Suryaa.co.in

Andhra Pradesh Editorial

తెలుగుగడ్డపై తీన్‌మార్

– చిలకలూరిపేటలో చిందేసిన తెలుగుజనసైన్యం
– బొప్పూడిలో కూటమి తొలి సభ సూపర్‌హిట్
– గోదార్లయిన రాదార్లు
– జనంతో కనిపించని రోడ్లు
– 20 కిలోమీటర్ల వరకూ ట్రాఫిక్ జాం
– 15 కిలోమీటర్లు బొప్పూడికి నడిచివెళ్లిన జనం
– ట్రాఫిక్ నియంత్రణలో పోలీసుల వైఫల్యం
– ఫలించిన కూటమి నేతల కృషి
– మోదీ ప్రసంగంపై జనం నిరాశ
– జగన్‌పై దాడి చేయని వైనంపై అసంతృప్తి
– పైపై విమర్శలతోనే సరి
– మోరాయించిన మైకులతో మోదీ మూడు పోయిందన్న కమలదళాలు
– వచ్చేసారి సభల్లో పదునైన దాడి ఉంటుందన్న కమలనాధులు
– పదిలక్షలతో ప్రజాగళం దిగ్విజయం

( మార్తి సుబ్రహ్మణ్యం)

రాదార్లు గోదార్లయ్యాయి. అన్ని దారులూ బొప్పూడివైపే నడిచాయి. ఇసకేస్తే రాలనంత జనం. కిలోమీటర్ల మేర పాదయాత్రతో కార్యకర్తలు సభాస్థలికి చేరిన వైనం. ఒకటి కాదు, వందలు కాదు. దాదాపు పదిలక్షల మందితో పసుపు కూటమి సభ దిగ్విజయయిన వేళ. ఇదీ.. దాదాపు పదేళ్ల తర్వాత తెలుగుగడ్డపై ఎన్డీఏ కూటమి జనసంద్రం సాక్షిగా బిగ్గరగా వేసిన ‘తీన్’మార్!

దాదాపు పదేళ్ల తర్వాత తెలుగుగడ్డపై మూడు పార్టీల కూటమి కలిసిన అద్భుతం చిలకలూరిపేట బొప్పూడిలో ఆవిషృతమయింది. ప్రధాని నరేంద్రమోదీ పదేళ్ల తర్వాత ఎన్డీఏ కూటమి వేదికపై కనిపించారు. ఎన్డీఏ సభకు తొలి వేదిక అప్పుడు-ఇప్పుడూ గుంటూరు జిల్లానే కావడం గమనార్హం. మోదీ-బాబు-పవన్ ముగ్గురూ ఒకే వేదికపై కనిపించి పదేళ్లయింది. అయితే మోదీ గతంలో కంటే ఈసారి బాబుతో చనువుగా ఉండటం కనిపించింది.

బొప్పూడిలో ఏర్పాటుచేసిన వేదిక మైదానంలో నాలుగులక్షల మంది కనిపించగా, బయట దాదాపు 15 కిలోమీటర్ల వరకూ ఉన్న రోడ్లపై జనం నిండిపోయి కనిపించారు. దాదాపు 10 లక్షలమంది వచ్చి ఉంటారన్నది కూటమి నేతల అంచనా. అయితే జిల్లా పోలీసు యంత్రాంగం, ట్రాఫిక్ నియంత్రణలో ఘోరవైఫల్యం చెందిందన్న విమర్శలు మూటకట్టుకుంది. కావాలనే ట్రాఫిక్‌ను నియంత్రించలేదన్నది కూటమినేతల ఆరోపణ.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన దళపతి పవన్ క ల్యాణ్ ప్రసంగాలు రొటీన్‌గానే కనిపించగా.. అందరి అంచనాలు తారుమారు చేస్తూ ప్రధాని మోదీ ప్రసంగమే పేలవంగా ఉండటం, కూటమిని నిరాశకు గురిచేసింది. మోదీ ప్రసంగంలో ఏపీ మంత్రుల అవినీతిపై పొడిమాటలు మాట్లాడటం, జగన్‌పై పెద్దగా విమర్శలు లేకపోవడమే వారి నిరాశకు కారణంగా కనిపించింది. సహజంగా ఆయా విపక్ష పాలిత రాష్ట్రాలకు వెళ్లినప్పుడు మోదీ, ఆయా రాష్ట్రాల సీఎంలపై విరుచుకుపడుతుంటారు. ఏపీ పర్యటనలో కూడా మోదీ ప్రసంగం అలాగే ఉంటుందని కూటమి కార్యకర్తలు అంచనా వేశాయి.

అయితే మోదీ పదేళ్ల తర్వాత ఏపీకి వచ్చిన సందర్భంలో, కూటమి ఉమ్మడి ప్రత్యర్ధి జగన్ పాలనపై ఎలాంటి వ్యాఖ్యలు చేయకపోవడం కూటమి నేతలను విస్మయపరిచింది. నిజానికి తొలి సభ కాబట్టి.. మోదీ ప్రసంగం హెచ్చరికలతో మొదలవుతుందని కూటమి నేతలు భావించారు. పోలింగ్ రోజు డబ్బు-దౌర్జన్యంతో వైసీపీ గెలుద్దామనుకుంటోందని, బీజేపీ సహా టీడీపీ-జనసేన బహిరంగంగా ఆరోపిస్తూనే ఉంది. దానిని ప్రస్తావించడం ద్వారా, రాష్ట్రంలోని ఐఏఎస్-ఐపిఎస్ అధికారులకు.. మోదీ తన ప్రసంగం ద్వారా హెచ్చరికలు జారీ చేస్తారని కూటమి నేతలు భావించారు. ఫలితంగా అధికారులు పక్షపాతం లేకుండా పనిచేస్తారన్నది వారి అంచనా.

కానీ మోదీ తన ప్రభుత్వం ఈ ఐదేళ్లలో ఏపీకి ఇచ్చిన నిధులు-ప్రాజెక్టులే ఏకరవు పెట్టి, వైసీపీ పాలనపై పొడిమాటలు మాట్లాడటం, కూటమి నేతలకు మింగుడుపడలేదు. పైగా ఏపీలో లేని కాంగ్రెస్ గురించి మాట్లాడటం, జగన్ కాంగ్రెస్ ద్వారా ఓట్లు చీల్చే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దానితో జగన్‌ను పల్లెత్తుమాట అనని మోదీ తీరును, కమ్యూనిస్టు పార్టీ నేతలు సోషల్‌మీడియా వేదికగా విమర్శలు ప్రారంభించారు. దత్తపుత్రుడిపై ప్రేమకు ఇది నిదర్శనం అని వ్యాఖ్యానించారు.

‘టిడిపి-జనసేన ఫెయిర్‌గేమ్. వైసీపీ జగన్ ఫౌల్‌గేమ్. బీజేపీ మోదీ డబుల్ గేమ్. పిత్రవాత్సల్యం పరిళమించింది. లేని కాంగ్రెస్ మీద విమర్శలు. అరాచకం మీద తమలపాకుతో చిలకరింపు’’ అంటూ, ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.

అయితే మోదీ తన ప్రసంగంలో జగన్ పాలనకు సంబంధించి విమర్శలు చేసే ఉత్సాహంలోనే ఉన్నారని, మధ్యలో ఐదుసార్లు మైకు సరిగా పనిచేయకపోవడంతో ఆయన మూడవుట్ అయ్యారని బీజేపీ అగ్రనేతలు చెబుతున్నారు. ‘మీరన్నది నిజమే. ఆ ఫీడ్‌బ్యాక్ మాకూ వచ్చింది. అయితే జగన్ ప్రభుత్వంపై మాట్లాడేందుకు ఆయన తగిన ఫీడ్‌బ్యాక్‌తోనే ప్రిపేరయ్యారు. కానీ మధ్యలో ఐదుసార్లు మైక్ పనిచేయకపోవడంతో మూడ్‌పోయింది. మైకులు పనిచేయాలన్న సంగతి చూసుకోవాలి కదా? మోదీ సంగతి నాకు తెలుసు. మూడ్ పోతే మాట్లాడరు. కానీ అప్పుడే అయిపోలేదు కదా? ఇంకా ఏపీలో మోదీవి 7 సభలున్నాయి. అయినా ఇప్పుడే అన్నీ ఒకేసారి మాట్లాడలేరు కదా? కానీ వచ్చిన జనంతో మోదీ హ్యాపీగా ఉన్నారు. పదిలక్షల మంది ఈ సమయంలో రావడం మామూలు విషయం కాదు’’ అని బీజేపీ సీనియర్ నేత ఒకరు వ్యాఖ్యానించారు.

 

 

 

 

LEAVE A RESPONSE