కేసీఆర్‌ను నిల‌దీసిన ష‌ర్మిల‌

-ఇంకెంతమంది రైతులు చనిపోతే ధాన్యం కొంటారు దొరా?
-కొనుగోలు కేంద్రంలో మృతి చెందిన రైతు సిద్ధ‌రాములు
-ఘ‌ట‌న‌ను ప్ర‌స్తావిస్తూ కేసీఆర్‌ను నిల‌దీసిన ష‌ర్మిల‌
-పంటలు కొనకుండా, పాడె ఎక్కిస్తున్నారంటూ ఆవేద‌న‌
– వైఎస్ ష‌ర్మిల‌

తెలంగాణ యాసంగి ధాన్యం కొనుగోళ్ల‌కు సంబంధించి వైఎస్సార్టీపీ అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిల సీఎం కేసీఆర్‌ను నిల‌దీశారు. ఇంకెంతమంది రైతులు చనిపోతే ధాన్యం కొంటారు దొరా? అంటూ ఆమె బుధ‌వారం ట్విట్ట‌ర్ వేదిక‌గా కేసీఆర్ స‌ర్కారుపై మండిప‌డ్డారు.

రైతులు పండించిన పంట‌లు కొన‌కుండా వారినిపాడె ఎక్కేలా చేస్తున్నారంటూ ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఆఖరి గింజ వరకూ కొంటానని రైతుల గుండెలు ఆగిపోయేలా చేస్తున్నారంటూ ఆమె మండిప‌డ్డారు. వానాకాలం పంటలు వేసుకోవడానికి రైతులు పొలాల బాట పట్టాల్సి ఉన్నా, మీరు వడ్లు కొనక కల్లాల్లోనే రైతును పడి గాపులు కాయిస్తున్నారంటూ ఆరోపించారు.

పంజాబ్ రైతుల చావులు క‌న‌ప‌డ్డ కేసీఆర్‌కు తెలంగాణ రైతుల చావు కేక‌లు వినిపించ‌డం లేదా? అని ష‌ర్మిల ప్ర‌శ్నించారు. ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల‌కు తీసుకొచ్చిన రైతులు ప‌ది రోజులుగా ప్ర‌భుత్వం కొంటుందో, లేదో తెలియ‌క కొనుగోలు కేంద్రాల్లోనే ప‌డిగాపులు కాస్తున్నార‌ని ఆమె ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

ఈలోగా వ‌ర్షం వ‌స్తే ఆరుగాలం పండించిన పంట నీటి పాల‌వుతుంద‌న్న ఆవేద‌న‌తో సిద్ధ‌రాములు అనే రైతు గుండె ఆగింద‌ని ఆమె తెలిపారు. ఈ మాదిరిగా ఇంకెంత మంది రైతులు చ‌నిపోతే ధాన్యం కొంటారంటూ ఆమె కేసీఆర్ స‌ర్కారును నిల‌దీశారు. ఈ మేర‌కు సిద్ధరాములు మృతిపై వ‌చ్చిన వార్త‌ను ఆమె త‌న ట్వీట్‌కు ట్యాగ్ చేశారు.

Leave a Reply