Suryaa.co.in

Andhra Pradesh

నాలుగుసార్లు లోకేష్‌ను కాన్వాయ్‌ను తనిఖీ చేయడం ప్రత్యేకంగా టార్గెట్ చేయడం కాదా?

– ఇప్పటికీ మంగళగిరిలో జగన్ రెడ్డి బొమ్మలు ఎన్నికల నియమావళికి విరుద్దంగా ఉన్నా ఎందుకు తొలగించలేదు?
– వైకాపా ముఖ్య నాయకుల కాన్వయ్‌లు ఎందుకు తనిఖీలు చేయడం లేదు?
– మంగళగిరి పోలీసులు తాడేపల్లి ఆదేశాల పరంగా నడుచుకోవడం మానుకోవాలి
– తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

మంగళగిరి: ఎన్నికల తనిఖీల పేరుతో మంగళగిరి పోలీసులు నారా లోకేష్ కాన్వాయ్‌పై ప్రత్యేకంగా టార్గెట్ చేసి ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. ఒక రోజులో రెండు సార్లు, మూడు రోజుల్లో నాలుగు సార్లు లోకేష్ కాన్వాయ్‌ను ఆపి మంగళగిరి పోలీసులు చెక్ చేశారు. మార్చి 20 న ఉదయం 8 గంటలకు, 23న ఉదయం 8 గంటలకు, ఈరోజు ఉండవల్లి కరకట్ట వద్ద ఉదయం 8.10 కి, సాయంత్రం 5 గంటలకు లోకేష్ కాన్వాయ్ ఆపి తనిఖీలు చేశారు.

కోడ్ అమలులో భాగంగా తనిఖీ చేస్తున్నామని చెబుతున్నారు. కేవలం లోకేష్ వాహనాలను మాత్రమే ఆపాలని పోలీసులకు ఏమైనా ఆదేశాలు ఉన్నాయా? వైసిపి నేతల కార్లు ఎందుకు ఆపి చెక్ చేయడం లేదు? లోకేష్ కాన్వాయ్‌ను ఆపిన మాదిరి వైకాపా నాయకుల వాహనాలు ఆపి తనిఖీలు చేసి ఉంటే పోలీసులు ఆధారాలు చూపించాలి. మంగళగిరి పోలీసులు తాడేపల్లి ఆదేశాలతో పనిచేస్తున్నారో, లేక ఎన్నికల సంఘం ఆదేశాలతో పనిచేస్తున్నారో చెప్పాలి.

నియోజకవర్గంలో వివిధ గ్రామాల్లో లోకేష్ నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమాలు ఆపాలని జగన్ రెడ్డి ఆదేశాలు ఏమైనా ఉన్నాయా? తెలుగుదేశం నాయకులు వైకాపా నాయకుల మాదిరి కోడ్ ఉల్లంఘనలకు పాల్పడరు. కాన్వాయ్‌లో ఉన్న కార్లన్నింటినీ పోలీసులు తనిఖీ చేసినా లోకేష్ ఎంతో సహనంతో పోలీసులకు సహకరించారు. కాన్వాయ్‌లో కోడ్‌కు విరుద్ధంగా ఏమీ లేదని ఎన్నికల నిబంధనలకు అనుగుణంగానే ప్రచారం సాగుతోందని పోలీసులు నిర్ధారించారు.

మంగళగిరి పోలీసులు తాడేపల్లి ఆదేశాల పరంగా నడుచుకోవడం మానుకోవాలి. ఇకపై కావాలని, ఇష్టానుసారం లోకేష్ కాన్వాయ్‌ను ఆపి ఇబ్బందులకు గురిచేస్తే ఎన్నికల సంఘానికి పిర్యాదు చేస్తాం. లోకేష్ ప్రచారాన్ని అడ్డుకుంటున్న మంగళగిరి పోలీసులు ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా ఉన్న జగన్ రెడ్డి బొమ్మలు ఎందుకు తొలగించడం లేదు?

 

LEAVE A RESPONSE