒక రేవంత్‌రెడ్డి, ఒక భట్టి గతంలో కేసీఆర్‌ మాటలనే గుర్తు చేసి, ఇరకాటంలో పడేయడం సహజం. అటు కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమవుతున్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కూడా ‘నియోజకవర్గ అభివృద్ధి కోసమే తాము పార్టీ మారుతున్నామ‘ని ప్రవచించేందుకు సిద్ధమవుతుండటం విశేషం. గతంలో టీఆర్‌ఎస్‌లో చేరిన కాంగ్రెస్‌-టీటీడీ ఎమ్మెల్యేలు కూడా , ఇలాగే నియోజకవర్గ అభివృద్ధి కోసమే పార్టీ మారామని చెప్పడం గమనార్హం.

కాగా గ్రేటర్‌-రంగారెడ్డి జిల్లాలకు చెందిన కొందరు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న వార్తలు, సహజంగా బీఆర్‌ ఎస్‌ను వణికిస్తున్నాయి. అసలే 36 స్థానాలతో సరిపెట్టుకున్న పరిస్థితిలో, అందులో 16 మంది వెళ్లిపోతే సభలో పార్టీ పరిస్థితి ఏమిటన్నది వారి ఆందోళనకు కారణం. గతంలో తాము ఏవిధంగానయితే, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే- ఎమ్మెల్సీను చేర్చుకుని ఆ పార్టీని దెబ్బతీశామో.. ఇప్పుడు కాంగ్రెస్‌ కూడా అదే పార్ములాను అమలుచేస్తే, సభలో ప్రతిపక్ష హోదా ఉండదన్న భయాందోళన వెన్నాడుతోంది.

అయితే తాము పార్టీ మారుతున్నామంటూ సోషల్‌మీడియాలో వస్తున్న వార్తలపై, హైదరాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు స్పందించారు. వారంతా కలసి గజ్వేలులోని కేసీఆర్‌ ఫాంహౌస్‌కు వెళి,్ల ఆయనతో భేటీ అయ్యారు. తమపై జరుగుతున్న ప్రచారం అబద్ధమని, మీతోనే కలసి నడుస్తామని వారంతా భరోసా ఇచ్చారు. మాజీ మంత్రి తలసాని, మాగంటి గోపీ, మాధవరం కృష్ణారావు, గాంధీ, కాలేరు వెంకటేష్‌, ముఠా గోపాల్‌ తదితరులు కేసీఆర్‌ను కలిశారు.

Leave a Reply