సెంట్రల్ లో రూ. 3 కోట్లతో పార్కుల అభివృద్ధి:ఎమ్మెల్యే విష్ణు

-రూ. 65 లక్షల పనులకు నగర మేయర్ తో కలిసి శంకుస్థాపన
-నగర సుందరీకరణకు పెద్దపీట: మేయర్ రాయన భాగ్యలక్ష్మి

విజయవాడ నగర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పార్కుల సుందరీకరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారిస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 36, 27, 33 డివిజన్ లలో రూ. 65.10 లక్షల
1 నిధులతో 5 ప్రధాన పార్కులలో ఓపెన్ జిమ్, వాకింగ్ ట్రాక్, ప్రహరీ గోడలు, త్రాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం వంటి పనులకు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, స్థానిక కార్పొరేటర్లతో కలిసి మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు.

నగర ప్రజలకు ఆహ్లాదంతో పాటు ఆనందాన్ని పంచే విధంగా నియోజకవర్గంలోని పార్కులను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు మల్లాది విష్ణు అన్నారు. ఇందులో భాగంగా 3 వ డివిజన్ లోని 5 పార్కులలో రూ. 65 లక్షలతో పనులు ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. చిట్టూరి విశ్వేశ్వరయ్య పార్కుకు రూ. 19.90 లక్షలు., దుర్గాపురం పార్కుకు రూ.12.70 లక్షలు., గులాబీ తోట పార్కుకు రూ. 7.90 లక్షలు., సమ్మెట రామస్వామి పార్కుకు రూ. 4.90 లక్షలు., సత్యనారాయణపురంలోని ఆంధ్రరత్న పార్కుకు రూ.19.70 లక్షల నిధులు విడుదలైనట్లు వెల్లడించారు.

మిగిలిన డివిజన్లలోనూ పార్కుల అభివృద్ధికి రూ. 75 లక్షల నిధులు మంజూరు కాగా.. రెండు రోజుల్లో పనులను ప్రారంభించడం జరుగుతుందన్నారు. వీటితో పాటుగా పార్కులలో మొక్కల ద్వారా పచ్చదనం పెంపొందించేందుకు 15వ ఆర్థిక సంఘం నిధులు మరో రూ. కోటిన్నర మంజూరైనట్లు వెల్లడించారు. స్వచ్ఛ సర్వేక్షణ్ లో మూడో స్థానంలో ఉన్న విజయవాడ నగరాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపేందుకు అహర్నిశలు కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. కరోనా తర్వాత ప్రజలందరూ వ్యాయామంపై దృష్టి పెడుతున్నారని చెప్పారు. అటువంటి వారి కోసం పార్కులలో ఓపెన్ జిమ్ సదుపాయాన్ని కల్పించడం జరుగుతోందన్నారు. దీంతో పాటు చిన్నారులను ఉల్లాస పరిచేందుకు అవసరమైన ఆట వస్తువులతో పాటు విశాలమైన వాకింగ్ ట్రాక్ లను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపారు. డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి మాట్లాడుతూ.. స్థానికులు ఉదయం సాయంత్రం వేళల్లో సరదాగా గడపడానికి దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఈ పార్కులు దోహదపడతాయన్నారు.

కార్యక్రమంలో కార్పొరేటర్లు బాలి గోవింద్, కొండాయిగుంట మల్లీశ్వరి, శర్వాణీ మూర్తి, అలంపూర్ విజయలక్ష్మి, ఇసరపు దేవి, కొంగితల లక్ష్మీపతి, ఈఈ(పార్కులు) ఏ.ఎస్.ఎన్. ప్రసాద్, ఏఈ పురుషోత్తం, ఏ.డి.హెచ్.శ్రీనివాసులు, సూపర్ వైజర్(పార్కులు) పామోజీ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply