‘కమలం’ కోర్ కమిటీపై కిరికిరి

– పాత వారినే కొనసాగించడంపై అభ్యంతరాలు
– జిల్లా స్థాయి నేతలనూ కోర్ కమిటీకి పిలుస్తారా?
– కొత్త కోర్ కమిటీ వేయరా?
– సంఘటనామంత్రిని మార్చాలంటున్న సీనియర్లు
– ఆయన హయాంలో అన్నీ పరాజయాలే
– అధ్యక్షుడిని మార్చి మధుకర్జీని మార్చకపోతే ఫలితం సున్నా
– విష్ణువర్దన్‌రెడ్డికి షోకాజ్ నోటీసు ఇవ్వాలంటున్న సీనియర్ నేతలు
– సీనియర్లను నియంత్రించే శక్తి పురందేశ్వరికి లేదా?
– పురందేశ్వరిది మొహమాటమా? భయమా? లౌక్యమా?
– మీడియా కమిటీని ప్రక్షాళన చేయాలంటున్న నేతలు
– ఏపీ బీజేపీలో చర్చ
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీ బీజేపీలో క్రమశిక్షణ కట్టుతప్పుతోందా? అధ్యక్షురాలిని సీనియర్లు ఖాతరు చేయడం లేదా? ఆమెను ధిక్కరించి సొంత నిర్ణయాలు ప్రకటిస్తున్నారా? కీలక నిర్ణయాలు తీసుకునే కోర్ కమిటీకి, జిల్లా స్థాయి నేతలనూ పిలిచి దాని స్థాయి తగ్గిస్తారా? పార్టీకి మార్గదర్శనం చేయాల్సిన సంఘటనామంత్రి, పార్టీని పరాజయాల బాటలో తీసుకువెళుతున్నా మార్చరా? మధుకర్‌రెడ్డిని మార్చకుండా, కొత్త అధ్యక్షులను నియమిస్తే ఏం ప్రయోజనం?

కట్టుదాటుతున్న క్రమశిక్షణపై అధ్యక్షురాలు ఎందుకు కఠినంగా వ్యవహరించలేకపోతున్నారు? పొత్తుపై వ్యక్తిగత అభిప్రాయం వ్యక్తం చేసిన విష్ణువర్దన్‌రెడ్డికి షోకాజ్ ఇవ్వరా? ఆయనకు ఆమె భయపడుతున్నారా? ఇంతకూ పురందేశ్వరిది మొహమాటమా? భయమా? లేక ఎవరినీ దూరం చేసుకోకుండా, అందరినీ మెప్పించాలన్న లౌక్యమా? ఇదీ ఇప్పుడు.. ఏపీ కమలదళంలో హాట్‌టాపిక్.

ఏపీ బీజేపీలో కీలకమైన కోర్‌కమిటీపై, పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రాష్ట్ర-జాతీయ స్థాయి నేతలు, ప్రజాప్రతినిధులు ఉండే కీలకమైన కోర్ కమిటీలో, జిల్లా స్థాయి నేత లకు స్థానం కల్పించడం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యక్షుల వంటి కోటాల పేరుతో, కోర్‌కమిటీలోకి వస్తున్న విధానాన్ని మార్చాలంటున్నారు. సోము వీర్రాజు అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఆయన నియమించిన అనుచరులకే , మళ్లీ కోర్‌కమిటీలో స్థానం కల్పించడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.

గతంలో జిల్లా స్థాయికి కూడా తగని చాలామందిని… రాష్ట్ర కమిటీలో తీసుకున్నారని, ఇప్పుడు వారే హోదాల పేరుతో, కోర్ కమిటీలో ప్రవేశిస్తున్నారని వివరిస్తున్నారు. నిజానికి పాతకమిటీలో వారిని కాకుండా, కొత్త వారిని అధ్యక్షులే ఆహ్వానించవచ్చని గుర్తు చేస్తున్నారు. సోము వీర్రాజు హయాంలో తనకు నచ్చిన వారినే కోర్‌కమిటీ భేటీకి సమాచారం ఇచ్చేవారన్న విమర్శ ఉండేది. అయితే పురందేశ్వరి మాత్రం ఎవరినీ దూరం చేసుకోకూడదు.. ఎవరికీ శత్రువుగా కాకూడదన్న లౌక్యం’తో వ్యవహరిస్తున్నారని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇక పొత్తులపై పార్టీ అగ్రనేతలు.. నాయకత్వ అనుమతి లేకుండా చేస్తున్న ప్రకటనలు, వివాదాస్పదంగా మారింది. ఇటీవల వైసీపీకి అనుకూలంగా వ్యవహరించే ఒక టీవీ చానెల్‌లో.. 75 అసెంబ్లీ,12 ఎంపీ సీట్లు ఇస్తేనే పొత్తు ఉంటుందంటూ, పార్టీ అగ్రనేత విష్ణువర్దన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కోర్‌కమిటీలో చర్చించకుండా, అధ్యక్షురాలి అనుమతి లేకుండా, ఒక రాష్ట్ర కమిటీ నేత సొంత అభిప్రాయాలు ఎలా ప్రకటిస్తారు? ఏ అర్హతతో ఆయన ఆ ప్రకటన చేశారు? ఆయన ప్రకటనను అధ్యక్షురాలు సీరియస్‌గా తీసుకుని, ఇప్పటిదాకా షోకాజ్‌నోటీసు ఎందుకు జారీ చేయలేదు? అధ్యక్షురాలు ఆ నేతకు భయపడుతున్నారా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

దీనిని కోర్ కమిటీలోని సీనియర్లు కూడా సీరియస్‌గా తీసుకున్నారు. నిజానికి కోర్‌కమిటీలో జాతీయ కార్యదర్శి సత్యకుమార్ లాంటి ప్రముఖులున్నారు. అధ్యక్షురాలు పురందేశ్వరి సహా.. ఎంపి సీఎం రమేష్, కేంద్రమాజీ మంత్రి సుజనాచౌదరి లాంటి కేంద్రపార్టీతో సంబంధాలున్న నేతలున్నారు. ఆ స్థాయి నేతలు కూడా, ఎక్కడా పొత్తుపై ఇప్పటివరకూ ఎక్కడా పెదవి విప్పలేదు.

పొత్తులు జాతీయ పార్టీ నిర్ణయానికి సంబంధించినవని, జాతీయ కార్యదర్శి సత్యకుమార్ చాలాసార్లు స్పష్టం చేశారు. అయినా కూడా వారిని ఖాతరు చేయకుండా .. విష్ణువర్దన్‌రెడ్డి ప్రముఖ చానెల్ సాక్షిగా పొత్తు-స్థానాలను నిర్ణయించినా, నాయకత్వం ఇప్పటిదాకా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విస్మయం వ్యక్తమవుతోంది.

ఇక పార్టీ అధ్యక్షుడిని మార్చిన నాయకత్వం.. పార్టీకి దిశానిర్దేశం చేసే సంఘటనామంత్రిని మాత్రం మార్చకపోవడంపై, అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. సంఘ్ ప్రతినిధిగా ఉండే సంఘటనామంత్రి, పార్టీనేతలను సమన్వయపరిచి కార్యక్రమాలను వేగం చేయాలి. పార్టీ నిర్ణయాలలో కీలకపాత్ర పోషించాలి. సలహాలు-సూచనలిచ్చి పార్టీని నడిపించాలి. కానీ సంఘటనామంత్రి మధుకర్‌రెడ్డి.. వాటిలో విఫలమయ్యారన్న విమర్శ, చాలాకాలం నుంచీ వినిపిస్తోంది. సోము వీర్రాజు హయాంలో పార్టీ పరంగా అనేక తప్పులు జరిగినా.. మధుకర్‌రెడ్డి వాటిని అడ్డుకోకపోగా, సహకరించారన్న విమర్శలు అప్పట్లోనే వినిపించాయి.

పాత సంఘటనా మంత్రి సహకారంతో.. సోము-సునీల్ దియోథర్-మధుకర్జీ-విష్ణువర్దన్‌రెడ్డి ఒక గ్రూపుగా ఏర్పడి.. పార్టీని నడిపించారన్న విమర్శలు, అప్పట్లో వినిపించిన విషయం తెలిసిందే. పైగా మధుకర్‌రెడ్డి సంఘటనా మంత్రిగా వచ్చిన తర్వాత.. ఒక్క ఎన్నికల్లోనూ, విజయం సాధించలేదని పార్టీ సీనియర్లు గుర్తు చేస్తున్నారు. కోర్‌కమిటీ భేటీకి సైతం, తమకు నచ్చిన వారినే పిలిచిన సందర్భాలున్నాయంటున్నారు.

తణుకు, కావలి పర్యటనలపైనా పలు వ్యాఖ్యలు వినిపించిన విషయం తెలిసిందే. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలపై ..సీరియస్‌గా ప్రత్యక్ష పోరాటానికి పార్టీని సన్నద్ధం చేయడంలో, ఆయన విఫలమయ్యారంటున్నారు. కనీసం ఆ అంశాలను కూడా గుర్తించలేకపోయారని చెబుతున్నారు. సోము హయాంలో జరిగినవన్నీ ఉత్తుత్తి, పేపర్ ఉద్యమాలనేనని గుర్తు చేస్తున్నారు.

గత అధ్యక్షుడికి బలమైన మద్దతుదారుగా ఉన్నారన్న వ్యాఖ్యలు కూడా వినిపించిన విషయం తెలిసిందే. కీలకమైన ఎన్నికల నేపథ్యంలో… పార్టీని యుద్ధానికి సన్నద్ధం చేసేందుకు.. ఏపీ రాజకీయాలపై అవగాహన, వ్యూహరచయితను మధుకర్‌రెడ్డి స్థానంలో నియమించాలని సీనియర్లు సూచిస్తున్నారు.

ఇక ప్రధానంగా కీలకమైన ఎన్నికల నేపథ్యంలో మీడియా కమిటీని బలోపేతం చేయాలన్న సూచన వ్యక్తమవుతోంది. నాన్ సీరియస్ నేతలకు బదులు, పార్టీగళం బలంగా వినిపించే వారిని గుర్తించడంతోపాటు… మీడియాతో సత్సంబంధాలున్న నేతలకు, మీడియా బాధ్యతలు అప్పగిస్తే మంచిదంటున్నారు.

‘‘ఇప్పుడు అధికార పార్టీ-ప్రత్యర్ధి పార్టీల విమర్శలను తిప్పికొట్టి, పార్టీని జనంలోకి తీసుకువెళ్లాల్సిన సమయం. అలాంటి సమయంలో నాన్ సీరియస్ నేతల బదులు రాజకీయ అంశాలపై అవగాహన, ఎదురుదాడి, మీడియాకు పార్టీ విధానాలు చెప్పి వాటిని జనంలోకి పంపించాల్సిన నేతలకు మీడియా బాధ్యతలు అప్పగిస్తే మంచిది. సోము వీర్రాజు వేసిన మీడియా బృందమే ఇంకా పనిచేస్తున్నట్లుంది. ఒక్కముక్కలో చెప్పాలంటే మీడియా విభాగాన్ని సంపూర్ణంగా ప్రక్షాళన చేయాల్సి ఉంద’’ని తూర్పు గోదావరికి చెందిన ఓ సీనియర్ నేత వ్యాఖ్యానించారు.

‘మాది పేరుకు జాతీయ పార్టీ అయినా రాష్ట్ర మీడియాలో మాకు రవంత చోటు కూడా లేదు. సోషల్‌మీడియాలో మా పార్టీపై జరిగే దుష్ప్రచారంపై ఎదురుదాడి చేసేవారే లేరు. దానికి గత అధ్యక్షుడే కారణం. ఆయన అందరినీ దూరం చేసుకున్నారు. మీడియాపైనే ఎదురుదాడి చేసేవారు. ఫలానా మీడియాకు వెళ్లవద్దంటూ ఆంక్షలు విధించారు. దానితో పార్టీ కార్యక్రమాలేవీ జనంలోకి వెళ్లలేదు. ఇప్పుడు మా అధ్యక్షురాలికి కూడా మీడియాతో పెద్దగా సత్సంబంధాలు లేవు. ఆమె ఎవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వరు. ఫోన్లు తీయరని మీ మీడియా మిత్రులే మాకు చెబుతున్నారు. ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలో, కోర్‌కమిటీలో కూర్చుని చర్చించాల’’ని, కృష్ణా జిల్లాకు చెందిన ఒక సీనియర్ నేత సూచించారు.

Leave a Reply