Suryaa.co.in

Editorial

సీఐడీ ‘స్కిల్’కి సవాల్

– స్కిల్ కేసులో కొత్త ఫిర్యాదు
– 12మంది అధికారులను విచారించాలని సీఐడీకి ఫిర్యాదు
– అజయ్ కల్లం, రావత్, రవిచంద్ర, ప్రేంచంద్రారెడ్డి, అర్జా శ్రీకాంత్, సిసోడియాలను విచారించాలని న్యాయవాది ప్రసాద్ ఫిర్యాదు
– ప్రస్తుత చైర్మన్ అజయ్‌రెడ్డి, అప్పటి సీఎండి బంగార్రాజులనూ విచారించండి
– న్యాయవాది ప్రసాద్ ఫిర్యాదుపై సంకటంలో సీఐడీ
– విచారిస్తుందా? పక్కనపెడుతుందా?
– ఇప్పటివరకూ సుమోటోగా ఫిర్యాదు చేసి అరెస్టులు చేస్తున్న సీఐడీ
– మరి వచ్చిన ఫిర్యాదులపై విచారించకపోతే విమర్శలు
– విచారిస్తే సర్కారు పెద్దల ఆగ్రహం తప్పదు
– విచారించకపోతే విపక్షాల సజ్జల సంస్థ ఆరోపణలు నిజమయ్యే ప్రమాదం
– సంకటంలో ఏపీ సీఐడీ
(మార్తి సుబ్రహ్మణ్యం)

నీతి నిజాయితీకి నిలువెత్తు నిదర్శనమైన సీఐడీ… ఒత్తిళ్లకు లొంగకుండా.. తమంతట తామే ఆలోచించి.. పరిశోధించి.. కర్తవ్యదీక్ష ను పాటించి కోర్టులతో కూడా అనేకసార్లు ‘ప్రశంసలు అందుకున్న’ ఏపీ సీఐడీకి, ఇప్పుడు మాచెడ్డ కష్టం వచ్చిపడింది.

స్కిల్ డె వలప్‌మెంట్ కేసులో మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును 50 రోజులకు పైగా జైల్లో పెట్టించిన సీఐడీకి, ఇప్పుడు ఒక ఫిర్యాదు పెద్ద సవాల్‌గా మారింది. సూటిగా చెప్పాలంటే.. సీఐడీ చిత్తశుద్ధికి ఆ లాయరు ఇచ్చిన ఫిర్యాదు ప్రాణసంకటంగా మారింది. సీఐడీ సొంతగా విచారించడం లేదని, అది సజ్జల సంస్థలా మారిందంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలు అబద్ధాలని నిరూపించుకోవాల్సిన పరీక్షా సమయం. ఏపీలో ఇప్పుడిదే హాట్ టాపిక్.

స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ముందు వేలు, తర్వాత వందల కోట్లు అవినీతి జరిగిందంటూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును అరెస్టు చేసి జైలుకు పంపిన సీఐడీ సాహసం జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయింది. ఆ మేరకు నిబంధనలు కూడా లెక్కచేయకుండా, తాము చేసిన సాహసాన్ని సీఐడీ బాసు- ఆ కేసు వకాల్తా పుచ్చుకుని వాదించిన సర్కారీ న్యాయవాది.. జమిలిగా దేశాటన చేసి, మీడియా పేరంటం పెట్టి మరీ చెప్పుకున్నారు.

సరే.. సర్కారీ ఉద్యోగులయి ఉండి, నిబంధనలకు విరుద్ధంగా కేసు వివరాలను మీడియా పేరంటంలో ఎందుకు చెప్పారంటూ, కోర్టులో విచారణ ప్రారంభమైంది. సీఐడీ బాసు మీడియాకు ఏం చెప్పారో, పత్రికల్లో వచ్చిన వార్తలను తర్జుమా చేసి తమకు ఇవ్వాలని.. మాననీయ న్యాయమూర్తి ఆదేశం జరిగిందనుకోండి. అది వేరే ముచ్చట.

కానీ ఇప్పుడు ప్రసాద్ అనే న్యాయవాది సీఐడీకి చేసిన ఫిర్యాదు, పేరు గొప్ప దర్యాప్తు సంస్థను మహాగొప్ప పితలాటకంలో పడేసింది. చంద్రబాబును అరెస్టు చేసిన అదే స్కిల్ కేసులో, సీఐడీ అధికారులు ‘పొరపాటున మర్చిపోయిన’ అధికారుల పేర్లు గుర్తు చేస్తూ.. సదరు లాయరు వారిని కూడా విచారిస్తేనే, కేసుకు సార్ధకత ఉంటుందని ఓ ఫిర్యాదు చేశారు. వారిని మాత్రమే కాదు.. అసలు స్కిల్‌కు సంబంధించిన ఆర్ధిక అంశాలపై సంతగించిన ప్రతి అధికారినీ విచారించి, పుణ్యం కట్టుకోవాలంటూ ప్రసాద్ అనే లాయరు చేసిన ఫిర్యాదు.. ఇప్పుడు సీఐడీ విశ్వసనీయత, చిత్తశుద్ధికి పెను సవాలుగా మారింది.

స్కిల్ కేసులో చంద్రబాబు పేరు పెట్టి… మిగిలిన అధికారుల పేర్లు కర్తవ్య దీక్షలో పడి, ‘పొరపాటున మర్చిపోయిన’ సీఐడీ.. ఐఏఎస్ అధికారులయిన అజయ్‌కల్లంరెడ్డి, ప్రేంచంద్రారెడ్డి, రావత్, రవిచంద్ర, ఉదయలక్ష్మి, సిసోడియా, కెవి సత్యనారాయణ, శామ్యూల్ ఆనంద్‌కుమార్, కృతికాశుక్లా, అర్జా శ్రీకాంత్, జయలక్ష్మిని కూడా విచారించాలని న్యాయవాది ప్రసాద్ సీఐడికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

వారితోపాటు స్కిల్ డె వలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ కొండూరు అజయ్‌రెడ్డి, నాటి సీఎండి బంగార్రాజుతోపాటు.. అసలు కాంట్రాక్ట్ చెక్ పవర్‌తో సంబంధం ఉన్న వివిధ స్థాయిలోని అధికారులను కూడా విచారించాలని, సీఐడీకి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. వీరందరినీ విచారించి స్కిల్ కేసు సంగతి తేల్చాలన్నది న్యాయవాది ప్రసాద్ పట్టుదలలా కనిపిస్తోంది. మంచిదే.

బాగానే ఉంది. బాబును అరెస్టు చేయాలన్న కర్తవ్యదీక్ష తొందరలో, ఈ అసలు విషయాలను మర్చిపోయిన సీఐడీకి.. ఆ కేసుతో అనుబంధం ఉన్న అధికారులందరి పేర్లు గుర్తు చేసినందుకు, సదరు న్యాయవాది అభినందనలకు అర్హుడే. పాపం నిజానికి సీఐడీ అధికారులకు, సదరు ఐఏఎస్ అధికారులపై ప్రత్యేక ప్రేమానురాగాలేమీ ఉండవు. వారిని కాపాడాలన్న పక్షపాతమూ ఉండదు. ఎవరి ఒత్తిళ్లను లెక్కచేసే రకం కాదు. ఎవరో చెబితే అడ్డగోలుగా కేసులు పెట్టే వారు కాదు. అన్నీ తమంతమట తామే ఆలోచించి.. పరిశోధించి.. అని ఆధారాలు సేకరించిన తర్వాతనే కార్యరంగంలోకి దూకే దీక్షాదక్షులు.

వారికీ నిందితులను బోనెక్కించాలన్న లక్ష్యం ఉంటుంది. ఆ లక్ష్యంతోనే నాలుగేళ్ల కాలంలో సుమోటో కేసులు కూడా పెట్టి, కర్తవ్య లక్ష్యం నెరవేర్చారు. కాకపోతే కర్తవ్యదీక్షను త్వరగా పూర్తి చేసి చేతులు దులిపేసుకోవాలన్న తొందరలో.. సదరు అధికారులను విచారించడం మర్చిపోయి’ ఉంటారు. అంతే! దానిని విమర్శించి, రంధ్రాన్వేషణ చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే విచారణ తీరులో, ఏపీ సీఐడీ పేరు దేశంలో మోతమోగుతోంది కాబట్టి.

ప్రసాద్ అనే న్యాయవాది ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. కేసుకు సంబంధం ఉన్న అధికారులను విచారిస్తే, సీఐడీ పేరు ఈసారి అంతర్జాతీయంగా మారుమోగడం ఖాయం. లెక్కలేనంతమందిపై సుమోటోగా కేసులు నమోదు చేసిన సీఐడీ.. ఇప్పుడు తనకు వచ్చిన ఫిర్యాదుపై స్పందించకపోవడం అంతగొప్ప విచారణ సంస్థకే అప్రతిష్ఠకదా?

కానీ ఇప్పటి పరిస్థితిలో సీఐడీ అంత సాహసం చేస్తుందా? అన్నదే సర్వత్రా వినిపిస్తున్న సందేహం. నిజంగా సదరు అధికారులను విచారించి, వారిపై కేసులు పెట్టి బాబు మాదిరిగా వారిని ఏ రాజమండ్రి జైలుకో, లేదా విజయవాడ జైలుకో, కాదంటే దగ్గరలో ఉన్న గుంటూరు సబ్ జైలుకో పంపిస్తే.. ఇప్పటివరకూ సీఐడీని అకారణంగా దూషించిన వారి నోళ్లు మూతపడటం ఖాయం.

అంటే.. చంద్రబాబు మాదిరిగానే… అప్పటికప్పుడు కేసు నమోదు చేయడం.. వాయువేగంతో నంద్యాలకు వెళ్లి, విజయవాడకు తీసుకువచ్చి రాజమండ్రి జైలుకు పంపించిన విధంగా… సదరు అధికారులపై కూడా అప్పటికప్పుడు కేసు నమోదు చేసి, కోర్టుకు హాజరుపరిచి, ఇదే పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అదే అద్భుత వాదనాపటిమ ప్రదర్శించి, ఐఏఎస్‌లందరినీ జైలుకు పంపించాల్సి ఉంటుంది. బాబు మాదిరిగానే ఆధారాలు నింపాదిగా సమర్పించవచ్చు.

ఇప్పుడు సీఐడీకి అదే ప్రాణసంకటం. ప్రస్తుత స్కిల్ చైర్మన్ ఇచ్చిన ఫిర్యాదు మేరుకు చంద్రబాబుపై కేసు నమోదు చేసినట్లుగానే.. స్కిల్ కేసులో సంబంధం ఉన్న వారందరినీ విచారించాలన్న, న్యాయవాది ఫిర్యాదును కూడా స్వీకరించక తప్పదు. ఆ ప్రకారంగా చంద్రబాబు మాదిరిగానే.. సదరు ఐఏఎస్ అధికారులను కూడా ముందు అరెస్టు చేసి, ఆ తర్వాత ఆధారాలు ఇస్తామని కూడా సీఐడీ తరఫున వాదిస్తున్న సర్కారీ న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి అద్భుతంగా వాదించక తప్పదు.

అప్పుడు ప్రభుత్వ న్యాయవాది పొన్నవోలు వాదనతో అంగీకరించి, చంద్రబాబును రిమాండుకు పంపినట్లుగానే.. మాననీయ న్యాయమూర్తి అదే న్యాయధర్మం ప్రకారం, ఐఏఎస్‌లను కూడా రిమాండ్‌కు పంపించక తప్పదు. మరి అదే కదా న్యాయం? స్కిల్ కేసులో చంద్రబాబుకు వర్తించే న్యాయసూత్రమే, ఆ కేసులో పాత్రధారులైన ఐఏఎస్‌లకూ అమలు చేయడమే ధర్మం కదా?

అయితే సీఐడీ బాసులు అంత సాహసం చేస్తారా? ప్రభుత్వాన్ని సంప్రదించకుండా, తనకు అందిన ఫిర్యాదు మేరకు అధికారులను విచారించి, వారిపై కేసులు నమోదు చేసేంత ధైర్యం చేస్తారా? నిందితులను అరెస్టు చేయడమే తమ బాధ్యత అని.. సగర్వంగా- సవినయంగా మీడియా పేరంటాల్లో సెలవిచ్చిన అదే సీఐడీ బాసులు.. ఆ పనిని ఐఏఎస్‌లను విచారించేంత సాహసం చేస్తారా? లేదా అన్నదే ఉత్కంఠ కలిగించే ప్రశ్నలు.

బహుశా ఏజెంట్ గోపి, గూఢచారి 116 సినిమాల్లో కూడా ఇంత ఉత్కంఠ కలిగించే దృశ్యాలు ఉండవేమో. ఒకవేళ సీఐడీ ఏ కారణంతోనయినా విచారణకు స్వీకరించకపోతే, లాయర్ ప్రసాద్‌కు కోర్టులో కేసు వేయడం తప్ప మరో మార్గం ఉండదు. అప్పుడు కాగలకార్యం గంధర్వులే కానిస్తారు మరి!

LEAVE A RESPONSE