Suryaa.co.in

Editorial

పొత్తు పనిచేస్తోందా?

– బీజేపీని పూర్తిగా నమ్మవచ్చా?
– ఐఏఎస్,ఐపిఎస్‌లపై ఫిర్యాదులిచ్చినా ఫలితం శూన్యం
– ఇప్పటికీ చర్యల కొరడా ఝళిపించని ఈసీ
– లోకేష్‌ను ఒకేరోజు నాలుగుసార్లు ఆపిన పోలీసులు
– ఒక్క మంత్రి వాహనాన్నీ ఆపని వైచిత్రి
– వాలంటీర్లపై వేటుతో కంటితుడుపు చర్యలు
– ఎంపి రాజుకు టికెట్ ఇవ్వని బీజేపీ తీరుపై మరిన్ని అనుమానాలు
– జగన్‌పై యుద్ధం ప్రకటించిన తొలి తిరుగుబాటుదారుడు రాజు
– దానితో జగన్ బీజేపీ ఒకటేనంటూ సోషల్‌మీడియాలో దుమారం
– సోషల్‌మీడియాలో రాజుకు వెల్లువెత్తుతున్న సానునూతి
– ఇప్పటిదాకా బీజేపీని విమర్శించని జగన్ అండ్ కో
– వైసీపీ విమర్శలన్నీ టీడీపీ-జనసేనకే పరిమితమా?
– బీజేపీ ఓడిపోయే సీట్లు తీసుకుందంటూ అనుమానపు కోణం
– జగన్‌ను సీఎంను చేసేందుకే బీజేపీ పొత్తంటూ భిన్న కథనాలు
– కూటమిలో కమలం పాత్రపై చర్చ
(మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో జతకట్టిన ఎన్డీఏ కూటమి అనుకున్న లక్ష్యం సాధిస్తుందా? అసలు బీజేపీ మనస్ఫూర్తిగానే కూటమిలో చేరిందా? బీజేపీ లక్ష్యం బాబును సీఎంను చేయడమా? లేక జగన్‌ను మళ్లీ సీఎం చేయడమా? నిజంగా బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే ఈసీ మౌనంగా ఎందుకు ఉంటుంది? బీజేపీపై జగన్ ప్రభావం లేకపోతే.. ఎంపి రఘురామకృష్ణంరాజుకు కాకుండా, ఎవరూ అనుకోని శ్రీనివాసవర్మ హటాత్తుగా ఎలా తెరపైకి వచ్చారు? లోకేష్‌ను ఒకేరోజు పోలీసులు నాలుగుసార్లు ఎలా ఆపి తనిఖీలు చేస్తారు? టీడీపీ-జనసేనపై ఒంటికాలితో లేస్తున్న జగన్ అండ్ కో ..కూటమిలో ఉన్న బీజేపీని పల్లెత్తుమాట ఎందుకు అనడం లేదు? జిల్లా ఎస్పీలు, ఐపిఎస్-ఐఏఎస్ ప్రముఖులపై ఈసీకి ఇచ్చిన ఫిర్యాదులపై స్పందన లేకపోవడానికి కారణమేమిటి? ఇంతకూ కూటమి ఎవరిపై యుద్ధం చేస్తోంది? అసలు ఎన్నికల్లో బీజేపీ పాత్రేమిటి?.. ఇదీ ఇప్పుడు సోషల్‌మీడియా వేదికగా జరుగుతున్న సీరియస్ చర్చ.

ఎన్డీఏ కూటమి ఆవిర్భవించముందు.. రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన చర్చ జరిగింది. కూటమిలో బీజేపీ ఉన్నందున.. అధికారుల ఆటలు సాగవన్న అంచనా వ్యక్తమయింది. జగన్ ప్రభావిత అధికారులు విధిలేక మౌనం వహించక తప్పదని, ఎన్నికల ప్రక్రియలో ప్రత్యక్ష పాత్ర వహించే జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఎస్పీలు, ఐజీలు, డీఐజీలు.. బీజేపీ భయానికి నిష్పక్షపాతంగా వ్యవహరిస్తారని భావించారు. దానికితోడు మోదీ-అమిత్‌షా వంటి అగ్రనేతలు రాష్ట్రానికి వచ్చే అవకాశం ఉన్నందున, డీజీపీ-ఇంటలిజన్స్, సీఎస్, ఇతర ఉన్నతాధికారులను గత ఎన్నికల్లో మాదిరిగా ఎన్నికల విధుల నుంచి తప్పిస్తారన్న భావన కనిపించింది.

అయితే ప్రధాని మోదీ చిలకలూరిపేటలో జరిగిన కూటమి తొలి సభకు వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు.. దానిపై ఈసీ నిస్సారమైన స్పందన, ఎస్పీలపై ఇచ్చిన ఫిర్యాదుకు వాయువేగంతో స్పందించని ఈసీ తీరు, బీజేపీ వైఖరిపై అనుమానం రేపేందుకు కారణమయింది. మోదీ సభలో ట్రాఫిక్ వైఫల్యంపైనే ఇప్పటిదాకా చర్యల కొరడా ఝళిపించని ఈసీ.. ఇక రాబోయే రోజుల్లో కూటమి ఫిర్యాదులకు స్పందిస్తుందనుకోవడం, భ్రమేనన్న అభిప్రాయం కూటమిలో ఏర్పడింది.

చివరకు రాష్ట్ర బీజేపీ నేతలు సైతం ఈసీ నిరాసక్త వైఖరిపై విస్మయం వ్యక్తం చేస్తుండటం విశేషం. ఎందుకంటే ఈసీని కలిసి ఫిర్యాదులు చేస్తున్న వారిలో, బీజేపీ నేతలు కూడా ఉండటమే దానికి కారణం. కోడ్ అమలులోకి వచ్చిన వెంటనే, బెంగాల్‌లో డీజీపీని మార్చిన ఈసీ.. ఏపీలోమాత్రం ఇన్చార్జి డీజీపీగా ఉన్న అధికారిపై కూటమి ఫిర్యాదు చేసినా ఇప్పటిదాకా స్పందించకపోవడం, ఈ అనుమానాలను మరింత బలపరిచింది.

తాజాగా మంగళగిరి టీడీపీ అభ్యర్ధి నారా లోకేష్ వాహనాన్ని, ఒకేరోజు నాలుగుసార్లు ఆపి తనిఖీలు చేయడం కూటమి నేతలను విస్మయపరిచింది. తనిఖీలు చేయడం సహజయినప్పటికీ.. ఒకే నేత కారును ఒకేరోజు నాలుగుసార్లు తనిఖీ చేయడంతో… పోలీసులు ఇంకా వైసీపీ ప్రభావ ంతోనే పనిచేస్తున్నారని, ఈసీ మౌనమే దీనికి ప్రధాన కారణమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. మంత్రుల వాహనాలను ఆపని పోలీసులు లోకేష్‌ను లక్ష్యంగా చేసుకోవడంపై సహజంగానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఫిర్యాదులపై శరవేగంగా చర్యలు తీసుకోని ఈసీ ముఖేష్‌కుమార్‌మీనాను తప్పించాలన్న అభిప్రాయం కూటమి నేతల్లో వ్యక్తమవుతోంది. కోడ్ వచ్చి… తనకు విస్తృత అధికారాలు ఉన్నప్పటికీ, ఫిర్యాదులపై చర్యలు తీసుకోని అధికారి వల్ల ఫలితం ఏమిటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.

కాగా రాష్ట్రంలో జగ న్‌పై వ్యక్తిగతంగా, సంస్థాగతంగా తొలుత యుద్ధం ప్రకటించి.. కూటమి కోసం కృషి చేసిన నర్సాపురం ఎంపి రఘురామకృష్ణంరాజును కాదని, ఎవరికీ పెద్దగా తెలియని శ్రీనివాసవర్మకు టికెట్ ఇవ్వడంపై, సోషల్‌మీడియా కోడై కూస్తోంది. అటు రాజు సైతం.. బీజేపీ మాజీ అధ్యక్షుడు సోమువీర్రాజు తనకు సీటు రాకుండా అడ్డం పడి, శ్రీనివాసవర్మకు ఇప్పించారని నేరుగానే ప్రకటించారు.

తాను జగన్ చేతిలో పరాజయం పాలయ్యానని అంగీకరించిన రాజుకు, రాష్ట్రవ్యాప్తంగా సానుభూతి వెల్లువెత్తుతోంది. కూటమి ఆయనను సొంతం చేసుకోవడంలో విఫలమయిందని కొందరు.. కూటమిని నమ్మి జగన్‌పై యుద్ధం చేసిన రాజు బలిపశువయ్యారని మరికొందరు.. రాజు లాంటి నేతకే విశ్వసనీయత కల్పించలేని కూటమిని, ప్రజలు ఎందుకు గెలిపిస్తారని ఇంకొందరు విరుచుకుపడుతున్నారు.

నిజానికి ఎంపీ రాజు చాలాకాలం నుంచి తనకు నర్సాపురం టికెట్ రాకుండా జగన్ అడ్డుపడుతున్నా, తాను కూటమి అభ్యర్ధిగానే బరిలోకి దిగుతానని సవాల్ చేశారు. జగన్‌కు దమ్ముంటే తనకు టికెట్ రాకుండా ఆపమని సవాల్ చేశారు. అయితే జగన్ అనుకున్నట్లే జరిగింది. రాజు సవాల్‌ను సీరియస్‌గా స్వీకరించిన జగన్.. బీజేపీలోని తన వేగులతో ఆయనకు టికెట్ చూడటంలో, విజయం సాధించారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అయితే బీజేపీ సభ్యుడు కాని రాజుకు, అసలు బీజేపీ సీటు ఇస్తారు? ఈ విషయంలో ఆయనకు బీజేపీ చేసిన అన్యాయం ఏమిటన్న ప్రశ్నలు, వైసీపీ సోషల్‌మీడియా సైన్యం ప్రచారంలో పెట్టింది. సాంకేతికంగా అది నిజమే అయినప్పటికీ..ఒప్పందంలో భాగంగా రాజుకు బీజేపీ సీటు ఇవ్వాలని, టీడీపీ-జనసేన ఉమ్మడిగా బీజేపీ నాయకత్వానికి అంత ర్గతంగా సూచించాయి.

అందుకే నర్సాపురం సీటును బీజేపీకి కేటాయించింది. రాజు కోసమే ఆ సీటును, రెండు పార్టీలు బీజేపీకి కేటాయించాయి. అయితే వాటి అంచనాలు తారుమారు చేస్తూ, రాజుకు బదులు శ్రీనివాసవర్మకు కేటాయించడంతో, టీడీపీ-జనసేన షాక్‌కు గురయ్యాయి. ఎవరికి సీటివ్వాలన్నది బీజేపీ నిర్ణయం కాబట్టి మిగిలిన రెండు పార్టీలు మౌనంగా ఉన్నాయి. దీనితో బీజేపీ-జగన్ బంధం బట్టబయలయిందన్న చర్చకు సహజంగానే తెరలేచింది. ఇలాంటి నియోజకవర్గాలు కొన్ని ఇచ్చేస్తే, అక్కడ వైసీపీ విజయం ఖాయమని, అందుకోసమే తెరవెనుక రాజకీయం జరుగుతోందన్న అనుమానాలు చర్చలోకి వచ్చింది.

సరే.. రాజుకు ఇప్పుడు ఏపార్టీ సీటు ఇస్తుంది? టీడీపీ ఇస్తుందా? లేక ఇండిపెండెంట్‌గా పోటీ చేస్తారా? లేక జాతీయ పార్టీ కాబట్టి కాంగ్రెస్‌లో చేరి తన పంతం నెగ్గించుకుంటారా? ఇవేమీ కాకపోతే కూటమి కోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేసి జగన్‌పై తన కసి తీర్చుకుంటారా? అదీ కాకపోతే ఎమ్మెల్యే సీటు తీసుకుని సర్దుకుపోతారా అని పక్కనపెడితే… బీజేపీపై జగన్ ప్రభావం ఇంకా పనిచేస్తోందని, వారిద్దరి బంధం ఇంకా కొనసాగుతోందనడానికి ఇదో నిదర్శనమంటూ, సోషల్‌మీడియాలో కథనాలు వెల్లువెత్తుతున్నాయి.

రోజూ జగన్‌పై యుద్ధం చేసే రాజు.. అసలు తెరవెనుక ఏం జరుగుతుందో తెలుసుకోకపోవడమే వింతగా ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. కూటమిని రాజు గుడ్డిగా నమ్మారని కొందరు.. జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకతను పోగు చేసిన రాజును, కూటమి వాడుకుని వదిలేసిందని మరికొందరు సోషల్‌మీడియాలో పోస్టింగులు పెడుతున్న పరిస్థితి.

ఆయన బీజేపీలో చేరతానని ముందుకువచ్చినా, స్పందించకపోవడానికి జగన్ ఒత్తిళ్లే పనిచేశాయా? తాజా పరిణామాలు పరిశీలిస్తే.. అసలు బీజేపీ ఎవరి కోసం పనిచేస్తోంది? జగన్‌ను మళ్లీ సీఎంను చేసేందుకా? లేక చంద్రబాబును సీఎం చేసేందుకా అన్న చర్చ మొదలయింది. నిజంగా రాష్ట్రంలో బీజేపీ తనకు కేటాయించిన స్థానాల్లో గెలిచే పట్టుదల ఉంటే.. గెలుపుగుర్రాలనే బరిలో దింపేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

గెలిచే స్థానాలు తీసుకోకపోవడం.. వైసీపీని అన్ని రంగాల్లో ఎదుర్కొనే సత్తా ఉన్న నేతలను అభ్యర్ధులుగా ప్రకటించకపోవడం.. బలమైన రఘురామకృష్ణంరాజు వంటి నేతనే పక్కనపెట్టడం బట్టి.. బీజేపీ ఎవరిని గెలిపించేందుకు ప్రయత్నిస్తోందన్న ఆసక్తికరమైన చర్చ, సోషల్‌మీడియా వేదికగా జరుగుతోంది.

అటు ఈ అనుమానాలు నిజం చేస్తూ.. టీడీపీ-జనసేనను లక్ష్యంగా చేసుకుని విమర్శిస్తున్న వైసీపీ.. ఇప్పటిదాకా బీజేపీని పల్లెత్తుమాట అనకపోవడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. కూటమిలో బీజేపీ కూడా ప్రధాన పార్టీ. పైగా జాతీయ పార్టీ. బీజేపీ రాష్ట్ర నేతలు రోజూ వైసీపీ పాలనను దుమ్మెత్తిపోస్తున్నారు. టీడీపీ-జనసేనతో కలసి ఈసీకి ఫిర్యాదులిస్తున్నారు. ఆ ప్రకారంగా తనకు వ్యతిరేకంగా జతకట్టిన టీడీపీ-జనసేనతో ఉన్న బీజేపీని కూడా వైసీపీ విమర్శించాలి. కానీ ఇప్పటిదాకా బీజేపీని వైసీపీ ఒక్కమాట అనకపోవడం… ఎలాంటి సంకేతాలు పంపిస్తున్నాయో అర్ధం చేసుకోలేనంత అమాయకులు ఎవరూ లేరన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.

అసలు బీజేపీ జగన్‌ను సీఎంను చేసేందుకే కూటమిలో చేరిందా? చంద్రబాబు-జగన్ ఎవరు సీఎం అయినా, ఇద్దరూ తమతోనే ఉంటారన్న ధీమాతో ఏపీని లైట్ తీసుకుంటోందా? జగన్ తమకు దత్తపుత్రుడన్న కేంద్ర ఆర్ధిక శాఖమంత్రి నిర్మలాసీతారామన్ వ్యాఖ్యల ఆంతర్యం ఇదేనా? ఇప్పటివరకూ ఒక్క అధికారిపై ఈసీ చర్యలు తీసుకోని నిర్లిప్తత, దేనికి సంకేతాలంటూ సోషల్‌మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

LEAVE A RESPONSE