అవినీతి రాం’బాంబు’

రాష్ట్ర నీటిపారుదల శాఖా మంత్రి,సత్తెనపల్లి వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబును అవినీతి నీలినీడలు వెంటాడుతున్నాయి. నిన్న భారీ స్థాయిలో చీరల పంపిణీతో ప్రలోభాలకు తెరతీసి తీవ్ర విమర్శలు మూటగట్టుకున్న మంత్రి అంబటికి సంబంధించి రోజుల వ్యవధిలోనే మరో అవినీతి భాగోతం బైటపడింది.సాక్షాత్తూ తమ సొంత పార్టీ కార్యాలయం నిర్మాణం విషయంలోనే మంత్రి అంబటి లంచాలు మింగారంటూ ఆ పార్టీ నేతే ఆరోపించడం కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే..వైసిపి నకరికల్లు సీనియర్ కార్యకర్త, తాపీ మేస్త్రి అయిన బద్ధుల నాగేశ్వరరావు మాట్లాడుతూ సత్తెనపల్లిలో వైసీపీ నూతన కార్యాలయం కట్టమని ఐదేళ్ల క్రితం మంత్రి అంబటి తనను సంప్రదించారని, ఆ మేరకు పని పూర్తి చేసినా డబ్బులు ఇవ్వకుండా అనేక ఇబ్బందులు పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యాయం కోసం ఏడు లక్షల రూపాయల పనులు చేస్తే, ఆ డబ్బుల కోసం ఎన్నోసార్లు తిరిగిన తర్వాత ఏడు లక్షలకు గాను కేవలం నాలుగు లక్షలు మాత్రమే తనకు ఇచ్చారన్నారు. మిగిలిన మూడు లక్షలు అడుగుతుంటే సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆ డబ్బును తాను కూలీలకు ఇవ్వాల్సివుండగా, వారు కూలి డబ్బులు కోసం తన ఇంటికి వచ్చి గొడవ పెట్టుకుంటున్నారని వాపోయారు.మంత్రి అంబటి ఇప్పటికైనా తనకు రావాల్సిన డబ్బు చెల్లించి, న్యాయం చేయాలని నకరికల్లు వైసీపీ సీనియర్ కార్యకర్త తాపీ మేస్త్రి బద్ధుల నాగేశ్వరరావు వేడుకున్నారు.లేనిపక్షంలో వైసీపీ పెద్దలైనా కలగజేసుకొని తన డబ్బులు తనకు ఇప్పించి న్యాయం చేయమని కోరారు.

Leave a Reply