Suryaa.co.in

Editorial

జగన్‌కు ఫోన్ లేదట..హ్హి హ్హి హ్హి!

– ముందు ఫోన్ లేదన్న జగన్
– తర్వాత నా నెంబర్ నాకే తెలీదన్న జగనన్న
– సోషల్‌మీడియాలో భలే ట్రోలింగ్ బాసూ
– జగన్.. భలే భలే
( మార్తి సుబ్రహ్మణ్యం)

‘‘జగన్ భలే.. భలే. జగనన్నకు ఫోన్ కూడా లేదంట.. ఉన్నా ఆయన నెంబరు ఆయనకే తెలియదంట’’ ఇదీ.. ఇప్పుడు సోషల్‌మీడియాలో ట్రోలింగ్ అవుతూ, టపాకాయల్లా పేలుతున్న సెటైర్లు. ఎన్నికల సందర్భంగా టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ ర జనీకాంత్ సీఎం జగన్‌ను ఇంటర్వ్యూ చేశారు. దానిని కొన్ని లక్షల మంది వీక్షించారని, అదే చంద్రబాబునాయుడుతో ఏబీఎన్ చీఫ్ రాధాకృష్ణ చేసిన ఇంటర్వ్యూని, ఎవరూ చూడలేదని వైసీపీ సోషల్‌మీడియా సైనికులు ప్రచారం చేశారనుకోండి. అది వేరే విషయం.

సరే.. జగనన్నను ఇంటర్వ్యూ చేసిన రజనీకాంత్… చెల్లెళ్లు రోజూ జగనన్నకు సంధిస్తున్న నవ ప్రశ్నలు, వివేకా హత్య ఎపిసోడ్‌లో ముందు గుండెపోటు, తర్వాత గొడ్డలి పోటు అని సొంత చానెల్‌లో ప్రసారం చేయడానికి కారణాలు, చెల్లి షర్మిల అఫిడవిట్‌లో చెప్పినట్లు ఆమెకు 86 కోట్ల అప్పు ఇచ్చింది నిజమేనా? గతంలో మాదిరిగా తల్లి విజయమ్మ తన పార్టీకి ప్రచారం చేయకుండా అమెరికాకు వెళ్లిన కారణాలు, చెల్లి కొడుకు పెళ్లికి వెళ్లని కారణాలు, తిరుమల సహా దేవాలయాలకు సతీసమేతంగా వెళ్లకపోవడానికి కారణాలు, మోదీ నేరుగా జగన్‌పై చేస్తున్న ఆరోపణలకు సమాధానం ఆయన ఇవ్వకుండా, మంత్రులతో తిట్టించడానికి కారణాలు ప్రశ్నిస్తారని వీక్షకులు ఆశించారు.

పనిలో పనిగా సీబీఐ కోర్టుకు జగనన్న హాజరుకాకపోవడానికి కారణాలు, మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్లు పెట్టకపోవడానికి కారణాలు, ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన జే మద్యం బ్రాండ్లు, కేవలం ఏపీలోనే దొరకడానికి కారణాలు.. ఆరు నెలల క్రితం బటన్ నొక్కితే ఇప్పటిదాకా డబ్బులు వేయకపోవడానికి కారణాలు.. దేశంలోనే ఏపీలో రోడ్లు బ్రహ్మాండంగా ఉండటానికి కారణాలు, ఉద్యోగులకు ఇచ్చిన సీపీఎస్ రద్దు హామీ అమలు.. మోదీ-అమిత్‌షాని విమర్శించకుండా, రాష్ట్ర బీజేపీ నేతలపై విమర్శలకు పరిమతం కావడానికి కారణాలు.. ఇలా గత ఐదేళ్ల నుంచి జనం మనసులోని సందేహాలను రజనీకాంత్, సీఎం జగనన్నను ప్రశ్నిస్తారనుకున్నారు. కానీ సీఎం జగనన్నను.. రజనీకాంత్ అంత ఇబ్బందిపెట్టదలచుకోలేక, మొహమాటంతో వదిలేసినట్లుంది. మనం కూడా దాన్నలా వదిలేద్దాం.

దాన్నలా పక్కనపెడితే.. రజనీకాంత్ అడిగిన ఒక ప్రశ్న మాత్రం సోషల్‌మీడియాలో కథాకళి, భరతనాట్యం, కూచిపూడి, మోహినీ యాట్టం, లావణి, ఒడిస్సీలా నృత్యం చేస్తోంది. అది జగన్ ఫోన్ యవ్వారం. ‘‘ మీకు ఫోన్ ఉందా? మీరెప్పుడూ ఫోన్ వాడుతున్నట్లు చూడలేద’న్న రజనీకాంత్ ప్రశ్నకు.. జగనన్న ఇచ్చిన సమాధానం సోషల్‌మీడియాలో సెటైర్లు, సీమటపాకాయ్‌లా పేలిపోతున్నాయి.
మీరు ఫోను వాడతారా? లేదా?
– నా దగ్గర ఫోను లేదు.
ఫోన్ లేదు. నెంబరు కూడా లేదా?
– నా నెంబరు నాకే తెలియదు
ఇదీ జగనన్న రజనీకాంత్‌కు ఇచ్చిన జవాబు.
అసలు ఫోన్ లేని వారికి నెంబర్ ఎలా ఉంటుంది? జగనన్న కోసం కాసేపు ఉండదనుకోంది. మరి ఫోన్ లేకపోతే, తన నెంబరు తనకే తెలియదనడం ఏమిటి? అంటే ఫోను ఉన్నట్లే కదా అన్నది బుద్ధిజీవుల ప్రశ్న.

ఇక దానిపై సోషల్‌మీడియాలో ఒకటే సెటైర్ల వర్షం. ఫోను నాదే. కానీ నెంబరు నాది కాదు.. నెంబరు తెలియదు గానీ ఆ ఫోను నాదే.. అసలు ఫోను లేనోడికి నెంబరు ఎలా గుర్తుంటుంది.. ఉన్నా మర్చిపోయింటాడులేప్పా.. అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. ఏది ఏమైనా ఎన్నికల సమయంలో, జగనన్నకు మేలు చేయబోయిన సదర చానెల్.. పాపం ఆయనను సోషల్‌మీడియాలో బోనులో పంపించినట్లయిందన్నది సీనియర్ జర్నలిస్టుల ఉవాచ.

కాసేపు దాన్ని కూడా పక్కనపెడితే… సహజంగా ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులు తమ చిరునామాతోపాటు, ఫోన్ నెంబరు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే కమ్యూనికేషన్ కోసం. ఆ ప్రకారంగా జగనన్న ఇటీవల సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో తన కాంటాక్టు నెంబర్ 9849904123గా పేర్కొన్నారు. మరి ఇప్పుడు జగనన్న టీవీ9 ఇంటర్వ్యూలో చెప్పినట్లు, అఫిడవిట్‌లో ఫోన్ నెంబరు ఇచ్చారా? లేదా? అన్న కొత్త సందేహం తెరపైకొచ్చింది. దానిని ఆయన వాడినా-వాడకపోయినా, నెంబరు మాత్రం స్పష్టంగా పేర్కొన్న విషయాన్ని బహుశా జగన్.. తన ఫోను నెంబరు మాదిరిగానే మర్చిపోయినట్లున్నారన్నది బుద్ధిజీవుల వ్యాఖ్య.

సరే.. తనకు ఫోన్ లేదని జగన్ చెప్పడం నేరం-ఘోరమేమీకాదు. దివంగత సీఎం రోశయ్య లాంటి వారికి ఫోన్లు ఉన్నా, వాటిని వాడటం ఎలాగో తెలియదు. అలాంటి వాళ్లు చాలామంది ఉండవచ్చు. అందులో తప్పేమీ కాదు. అది ఆక్షేపణీయమూ కాదు. ఇప్పుడు జగన్‌కు ఉన్న ఫోను ఆయన నేరుగా

వాడకపోవచ్చు. దానిని ఆయన ఓఎస్డీ వాడవచ్చు. అది కూడా తప్పేమీ కాదు. కానీ అఫిడవిట్‌లో తానే స్వయంగా ఇచ్చిన, తన ఫోన్ నెంబరు తనకు తెలియదనడమే వింత. నిజానికి ఎవరైనా ‘గూగూల్ మాత’ను అడిగితే, ఎన్నికల అఫిడవిట్ కథ మొత్తం చెబుతుంది. ఆ ప్రకారం జగనన్నకు ఫోన్ ఉందా? లేదా? అని తెలుసుకోవడం నిమిషం పని. అదే వేరే విషయం!

ఏది ఏమైనా వైసీపీ సోషల్‌మీడియా సైనికులు ప్రచారం చేస్తున్నట్లు.. టీవీలో సీనియర్ జర్నలిస్టు రజనీకాంత్ సీఎం జగన్‌తో చేసిన ఇంటర్వ్యూను, లక్షలమంది చూసినప్పటికీ.. అందులో ఫోన్‌కు సంబంధించిన ప్రశ్నను మాత్రం, ‘అంతకుమించి’.. అంతకంటే ఎక్కువమందికి ఆయన అమాయకత్వాన్ని చేర్చి, పుణ్యం కట్టుకున్న ఘనత కూడా ఆ చానెల్ సాధించినట్లుంది.

LEAVE A RESPONSE