Suryaa.co.in

Editorial

బాలినేనిని జగన్ బలహీనపరుస్తున్నారా?

– ఒంగోలుకు పోటీ చేయాలని శిద్దాపై ఒత్తిడి?
– మార్కాపురం వెళ్లాలని మరో ఆఫర్?
– బాలినేనిని గిద్దలూరుకు వెళ్లాలంటున్న జగన్?
– బాలినేని సిఫార్సు చేసిన చంద్రశేఖర్‌కు ఎర్రగొండపాలెం టికెట్
– మాగుంటకు ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చేదిలేదన్న జగన్?
– వైవి సుబ్బారెడ్డికే ఒంగోలు సీటు?
– మాగుంటకు టికెట్ ఇస్తేనే బాలినేని పోటీ
– శిద్దాకు దర్శి ఇవ్వాలంటున్న బాలినేని
– బాలినేని బెదిరింపులపై జగన్ ఆగ్రహం
– ఒక జిల్లా పోయినా ఫర్వాలేదనుకుంటున్న జగన్?
– అందుకే బాలినేనిని బలహీనపరిచే ఎత్తుగడ
– అనుచరులను చీల్చి ఒంటరి చేసే వ్యూహం
– ఆయన వర్గీయులకు సీట్లు ఇచ్చి బాలినేనిని వేరు చేసే వ్యూహం
– బాలినేని మాటపైనే బలరాం, శిద్దా
– అల్లుడిపై అలిగి హైదరాబాద్‌లోనే బాలినేని
– పోటీకి వేమిరెడ్డి విముఖత
– నెల్లూరు, ఉదయగిరి, కావలి అభ్యర్ధులను మార్చమని వేమిరెడ్డి డిమాండ్
-కుదరదని చెప్పిన జగన్?
– పోటీ చేయనని గత వారం దక్షిణాఫ్రికా వెళ్లిన వేమిరెడ్డి?
– రెండురోజులూ ప్రకాశం, నెల్లూరు ఎంపీ సీటుపై జగన్ చర్చ
– జగన్‌కు తలనొప్పిలా మారిన ప్రకాశం-నెల్లూరు జిల్లాలు
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో రాజకీయ చైతన్యం దండిగా ఉండే ప్రకాశం-నెల్లూరు జిల్లాలు వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్‌కు తలనొప్పిలా తయారయ్యాయి. ప్రధానంగా ప్రకాశం జిల్లాలో మాస్ లీడర్‌గా పేరున్న మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డిని…రాజకీయంగా బలహీనపరిచే ఎత్తుగడకు తెరలేపిన జగన్ వ్యూహం, బెడిసికొట్టే సూచనలు కనిపిస్తున్నాయి. తనను బెదిరిస్తున్న మామ బాలినేనికి చెక్ పెట్టేందుకు, జగన్ ఆడుగుతున్న పొలిటికల్ గేమ్ ప్లాన్‌లో, ఎవరు చిక్కుకుంటారన్న ఆసక్తి వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. అయితే ప్రకాశం జిల్లా పాలిటిక్స్‌లో బాహుబలిగా ఉన్న బాలినేని కూడా హైదరాబాద్‌లో కూర్చుని, ఎత్తుపైఎత్తు వ్యూహాలు రచిస్తున్నారు.

అటు నెల్లూరు ఎంపీ సీటుపైనా జగన్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఎంపి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి, నెల్లూరు ఎంపీ సీటు ఇవ్వాలన్న జగన్ ప్రయత్నం ఫలించే సూచనలు కనిపించడం లేదు. ఎమ్మెల్యే అనిల్‌యాదవ్‌ను మార్చాలన్న వేమిరెడ్డి షరతును జగన్ ఖాతరు చేయడం లేదు. దానితో అసలు వేమిరెడ్డి ఎన్నికల సమయంలో ఇండియాలోనే ఉండకూడదన్న నిర్ణయానికి వచ్చారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.

ఇటు ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసులురెడ్డికి.. సీటు ఇస్తేనే పార్టీలో ఉండాలని బాలినేని నిర్ణయించుకోవడం సరికొత్త పరిణామం. కానీ జగన్ మాత్రం మాగుంటకు ఎంపీ ఇచ్చేందుకు ససేమిరా అంటున్నారు. ఎంపీ సీటు సుబ్బారెడ్డికి ఇవ్వాలని భావిస్తున్నారట. ఆయన టీడీపీ వారితో టచ్‌లో ఉంటున్నారన్నది జగన్ అనుమానం. మరి బాలినేని పార్టీలో ఉంటారా? టీడీపీ అభ్యర్ధిగా అవతరిస్తారా? అన్న ప్రశ్న ఉత్కంఠ కలిగిస్తోంది.

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మాస్ ఇమేజ్, అజాత శత్రువుగా ఉన్న బాలినేని శ్రీనివాసరెడ్డిని.. సొంత జిల్లాల్లోనే రాజకీయంగా బలహీనపరిచేందుకు, సొంత బంధువైన జగన్ ప్రయత్నిస్తున్నారన్న చర్చ ఆసక్తికరంగా మారింది. పార్టీలతో సంబంధం లేకుండా బాలినేనికి అన్ని పార్టీల్లో మిత్రులున్నారు. వివాదరహితుడిగా పేరున్న బాలినేని, ఒకరకంగా ప్రకాశం జిల్లాలో వైసీపీకి కొండంత అండ. ఏ నియోజకవర్గమైనా అభ్యర్ధిని ఆయన డిసైడ్ చేయాల్సిందే. అలాంటి బాలినేనిని బలహీనపరిచేందుకు, జగన్ పావులు కదపడమే ఆశ్చర్యం. ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం, మాజీ మంత్రి శిద్దా రాఘవరావు, మాజీ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి ఒకే శిబిరంలో ఉంటారన్నది ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. వీరంతా కలసి టీడీపీలో చేరతారన్న ప్రచారం కూడా కొద్దిరోజుల నుంచి వినిపిస్తోంది.

ప్రకాశం జిల్లాలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ, బాలినేనికి లెక్కలేనంతమంది అనుచరవర్గం ఉంది. ప్రస్తుతం నియోజకవర్గాలు మారిన మంత్రులు నాగార్జున, సురేష్ ను.. బాలినేని వచ్చి పరిచయం చేస్తే తప్ప, కార్యకర్తలు పనిచేసే పరిస్థితి లేదు. ప్రకాశం జిల్లాలో వైసీపీకి సంబంధించినంత వరకూ, బాలినేని సహకారం లేనిదే వైసీపీ అభ్యర్ధులు గెలిచే పరిస్థితి లేదన్నది బహిరంగ రహస్యం.

తొలుత 11 మంది సిట్టింగులను మార్చిన తర్వాత వైసీపీ సీనియర్లు విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇద్దరూ.. బాలినేని సహకారం కోసం ఒత్తిడి చేసిన సందర్భాలు కోకొల్లలు. సీఎం కార్యదర్శి ధనుంజయరెడ్డి కూడా, బాలినేనిని బ్రతిమిలాడుకోవలసిన పరిస్థితి. ‘మీ అంతట మీరు అభ్యర్ధులను ప్రకటించుకున్న తర్వాత నాకెందుకు ఫోన్లు చేస్తారు? వాళ్లను మీ సీఎం గారినే వచ్చి గెలిపించుకోమనండి. మధ్యలో నాకేంటి సంబంధం’ అని.. నిర్మొహమాటంగా బదులిస్తున్న బాలినేని, ఇప్పుడు జగనన్న కంట్లో నలుసులా మారారు.

రాష్ట్రంలో మహామహులే తనకు పాదాక్రాంతమవుతుంటే.. బాలినేని ఒక్కరే తనను బెదిరించడం జగన్‌కు రుచించడం లేదు. తనకు షరతులు విధించడం, బెదిరించడాన్ని జగన్ భరించలేకపోతున్నారు. అది జగన్ స్వభావానికి పూర్తి విరుద్ధం. 25 వేల పట్టాలు, దానికి సంబంధించిన భూసేకరణకు 75 కోట్ల నిధులు విడుదల చేస్తేనే, తాను పోటీ చేస్తానని బాలినేని షరతు విధించారు. ఇప్పటివరకూ అది అమలుకాలేదు.

అటు మంత్రులు-ఎమ్మెల్యేలపై పూర్తి పట్టు సాధించిన సీఎంఓ కూడా.. బాలినేని ముందు బెదిరిపోవలసి వస్తోంది. సీఎంఓ కార్యదర్శి ధనుంజయరెడ్డి కూడా బాలినేనికి ఫోన్ చేయాలంటే, సజ్జల లేదా విజయసాయిరెడ్డి ఉన్నప్పుడు మాత్రమే వారి ఫోన్లతో మాట్లాడాల్సిన పరిస్థితి.

అందుకే ముందు బాలినేని చుట్టూ ఉన్న వారిని.. ఆయన నుంచి వేరు చేసి, చివరకు బాలినేనిని ఒంటరిని చేసే ‘సీమ రాజకీయాని’కి తెరలేపినట్లు కనిపిస్తోంది. అందుకే బాలినేని మిత్రుడైన శిద్దా రాఘవరావును, ఒంగోలు అసెంబ్లీ నుంచి పోటీ చేయాలని జగన్ సూచిస్తున్నారట. లేకపోతే మార్కాపురం, గిద్దలూరు నుంచి పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. అంటే బాలినేని సిట్టింగు సీటయిన ఒంగోలును, ఆయన మిత్రుడైన శిద్దాకు ఇవ్వడం ద్వారా విభజించి పాలించు సూత్రాన్ని అమలుచేయాలన్నది జగన్ వ్యూహంగా స్పష్టమవుతోంది.

దానితో పాటు ఎర్రగొండపాలెం నుంచి, బాలినేని సిఫార్సు చేసిన చంద్రశేఖర్‌కు సీటు ఇచ్చిన జగన్.. అదే బాలినేనిని మాత్రం మార్కాపురం లేదా గిద్దలూరుకు వెళ్లాలని చెబుతున్నారట. ఈవిధంగా తనను బెదిరిస్తూ, తలనొప్పిలా మారిన బాలినేనిని బలహీనపర్చడం ద్వారా.. ప్రకాశంపై బాలినేని ప్రభావాన్ని పూర్తిగా తొలగించే ఎత్తుగడలో ఉన్నట్లు స్పష్టమవుతోంది.

అందులో భాగంగానే బాలినేని వ్యతిరేకించే వైవి సుబ్బారెడ్డికి, ఒంగోలు ఎంపీ ఇవ్వాలని జగన్ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అటు బాలినేనిని బుజ్జగిస్తూనే, ఇటు బాబాయ్ సుబ్బారెడ్డిని అందలమెక్కించే ద్విముఖ వ్యూహంతో వెళుతున్న జగన్ వైఖరిని.. అటు బాలినేని కూడా నిశితంగా పరిశీలిస్తున్నారట. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉన్న బాలినేనితో జిల్లా నేతలు చర్చిస్తున్నారు. తాను సిఫార్సు చేసిన మాగుంటకు కాకుండా, సుబ్బారెడ్డికి ఒంగోలు ఎంపీ సీటు ఇస్తే.. బాలినేని తనంతట తానే వెళ్లిపోతాడన్న లౌక్యరాజకీయం ఇందులో కనిపిస్తోంది.

అటు బాపట్ల ఎమ్మెల్యే కోనరఘుపతికి సైతం, టికెట్ ఇచ్చే అవకాశం లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్కడ రెడ్డి వర్గానికి సీటివ్వాలన్న డిమాండ్ ఉండటంతో, ఆమేరకు మార్పులు చేసే అవకాశం ఉందంటున్నారు. గత మూడురోజుల నుంచి జగన్-సీఎంఓ అధికారులు, ఒంగోలు-బాపట్ల-నెల్లూరు జిల్లా సీట్లపైనే కూర్చుంటున్నారంటే.. ఆ జిల్లాలు పార్టీ అధినేతకు, ఏ స్థాయిలో శిరోభారంగా పరిణమించాయో స్పష్టమవుతోంది.

ఇక నెల్లూరు ఎంపీ సీటును వేమిరెడ్డి ప్రభాకర్‌రె డ్డికి ఇవ్వాలని భావించినప్పటికీ, అందుకు ఆయన విముఖంగా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యే అనిల్‌యాదవ్‌తోపాటు.. ఉదయగిరి-కావలి అభ్యర్ధులను మార్చాలన్న వేమిరెడ్డి సూచనను, జగన్ బేఖాతరు చేయడమే దానికి కారణమట. అనిల్‌ను మారిస్తేనే తాను ఎంపీగా పోటీ చేస్తానని వేమిరెడ్డి స్పష్టం చేశారట. దానికి జగన్ అంగీకరించకపోవడంతో విసుగుచెందిన వేమిరెడ్డి, తాను విదేశాలకు వెళుతున్నానంటూ ఆఫ్రికాకు వెళ్లినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

అయితే విజయసాయిరెడ్డి ఆయనకు ఫోన్ చేసి సర్దిచెప్పగా.. తాను మూడురోజుల్లో వస్తానని, వచ్చినా మళ్లీ నాలుగునెలలు అమెరికా వెళతానని స్పష్టం చేసినట్లు, నెల్లూరు జిల్లా పార్టీ వర్గాల్లో గత వారం ప్రచారం జరిగింది. ఆ ప్రకారంగా వేమిరెడ్డి కూడా నెల్లూరు ఎంపీగా పోటీ చేయకపోవచ్చంటున్నారు. అయితే జగన్ మాత్రం పోటీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారట.

వేమిరెడ్డి అసంతృప్తికి కారణం లేకపోలేదని వైసీపీ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. వేమిరెడ్డికి గుజరాత్‌తోపాటు, మరో రాష్ట్రంలో కాంట్రాక్టు ఇప్పిస్తానని జగన్ చాలాకాలం క్రి తం హామీ ఇచ్చారట. అది ఇప్పటివరకూ నెరవేర్చలేదు. ఇక తెలంగాలో ఎన్నికల ముందు కేసీఆర్‌తో మాట్లాడి, ఒక ప్రాజెక్టు ఇప్పించే ప్రయత్నాలు జరిగాయట. ఈలోగా ఎన్నికలు రావడం, కేసీఆర్ ప్రభుత్వం కూలిపోవడంతో దానిపైనా ఆశ వదులుకోవలసి వచ్చిందట. ఇక చివరగా రాష్ట్రంలో ఇసుక కాంట్రాక్టు ఇప్పిస్తానని చెప్పి, దానిని అనిల్‌రెడ్డికి ఇప్పించడమే వేమిరెడ్డి అసంతృప్తికి ప్రధాన కారణమని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. నిజం ‘జగన్నా’ధుడికెరుక?

LEAVE A RESPONSE