ఏపీ కొత్త సారధులు ద్వారకా, నీరబ్?

– సీఎస్ జవహర్‌రెడ్డిపైనా వేటు?
– ఇన్చార్జి డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డి అవుట్?
– అదే దారిలో నిఘా దళపతి పీఎస్సార్?
– కూటమి లక్ష్యం వారే
– ఇప్పటికే వారిపై విపక్షాల ఫిర్యాదులు
– గత ఎన్నికల్లో జరిగిందీ ఇదే
– గతంలో డీజీపీ, సీఎస్, నిఘా దళపతిపై ఎన్నికల ముందు వేటు
– ఇప్పుడూ కొనసాగనున్న పాత సంప్రదాయం?
– ఒకే జిల్లా నుంచి డీజీపీ,సీఎస్ ఉండటంపై అప్పుడే విమర్శలు
– కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావు?
– సీఎస్‌గా నీరబ్‌కుమార్‌కు అవకాశం?
– మొదలుకానున్న ఫిర్యాదుల పరంపర
– తొలి దశలో 4గురు ఐఏఎస్, 6గురు ఐపిఎస్‌లపై ఫిర్యాదు?
– శ్రీకాకుళం వీఆర్‌ఓపై ఈసీ తొలి వేటు
– వేటుతో అధికారులలో వణుకు

( మార్తి సుబ్రహ్మణ్యం)

ఎన్నికల కోడ్ కూసిన తర్వాత ఒక అధికారిపై తొలివేటు. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం దిమిలి గ్రామంలో గ్రేడ్ వన్ వీఆర్వోగా పనిచేస్తున్న కె.రమేష్‌బాబు వైసీపీ ప్రచారంలో పాల్గొన్నారని తేలడంతో, సీఈసీ ముఖేష్‌కుమార్ మీనా అతనిపై వేటు వేశారు. ఫలితంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఈసీ చర్యల కొరడా ఝళిపించడం, అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న అధికారులలో వణుకు మొదలయింది.

కాగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో మంత్రులు-ఎమ్మెల్యేలు, వైసీపీ నేతల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్న అధికారులు, వారి ప్రసంగాలను టీడీపీ-జనసేన-బీజేపీ నేతలు ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ప్రధానంగా కింది స్థాయిలో ప్రభావితం చేసే గ్రామ సచివాలయ అధికారుల నుంచి, పైస్థాయిలో ప్రభావితం చేసే మరికొందరు వైసీపీ సానుభూతిపరులైన అధికారులపై వేటుకు రంగం సిద్ధమవుతోంది.

ఇక రాష్ట్ర స్థాయిలో కీలక స్థానాల్లో ఉన్న వారిపై కూడా ఫిర్యాదులకు రంగం సిద్ధమయినట్లు తెలుస్తోంది. ఈ విషయంలో గత ఎన్నికల ముందు వైసీపీ అనుసరించిన వ్యూహాన్నే, ఈసారి టీడీపీ-జనసేన-బీజేపీ అనుసరించనున్నాయి. గత ఎన్నికల ముందు వైసీపీ ఫిర్యాదు మేరకు డీజీపీ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇంటలిజన్స్ ఏడీజీలపై ఎన్నికల సంఘం నేరుగా చర్యలు తీసుకుని, నాటి టీడీపీ సర్కారుకు షాకిచ్చింది. ఎల్వీని నేరుగా ఈసీనే సీఎస్‌గా నియమించింది. ఇప్పుడు మళ్లీ చరిత్ర పునరావృతమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి, డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డి, ఇంటలిజన్స్ చీఫ్ పీఎస్సార్ ఆంజనేయులుపై వేటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ మేరకు వారిపై కూటమి ఫిర్యాదులిచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. నిజానికి వీరిపై టీడీపీ ఈపాటికే వివిధ సంస్థలకు ఫిర్యాదు చేసింది. తాజాగా ఏపీపీఎస్సీ వ్యవహారంలో స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడే ఆరోపణలు గుప్పించారు. తమ టెలిఫోన్లు ట్యాపింగ్ చేస్తున్నారని ఆరోపించారు.

డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డికి అవకాశం లేక పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదని, టీడీపీ నేతలు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. డీజీపీ-సీఎస్-ఇంటలిజన్స్ చీఫ్‌పై టీడీపీ సీనియర్ నేతలయిన వర్లరామయ్య, పట్టాభి ఇటీవలి కాలంలో శరపరంపరగా ఆరోపణాస్త్రాలు సంధిస్తున్నారు. వివిధ అంశాలకు సంబంధించి సీఎస్, డీజీపీలకు వినతిపత్రాలు ఇచ్చేందుకు ప్రయత్నించినా, అందుబాటులోకి రాని వారి తీరును గుర్తు చేసుకుంటున్నారు.

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో ఇక.. తమ పార్టీని వేధించి, వైసీపీకి సాయపడిన వివిధ స్థాయిలోని అధికారుల జాబితాను కూటమి రూపొందించినట్లు సమాచారం. ఆయా అధికారులు ఆ స్ధానాల్లో ఉంటే ఎన్నికలు సక్రమంగా జరగవని, సదరు అధికారులు వైసీపీకి కొమ్ముకాసే ప్రమాదం ఉన్నందున, వారిని తక్షణం ఎన్నికల విధుల నుంచి తప్పించాలని కూటమి నేతలు ఈసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. మొత్తం ఆరు దశల్లో ఫిర్యాదులివ్వాలని కూటమి నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆ ప్రకారంగా తొలి దశలో నలుగురు ఐఏఎస్, ఆరుగురు ఐపిఎస్ అధికారులు కూటమి జాబితాలో ఉన్నట్లు సమాచారం.

ఇదిలాఉండగా డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డి ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారే తప్ప రెగ్యులర్ డీజీపీ కాదు. రెగ్యులర్ డీజీపీని నియమించే ప్రయత్నం జగన్ సర్కారు ఇంతవరకూ చేయలేదు. ఆయన కంటే ముందు బ్యాచ్ వారిని పక్కనపెట్టి, తన జిల్లాకు చెందిన కసిరెడ్డి రాజేంద్రనాధ్‌రెడ్డికి, ఇన్చార్జి డీజీపీ పదవి ఇవ్వడం వివాదాస్పదమయింది.

ఆయన ఐపిఎస్ అధికారిగా కాకుండా వైసీపీ కార్యకర్తగా పనిచేస్తున్నారని, ఇప్పటికే టీడీపీ ఆరోపణలు సంధిస్తోంది. ఆయన డీజీపీ స్థానంలో ఉంటే ఎన్నికలు సక్రమంగా జరగకపోగా, శాంతిభద్రతల సమస్య వచ్చే ప్రమాదం ఉందంటూ కూటమి ఫిర్యాదు చేయబోతోంది. అప్పుడు ఈసీ సీనియర్ల జాబితా తెప్పించుకుని, డీజీపీని నియమించవచ్చు. లేదా తానే నేరుగా నియమించవచ్చు. గతంలో జరిగింది కూడా ఇదే.

ఆ క్రమంలో రాజేంద్రనాద్‌రెడ్డి కంటే సీనియర్, వివాదరహితుడైన ద్వారకాతిరుమల రావుకు డీజీపీ బాధ్యతలు అప్పగించే అవకాశాలు లేకపోలేదని అధికార వర్గాలు చెబుతున్నాయి. ద్వారకా తిరుమలరావు తన కెరీర్‌లో ఎవరినీ సమర్ధించిన దాఖలాలు లేవు. తుని ఘటనలో సీఐడీ చీఫ్‌గా ఆయనిచ్చిన నివేదక, నిష్పాక్షికంగా ఉందన్న మాట అప్పటి ప్రభుత్వ వర్గాల్లో వినిపించిన విషయం తెలిసిందే. ఆయనపై పార్టీ-వర్గాల ముద్ర లేకపోవడం కూడా ద్వారకాకు కలిసివచ్చే అంశం.

ఇక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అంతపెద్ద వివాదాస్పదుడు కాకపోయినప్పటికీ, జగన్ ప్రభుత్వ నిర్ణయాలను గుడ్డిగా అమలుచేశారన్న విమర్శలు వినిపిస్తుంటాయి. జగన్‌కు భయపడి సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ తీసుకునేందుకు ఆయన కు, అపాయింట్‌మెంట్‌కూడా ఇవ్వని వైనం విమర్శలకు దారితీసింది. ఇక ఎంపీ రఘురామకృష్ణంరాజు చేసిన ఫిర్యాదులపై స్పందించి కేంద్రం పంపిన లేఖలకూ సకాలంలో స్పందించలేదన్న విమర్శలున్నాయి. మాజీ సమీర్‌శర్మ సీఎస్‌గా ఉన్నపుడు తిరస్కరించిన అనేక ఫైళ్లను, జవహర్‌రెడ్డి క్లియర్ చేశారన్న కథనాలు మీడియాలో వెల్లువెత్తాయి.

వైసీపీని సమర్థించే అనేకమంది ఐఏఎస్‌లను కీలక జిల్లాల కలెక్టర్లుగా నియమించారని, అందులో సొంత సామాజికవ ర్గానికి చెందిన వారే ఎక్కువ అని, టీడీపీ నేతలు బాహాటగానే ఆరోపించిన విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వ నిర్ణయాలపై తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా, జవహర్‌రెడ్డి పట్టించుకోలేదని టీడీపీ నేతలు విమర్శించారు.

పైగా జగన్ సొంత జిల్లాకు చెందిన డీజీపీ రాజేంద్రనాధ్‌రెడ్డి, సీఎస్ జవహర్‌రెడ్డికి కీలక పదవులు ఎలా ఇస్తారన్న ప్రశ్నలు అప్పట్లోనే వినిపించాయి. ఈ క్రమంలో ఆయనను కూడా ఆ బాధ్యతల నుంచి తప్పించాలని కూటమి ఫిర్యాదు చేయనుంది. ఆ క్రమంలో సీనియర్ ఐఏఎస్ నీరబ్‌కుమార్‌ను, సీఎస్‌గా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వివాదరహిత అధికారిగా పేరున్న నీరబ్‌ను, జగన్ ప్రభుత్వం ఏకారణం వల్లనో పక్కనపెట్టింది.

ఇక ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులుపైనా ఫిర్యాదు చేసేందుకు కూటమి సిద్ధమవుతున్నట్లు సమాచారం. టీడీపీ సీనియర్లపై కేసులు, వారి ఫోన్లు ట్యాపింగ్ చేయిస్తున్నారన్న ఫిర్యాదులు ఆయనపై ఉన్నాయి. రాష్ట్రంలో టీడీపీ సీనియర్ నాయకులపై అక్రమ కేసుల వెనుక, అసలు సూత్రధారి ఆయనేనన్న ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఆ మేరకు టీడీపీ నేతలు ప్రెస్‌మీట్‌లో నేరుగానే ఆరోపణలు కురిపించారు.
రాష్ట్రంలో విపక్షాలు స్వేచ్ఛగా ఫోన్లలో మాట్లాడే అవకాశం లేకుండా చేశారని, టీడీపీ నేతలు ఆరోపించారు. ఈ క్రమంలో ఆయనను ఆ బాధ్యతల నుంచి తప్పించాలని, కూటమి ఈసీకి ఫిర్యాదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. గతంలో అదే స్ధానంలో ఉన్న ఏబీ వెంకటేశ్వరరావును సైతం ఎన్నికల ముందు విధుల నుంచి తప్పించిన విషయం తెలిసిందే.

నిజంగా డీజీపీ-సీఎస్- ఇంటెలిజెన్స్ చీఫ్‌లను ఈసీ వివిధ ఆరోపణలపై వారి బాధ్యతల నుండి తప్పిస్తే.. గత ఎన్నికల్లో వైసీపీ చర్యలకు ప్రతీకారం తీర్చుకున్నట్లు అవుతుంది. గత ఎన్నికల ముందు వైసీపీ అదే పనిగా ముగ్గురిపై ఈసీకి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కాగా వైసీపీకి పూర్తి స్థాయి అనుకూలంగా పనిచేస్తున్న 8 మంది కలెక్టర్లు, ఆరుగురు ఎస్పీలపైనా ఈసీకి ఫిర్యాదు చేసేందుకు కూటమి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

కాగా సీఈసీ ముఖేష్‌కుమార్ మీనా ఫిర్యాదులపై శరవేగంగా స్పందించడం లేదన్న అసంతృప్తి కూటమిలో వ్యక్తమవుతోంది. ఇటీవల ఎల్వీ, నిమ్మగడ్డ, ఎంవి కృష్ణారావు, జస్టిస్ భవానీప్రసాద్, లక్ష్మణ్‌రెడ్డి వంటి ప్రముఖుల సారథ్యంలో ఏర్పడ్డ వేదిక ఇచ్చిన ఫిర్యాదులపై కూడా ముఖేష్ స్పందించకపోవడంపై వేదిక ప్రముఖులు అసంతృప్తితో ఉన్నారు.
‘‘ అప్పుడంటే ప్రభుత్వం ఉంది కాబట్టి పిర్యాదులపై కొంచెం నెమ్మదించారనుకోవచ్చు. ఇప్పుడు కోడ్ అమలులోకి వచ్చినందున ,ఆయనకు ఎలాంటి మొహమాటాలు అవసరం లేదనుకుంటా. ముఖేష్ మంచివాడే. కానీ ఆ స్థానంలో ఉండేవాళ్లు స్పీడుగా ఉండాలి. ముఖేష్ ఇప్పుడయినా ఫిర్యాదులకు స్పందించి, మేం ఇచ్చిన ఫిర్యాదులపై తక్షణంచర్యలు తీసుకోవాలి’’ అని వేదిక ప్రముఖుడొకరు వ్యాఖ్యానించారు.

Leave a Reply