జగన్ బాణం రివర్స్

– జగనన్న కి షర్మిల షాక్
– కాంగ్రెస్ లో చేరిన వెంటనే అన్నకి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్న షర్మిల
– ఇప్పటికే అమరావతికి జై కొట్టిన కాంగ్రెస్ పార్టీ
– కాంగ్రెస్ లో చేరిన వెంటనే తన ముఖ్య అనుచరుడు ఆళ్ల రామకృష్ణా రెడ్డి అమరావతి పై వేసిన కేసులు విత్ డ్రా చేయించనున్న షర్మిల

జగనన్న వదిలిన బాణం రివర్స్ అయ్యింది. అన్నకి భారీ షాక్ ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నది. ఇంతకాలం మూడు రాజధానుల పేరుతో జగనన్న మూడు ముక్కలాట ఆడిన విషయం అందరికీ విదితమే. అయితే జగన్ అమరావతి రాజధానిని నాశనం చెయ్యడంలో వెనుక కీలక పాత్ర పోషించింది మాత్రం మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి.

విధి వెంటాడిందో, రైతుల ఉసురు తగిలిందో జగన్ ఆర్కే కి సీటు లేదంటూ ఛీ కొట్టడం అతను ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చెయ్యడం అంతా చకచకా జరిగిపోయాయి. ప్రకృతి సమాధానాలు చాలా వింతగా ఉంటాయి. కాలం గిర్రున తిరిగింది. ఏ “ఆళ్ల రామకృష్ణా రెడ్డి” అయితే అమరావతి పై విషం కక్కాడో ఇప్పుడు అదే ఆర్కే తో ఆ
రాజధాని కేసులు ఉపసంహరించుకునేలా చేసింది ప్రకృతి.

అన్న కి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ప్రక్రియలో చెల్లి షర్మిల రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోనుంది. అయితే ఇక్కడే ఒక చిన్న చిక్కుముడి ఏర్పడింది. కాంగ్రెస్ ఏపీకి ఇచ్చిన ముఖ్యమైన హామీల్లో ప్రత్యేకహోదా తో పాటు అమరావతి రాజధాని అంశం కూడా కీలకమైంది.

ఇప్పటికే షర్మిల తోనే నా రాజకీయ జీవితం అని మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ఊపిరి పీల్చుకోవాలి అంటే జాగ్రత్తగా అడుగులు వెయ్యాలి అని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. విమర్శలకు అవకాశం లేకుండా రాజకీయ ఎత్తుగడ ఉండాలని నిర్ణయించుకుంది.

అందులో భాగంగా షర్మిల తో పాటు కాంగ్రెస్ లో రావాలి అనుకునే వారికి కొన్ని కండిషన్స్ పెడుతుంది. అందులో ప్రధానమైన కండిషన్ ఆర్కేకి పెట్టినట్టు సమాచారం. ఒక పక్క మనం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అంటూ అమరావతికి బద్ద వ్యతిరేకిగా వ్యవహరించిన ఆర్కే ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంటే అసలుకే మోసం వస్తుందని కాంగ్రెస్ అధిష్టానం షర్మిలకు రాయబారం పంపినట్టు సమాచారం. అందుకు వెంటనే స్పందించిన షర్మిల ఆర్కే తో సంప్రదించి తమ నిర్ణయాన్ని అధిష్టానానికి తెలియజేసారు. తాను కాంగ్రెస్ లో చేరిన వెంటనే ఆర్కే అమరావతికి వ్యతిరేకంగా వేసిన అన్ని కేసులు విత్ డ్రా చేసుకుంటారు అని, అంతే కాదు ఆ ప్రక్రియ పూర్తి అయిన తరువాతే అతన్ని పార్టీలోకి తీసుకుంటాం అని అధిష్టానం కి వర్తమానం పంపింది.

అలా చేస్తే కాంగ్రెస్ పట్ల ప్రజల్లో కొంతమేర సానుకూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది అని కాంగ్రెస్ పెద్దల అభిప్రాయం. ఏదేమైనా విధి విచిత్రమైంది. అమరావతికి మరణం లేదని రుజువు అయ్యింది. ఏ కుటుంబం అయితే కేసులు వేసి రాజధాని నిర్మాణం అడ్డుకుందో అదే కుటుంబంతో ఆ కేసులు వెనక్కి తీసుకునేలా ప్రకృతి సమాధానం చెప్పడం విశేషమే. ఏది ఏమైనా అమరావతి రాజధానిగా స్థిరపడడం తద్వారా భూమి ఇచ్చిన రైతుల కు న్యాయం జరగడం తద్వారా రాష్ట్రాభివృద్ధి చెందడం ఆచరణలోకి రావాలి.

– రమణ

Leave a Reply