Suryaa.co.in

Editorial

బలిపశువు..రఘురామరాజు

-నర్సాపురం టికెట్ దక్కని ఎంపీ రాజు
– చక్రం తిప్పిన సీఎం జగన్?
– వైసీపీ కోవర్టులతో కొత్త పేరు
– ఎవరికీ తెలియని శ్రీనివాసవర్మ పేరు తెరపైకి
– ఐబీ నివేదికలు ఉత్తిదేనంటున్న బీజేపీ నేతలు
– రాజు ఇంటికి పోటెత్తిన అభిమానులు
– వెల్లువెత్తిన సానుభూతి
– బీజేపీ- జగన్ ఒకటేనని విమర్శలు
– బీజేపీని గుడ్డిగా నమ్మారని సానుభూతి
– ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని కొందరు
– కాంగ్రెస్ నుంచి పోటీ చేయాలని మరికొందరు
– కూటమికి బుద్ధి చెప్పాల్సిందేనని ఆవేశం
– స్టార్ క్యాంపెయినర్‌గా కూటమికి ప్రచారం చేయాలని మరికొందరి సూచన
– వారించలేక రాజు అవస్థలు
– సోషల్‌మీడియాలో తప్పుడు సంకేతాలు
– జగన్‌కు మోదీ మద్దతునిస్తున్నారంటూ కథనాలు
– రాజుకు టికెట్ ఇవ్వని ప్రభావం కూటమిపై ఉంటుందని స్పష్టీకరణ
– సోము వీర్రాజు వల్లే టికెట్ దక్కలేదని రాజు వీడియో
– తాను తాత్కాలికంగా ఓడిపోయానంటూ రాజు ఆవేదన
– విజయనగరం టీడీపీ అభ్యర్ధిగా పరిశీలన?
-రఘురామకృష్ణంరాజుకు వెల్లువెత్తుతున్న సానుభూతి
(మార్తి సుబ్రహ్మణ్యం)

మూడున్నరేళ్ల క్రితం నాటి ముచ్చట. జగన్ సర్కారును విమర్శించాలంటే వణికిపోయిన రోజులవి. చిన్నపాటి పోస్టులు పెట్టినా..వాటిని ఫార్వార్డ్ చేసినా.. కామెంట్లుపెట్టినా.. సీఐడీ పోలీసులు పంచకల్యాణి గుర్రం కంటే వేగంగా పరుగులుపెట్టి, వారిపై కేసులు పెట్టే భయానక పరిస్థితి. ప్రతిపక్ష నేతలంతా బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో వ్యాపారాలు చేసుకుంటున్న కాలమది. చివరాఖరకు డీజీపీ ఆఫీసుకు కూతవేటు దూరంలోఉన్న టీడీపీ ప్రధాన కార్యాలయంపై రాడ్లు, కర్రలతో దాడులకు దిగినా తిప్పికొట్టలేని నిస్సహాయ స్థితి.

ఆ సమయంలో నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు, తన సొంత పార్టీ అధినేత-సీఎం జగన్‌పై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. జగన్‌ను నేరుగా సవాల్ చేయడం ప్రారంభించారు. రాష్ట్రం-దేశాన్ని ఏకం చేస్తూ, జగన్ సర్కారుపై ఒంటరి సైనికుడిలా యుద్ధం ప్రకటించారు. జగన్ సర్కారు నిర్ణయాలను ప్రశ్నిస్తూ కేంద్ర సంస్థలకు లేఖాస్త్రాలు సంధించారు. కేంద్రమంత్రులను కలసి, ఏపీలో జగన్ అరాచ క పాలనను సాక్ష్యాలతో బట్టబయలు చేశారు. లోక్‌సభలో తన వాణి వినిపించారు.

ప్రధానంగా.. ప్రతిరోజు రచ్చబండ పెట్టి, జగన్ సర్కారును చాకిరేవు పెట్టడం ప్రారంభించారు. ఢిల్లీలో అమరావతి రైతుల ఆందోళనకు ఆయనే ఆశ్రయమిచ్చారు. అమరావతి ఒక్కటే కాదు. ఢిల్లీ వేదిక జగన్ సర్కారుకు ఎవరు గళం విప్పినా, ఢిల్లీలో రాజునే వారికి ఆతిధ్యమిచ్చేవారు. ఆరకంగా ఏపీలో జగన్ ప్రభుత్వ వ్యతిరేకతను పెంచేందుకు, రఘురామకృష్ణంరాజు ఆద్యుడయ్యారన్నది మనం మనుషులం అన్నంత నిజం. ఆయన తిరుగుబాటు తర్వాతనే జగన్ ప్రత్యర్ధులకు తెగింపు వచ్చింది. ఆ సమయంలో పవన్ షూటింగులు చేసుకుంటూ, మధ్యలో ఏపీపై దృష్టిపెట్టేవారు. ఇక టీడీపీ నియోజకవర్గ నేతలు, మాజీ మంత్రులంతా హైదరాబాద్, బెంగూరు,చెన్నైలోవ్యాపారాలు చేసుకునేవారు.
నియోజకవర్గ ఇన్చార్జి పదవులిస్తామన్నప్పటికీ, తమకు వద్దని తప్పించుకునే కాలమది.

ఆ సమయంలోనే ఎంపి రాజు తిరుగుబాటు విపక్షాల్లో కొండంతధైర్యం ఇచ్చింది. అది జగన్‌ను ఢీకొంటున్న టీడీపీ-జనసేనకు స్పూర్తిగా మారింది. దానితో వారు కూడా రాజు వాదనను అంగీకరించారు. ఆయనను సమర్ధించడం ప్రారంభించారు. రాజును అక్రమంగా అరెస్టు చేసినప్పుడు విపక్షాలంతా ఆయనకు అండగా నిలిచారు. ప్రదానంగా చంద్రబాబు ఆయనకు నైతిక మద్దతునిచ్చారు. అర్ధరాత్రి సైతం రాజు కుటుంబసభ్యులకు ఫోన్లు చేసి ధైర్యం చెప్పారు. అప్పటినుంచి.. ఢిల్లీలో రఘురామకృష్ణంరాజు.. గల్లీలో చంద్రబాబునాయుడు-పవన్..ముగ్గురూ జగన్ సర్కారుపై చెలరేగిపోయారు.

టీడీపీ-బీజేపీ-జనసేన కూటమి ఏర్పడుతుందని అందరికంటే ముందు జోస్యం చెప్పిన నేత రఘురామరాజు. దానికోసం ఆన తన వంతు కృషి చేశారు. కూటమి సభలో కూడా ఆయన ప్రసంగించారు. తాను కచ్చితంగా కూటమి అభ్యర్ధి అవుతానని, నర్సాపురంనుంచి తాను పోటీ చేయకుండా జగన్ కుట్రలు చేసినా ఫలించవని రాజు బహిరంగంగానే వ్యాఖ్యానించారు. దమ్ముంటే అడ్డుకోమని సవాల్ విసిరారు.

అయితే.. ఆ విషయంలో జగన్ గెలిచి, రఘురామరాజు ఓడిపోయారు. వైసీపీలోని బీజేపీ కోవర్టుల సాయంతో, రఘురామరాజుకు నర్సాపురంఎంపీ సీటు రాకుండా చేయడంలో, జగన్ విజయం సాధించారు.ఆ విషయంలో తాను ఓడిపోయానని, సోము వీర్రాజు ద్వారా తనకు టికెట్ రాకుండా చేశారని రఘురామజు నిజాయితీగా తన ఓటమి ఒప్పుకోవడం విశేషం.

నిజానికి కొంతకాలం నుంచీ రఘురామకృష్ణంరాజుకు ఎన్డీఏ కూటమి టికెట్ ఇవ్వదన్న ప్రచారం, వైసీపీ వర్గాల్లోబలంగా వినిపించింది. ఆ మేరకు జగన్ బీజేపీ అన్రేతల వద్ద హామీ తీసుకున్నారని, బీజేపీ సైతం ఆ మేరకు జగన్‌కు హామీ ఇచ్చిందన్న ప్రచారం జరిగింది. తొలుత ఆ ప్రచారాన్ని ఎవ రూ నమ్మలేదు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నద్దా సహా బీజేపీ, ఆరెస్సెస్ అగ్రనేతలు టికెట్‌పై రాజుకు భరోసా ఇచ్చారు. దానిని నమ్మి మోసపోయిన రాజు.. చివరకు బలిపశువయ్యారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అయితే రఘురామరాజుకు బీజేపీ టికెట్ ఇవ్వలేదని తెలియడంతో.. ఆయన అభిమానులు, వైసీపీ వ్యతిరేక వర్గాలు సోషల్‌మీడియాలో ఎన్డీఏ వ్యతిరేక వ్యాఖ్యలతో మోత మోగిస్తున్నారు. ఐబీ రిపోర్టులు ఉత్తదే. మోదీకి జగన్ దత్తపుత్రుడని తేలింది. ఏపీలో పొత్తు చంద్రబాబును గెలిపించడంకోసం కాదు. జగన్‌ను మళ్లీ సీఎంను చేసేందుకేనని స్పష్టమయింది. బీజేపీ కోరుతున్న సీట్లు కూడా వాళ్లు గెలవాడికి కాదు. వైసీపీని గెలిపించడానికేనని అర్ధమవుతుంది. ఈసీ కూడా మౌనంగా ఉంది. ఇప్పటిదాకా ఒకక అధికారిపైనా చర్యలు తీసుకోలేదు. అదే బెంగాల్‌లో డీజీపీని బదిలీ చేశారు. చిలకలూరిపేటకు వచ్చిన మోదీ జగన్‌ను పల్లెత్తు మాట అనలేదు. బీజేపీకి జగన్ కావాలి. చంద్రబాబు కావాలి. రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీ-జగన్ చీకటి ఒప్పందం తెలిసిపోయిందంటూ కామెంట్లు పెడుతున్నారు.

కాగా రాజుకు బీజేపీ సీటు ఇవ్వలేదని తెలియడంతో ఆయన అభిమానులు, సీబీఎన్ ఆర్మీ, ప్రధానంగా మహిళలు ఆయన నివాసానికి పెద్ద సంఖ్యలో తరలివవస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగులు, ప్రధానంగా మహిళా సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు రాజు ఇంటికి భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇటీవల చంద్రబాబు అరెస్టయినప్పుడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు నిర్వహించిన ఆందోళన కార్యక్రమాలకు, రాజు స్వయంగా హాజరయిన విషయం తెలిసిందే.

ఆ సందర్భంగా రాజును కలిసి, తమ సానుభూతి ప్రకటించిన ఐటీ ఉద్యోగులు.. బీజేపీ నమ్మించి మోసంచేస్తుందని అనుకోలేదని కొందరు, కూటమి ఇంత వైఫల్యం చెందుతుందని అనుకోలేదని మరికొందరు వ్యాఖ్యానించారు. అయితే మరికొందరు మాత్రం ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని సూచించగా, ఇంకొంతమంది మాత్రం టీడీపీ మీకు విజయనగరం సీటు ఇస్తుందని భరోసా ఇచ్చారు. మీరు చంద్రబాబుతో ఒకసారి మాట్లాడాలని వారు సూచించారు. ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తే సింబల్ సమస్య వస్తుంది కాబట్టి.. కాంగ్రెస్‌లో చేరి, అక్కడినుంచేపోటీ చేస్తే తామంతా వచ్చి ప్రచారం చేస్తామని భరోసాఇచ్చారు.

ఈ పరిస్థితిలో మీకు ఒక జాతీయ పార్టీ అండ అవసరమనిమరికొందరు విశ్లేషించారు. మీరు కాంగ్రెస్‌లో చేరితే బీజేపీ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. అయినా సరే మీరు ఇప్పుడున్న పరిస్థితిలో మీకు కాంగ్రెస్‌లో చేరడమే పరిష్కారమని మహిళాఐటీ ఉద్యోగులు స్పష్టం చేశారు. దానితో వారిని సముదాయించలేక రాజుకు తలప్రాణం తొకకొచ్చినట్టయింది.

అయితే రెండురోజుల్లో తాను నిర్ణయం తీసుకుంటానని వారికి చెప్పాల్సివచ్చింది. రచ్చబండ ద్వారా రోజూ జగన్ సర్కారున చాకిరేవు పెట్టడం ద్వారా లభించిన ఆ పాపులారిటీనే, రఘురామకృష్ణంరాజుకు ఈ స్థాయిలో ఇమేజ్ వచ్చేందుకు కారణమయింది. ఒకవేళ ఆయనకు కూటమి టికెట్ ఇవ్వకపోతే.. అది దాని విశ్వసనీయతకే ప్రమాదం తెచ్చే అవకాశం ఉందన్న హెచ్చరికలు సోషల్‌మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.

LEAVE A RESPONSE