రూ.5,600 కోట్లతో ఏపీలో పెట్టుబ‌డి పెడుతున్నట్టు ఆర్సెల‌ర్ మిట్ట‌ల్ ప్ర‌క‌ట‌న‌

-క‌ర్నూలు ప‌రిధిలోని ఈ ప్రాజెక్టులో రూ.4,600 కోట్ల పెట్టుబ‌డి
-విశాఖ ప్లాంట్ విస్త‌ర‌ణ‌కు రూ.1,000 కోట్లు
-గ్రీన్‌కో ప్రాజెక్టులో భాగ‌స్వామిగా ఆర్సెల‌ర్ మిట్ట‌ల్‌ 
-మొత్తంగా ఏపీలో రూ.5,600 కోట్ల‌ను పెడుతున్న‌ట్లు కంపెనీ ప్ర‌క‌ట‌న‌

ప్ర‌వాస భార‌తీయ పారిశ్రామిక‌వేత్త లక్ష్మి మిట్ట‌ల్ కుటుంబం ఆధ్వ‌ర్యంలోని ఆర్సెల‌ర్ మిట్ట‌ల్ నిప్ప‌న్ స్టీల్ ఇండియా కంపెనీ ఏపీలో పెట్ట‌నున్న రూ.3,600 కోట్ల పెట్టుబ‌డిపై బుధ‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఏపీలోని క‌ర్నూలు జిల్లా ఓర్వ‌క‌ల్లు ప‌రిధిలో ఇటీవ‌లే గ్రీన్‌కో నేతృత్వంలో ఏర్పాటైన ప్ర‌పంచంలోనే అతిపెద్ద‌దైన రెన్యూవ‌బుల్ ఎన‌ర్జీ ప్రాజెక్టులో భాగ‌స్వామిగా చేరిన‌ట్లు తెలిపింది. అందులో త‌న వాటాగా ఏకంగా రూ.4,600 కోట్ల పెట్టుబ‌డిని పెట్ట‌నున్న‌ట్లు ఆ కంపెనీ ప్ర‌క‌టించింది.

దావోస్‌లో జ‌రుగుతున్న వ‌ర‌ల్డ్ ఎక‌న‌మిక్ ఫోరం స‌ద‌స్సులో భాగంగా మంగ‌ళ‌వారం ఏపీ సీఎం జ‌గ‌న్‌తో ఆర్సెల‌ర్ మిట్ట‌ల్ కంపెనీ చైర్మ‌న్ ఆదిత్య మిట్ట‌ల్ భేటీ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ సంద‌ర్భంగా విశాఖ‌లోని త‌న ప్లాంట్ విస్త‌ర‌ణ నిమిత్తం రూ.1,000 కోట్ల పెట్టుబ‌డి పెట్టేందుకు అంగీక‌రించిన సంగ‌తి తెలిసిందే. ఈ పెట్టుబ‌డిపైనా ఆ కంపెనీ అధికారికంగా బుధవారం ప్ర‌క‌ట‌న చేసింది. ఈ రెండు పెట్టుబ‌డుల ద్వారా ఏపీలో త‌న పెట్టుబ‌డి రూ.5,600 కోట్ల‌కు చేరిన‌ట్లు ఆర్సెల‌ర్ మిట్ట‌ల్ కంపెనీ ప్ర‌క‌టించింది.

Leave a Reply