ఓట్ల కోసం.. ఒట్లు!

– ఒట్టేసి చెబుతున్నా.. కాసులు తీసుకున్నా.. కారుకే ఓటేస్తా!
– డబ్బులిచ్చి ప్రమాణం చేయించుకుంటున్న బీఆర్‌ఎస్ అభ్యర్ధి
– సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న వీడియో
– ఎన్నికల్లో ఇదో ‘సొమ్ము’ సెంటిమెంట్
– చావు సెంటిమెంటుతో బీఆర్‌ఎస్ అభ్యర్ధి కౌశిక్‌రెడ్డి
– ‘చావు’ తెలివి ప్రదర్శించినందుకు ఆయనకు ఈసీ నోటీసు
( మార్తి సుబ్రహ్మణ్యం)

పార్టీలపై జనాలకు నమ్మకం పోయినట్లే… ఎన్నికల్లో జనంపై పార్టీలకు కూడా న మ్మకం పోయినట్లుంది. అందుకే దేవుడిపై ఒట్టు వేయించుకుంటున్నారు. ఎందుకంటే నమ్మకం కోసం. దేవుడిపై ప్రమాణం చేస్తే జనం మాట తప్పరన్న గురి. డబ్బులు తీసుకున్న విశ్వాసం-పాపభీతి ఉంటుందన్న నమ్మకం. ఆ నమ్మకం-గురే ఇప్పుడు అభ్యర్ధులను ఓటర్లను, డబ్బులిచ్చి ఒట్టేయించుకునే దాకా తీసుకువెళ్లింది. అధికార బీఆర్‌ఎస్ ఈ సొమ్ముల సెంటిమెంటును బాగానే వాడుకున్నట్లు కనిపిస్తోంది.

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం చీలాపూర్ గ్రామంలో.. కుర్చీలో కూర్చున్న ఓ పెద్దాయన ఓటర్లతో ఒట్లు వేయించుకుని మరీ డబ్బులిస్తున్న ఒక వీడియో, సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తోంది.‘దేవుడి తోడు. కారు గుర్తుకే ఓటేస్తాం’ అని వారితో చెప్పించిన తర్వాత, చేతిలో డబ్బులు పెడుతున్న సుందర-సుమధుర దృశ్యాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. బీఆర్‌ఎస్ సెక్యులర్ పార్టీనా కాదా అన్నది పక్కనపెడితే.. దేవుడిపై జనాలకు ఉన్న బలహీనతలను మాత్రం, బాగానే వాడుకుంటున్నట్లు కనిపిస్తోంది.

ఇక బీజేపీ అభ్యర్ధి ఈటల రాజేందర్‌పై… బీఆర్‌ఎస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న పాడి కౌశిక్‌రెడ్డి చూపిన, ఇలాంటి ‘చావు’ తెలివి సెంటిమెంటు కథ.. అయ్యోరిని చేయబోతే కొతి అయినట్లు, ఈసీ వద్ద రింగు రివర్సయింది. భార్య-బిడ్డను చూపిస్తూ ‘మీరు నాకు ఓటేస్తే విజయయాత్ర.. లేకపోతే చావు యాత్ర. సాదుకుంటరా? సంపుకుంటరా మీ ఇష్టం’ అని, చావు సెంటిమెంటును మేళవించిన కౌశిక్‌రెడ్డి ప్రచార కథ బూమెరాంగయింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఎన్నికల సంఘం ఆయనకునోటీసు జారీ చేసింది.

‘అయినా ఎన్నికల్లో ధైర్యంగా గెలవాలి గానీ ఇలా చావు సెంటిమెంటుతో ఓట్లు అడుక్కోవడం ఏమిటి’? అని కొందరు.. ‘అధికార పార్టీ సక్కదనం కౌశిక్‌రెడ్డి మాటల్లోనే తేలిపోయింది. ఇంక కారు ఏం గెలుస్తుంది’? అని ఇంకొందరు.. మొన్న సారేమో మీరు గెలిపిస్తే సేవచేస్తం. లేకపోతే ఇంట్లో రెస్టు తీసుకుంటం అనిండు కదా? ఇప్పుడు కౌశిక్‌రెడ్డి ఓటేయపోతే సచ్చిపోనంటాండు. గిదేం ‘చావు’ తెలివి? అని ఇంకొందరు నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

ఇక మంత్రి మల్లారెడ్డి తనకు ఓటు వేయించాలని కోరుతూ, తన సొంత మల్లారెడ్డి కాలేజీ విద్యార్ధులను ఆడిటోరియానికి పిలిపించారు. అక్కడ ఏర్పాటుచేసిన భారీతెరపైకి ఆన్‌లైన్‌లోకి వచ్చి, తనకు ఓటు వేయించాలని మల్లారెడ్డి కోరడం.. కాంగ్రెస్ జిందాబాద్ అని విద్యార్ధులు మూక్ముడిగా నినదించడం, మల్లారెడ్డి వెళ్లిపోవడం శరవేగంగా జరిగిపోయాయి. ఇప్పుడు ఆ వీడియో కూడా సోషల్‌మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అంతకుముందు… అదే మల్లారెడ్డి కాలేజీకి చెందిన సిబ్బంది డబ్బు పంచుతుంటే కాంగ్రెస్ కార్యకర్తలు పట్టుకున్న వీడియో కూడా హల్‌చల్ చేస్తోంది.

దానికంటే ముందు.. మల్లారెడ్డి గెలుపు కోసం డబ్బులు పంపిణీ చేస్తున్న ఓ పోలీసు అధికారిని, కాంగ్రెస్ కార్యకర్తలు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న వీడియో కూడా విపరీతంగా వైరల్ అవుతోంది. సొమ్ము+సెంటిమెంటుతో పార్టీలు ఆవిధంగా ముందుకువెళుతున్నాయన్నమాట.

Leave a Reply