Suryaa.co.in

Editorial

‘నాని’ తోకను ‘హన్మంతుడి’తో కట్ చేసిన జగన్

– గుడివాడలో కొడాలి నాని అవుట్
– కొత్తగా వెలసిన హన్మంతరావు ఫ్లెక్సీలు
– వైసీపీ అభ్యర్థి అంటూ ప్రచారం
– ఖంగుతిన్న కొడాలి బ్యాచ్
– కొడాలి కరివేపాకా అని అనుచరుల ఆగ్రహం
– జగన్ నిర్ణయంపై కొడాలి బ్యాచ్ కన్నెర్ర
– వాడుకుని వదిలేస్తారా అని ఫైర్
– తగిన బుద్ధి చెప్పారని రుసరుస
( మార్తి సుబ్రహ్మణ్యం)

రాష్ట్ర – జాతీయ స్థాయిలో బూతులమంత్రిగా ఖ్యాతి పొందిన గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని తోకను.. స్వయంగా పార్టీ అధినేత జగన్ తన మరో అనుచరుడైన, ‘హన్మంతరావు’ తో కట్ చేయించేందుకు సిద్ధమవుతున్నారన్న వార్త, గుడివాడ నాని శిబిరంలో భూకంపం పుట్టిస్తోంది. పురాణాలలో హన్మంతుడు లంకకు చిచ్చు పెడితే.. ఈ గుడివాడ హన్మంతుడు కొడాలి నాని టికెట్కు చిచ్చుపెట్టారన్నమాట. అదే ఇప్పుడు గుడివాడలో గుప్పుమన్న సంచలన వార్త.

అవును. మీరు వింటున్నది నిజమే. జగన్కు హార్డ్ కోర్ ఫ్యాన్ అయిన కొడాలి నాని.. తన చేయి కోస్తే అందులో వైసీపీ రక్తం ఉంటుందని, చాలాకాలం క్రితం సెలవిచ్చారు. జగన్ ప్రోత్సాహంతో నాని అసెంబ్లీలో-బయట, చంద్రబాబు కుటుంబంపై రెచ్చిపోయేవారు. అసెంబ్లీలో బాబు కుటుంబంపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి, వివాదాస్పదుడిగా మారారు.

కమ్మ కుల కోణంలో జగన్ కూడా, చంద్రబాబుపై కొడాలినే అస్త్రంగా సంధిస్తున్నారు. టీడీపీ కూడా నానిని లక్ష్యంగా, ఎదురుదాడి చేస్తోంది. క్యాసినో నుంచి గుడివాడలో జరిగే దందాలను బయటపెడుతోంది. ఈసారి నాని ఎట్టి పరిస్థితిలో అసెంబ్లీలో అడుగుపెట్టకూడదన్న లక్ష్యంతో కార్యాచరణ ప్రారంభించింది.

అంత జగన్ వీర భక్తుడికి.. స్వయంగా అదే జగన్ ఝలక్ ఇస్తారని ఎవరైనా ఊహించగలరా ? లేదు. కానీ ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతోందట. నాని పనయిపోయిందని, ఆయన అభ్యర్థిగా ఉంటే గుడివాడలో పార్టీకి ఓట్లు రాలవని ఐప్యాక్ జగన్కు సూచించిందట. దానితో ఎవరూ ఊహించని విధంగా, మండలి హన్మంతరావు అనే కాపు నేత తెరపైకి వచ్చారు. తెరపైకి వచ్చారనే కంటే.. జగనన్నే ఆయనను తెరపైకి తెచ్చారనడమే కరెక్టన్నది, కొడాలి బ్యాచ్ కన్నెర్ర.

అసలు ఈ హన్మంతరావు పేరు ఎలా వచ్చిందో తెలియక నాని బ్యాచ్కు అర్థం కావడం లేదట. మాకొత్తగా వెలసిన ఆయన ఫ్లెక్సీలను చూసిన తర్వాత అసలు ఏం జరుగుతుందో తెలియడం లేదట. సడన్ గా నానికి గట్టి మద్దతుదారైన ఈ హన్మంతుడు ఎలా తెరపైకి వచ్చారో తెలియక, నాని బ్యాచికి అర్ధం కాక బురబద్దలు కొట్టుకుంటున్నారట.

పైగా హన్మంతరావును సీఎంఓ అధికారులు పిలిచి మాట్లాడారన్న మరో ప్రచారం, నాని బ్యాచ్కు పుండుమీద కారం పూసినట్టయిందట. కొడాలిని జగన్ కరివేపాకులా వాడుకుని వదిలేశారని కొందరు.. జగన్ను గుడ్డిగా నమ్ముకున్నందుకు, నానికి తగిన గుణపాఠం జరిగిందని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారట. జగన్ సంగతి తెలియని కొడాలి.. అనవసరంగా అందరిపై నోరు పారేసుకుని, చివరకు సొంత కమ్మవర్గానికీ దూరమయి ఎవరికీ కాకుండా పోయారన్నది వారి అసలు బాధ.

అయితే ఇదంతా కొడాలి నాని ఆడుతున్న గేమ్లనేనని, స్థానిక వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. తనను ఓడించాలని ప్రయత్నిస్తున్న కమ్మ-కాపు నేతలను పక్కదారి పట్టించేందుకే, నాని వ్యూహాత్మకంగా హన్మంతరావు పేరు తెరపైకి తెచ్చారంటున్నారు. కొద్దిరోజుల్లో ఇదే హన్మంతరావు ప్రెస్మీట్ పెట్టి.. తాను నానికి మద్దతుగా పోటీ నుంచి విరమించుకున్నట్లు ప్రకటించినా, ఆశ్చర్యం లేదని జోస్యం చెబుతున్నారు. ఆలోగా జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు హన్మంతరావు ద్వారా, జనసేన వైపున్న కాపులను చీల్చడమే నాని అసలు లక్ష్యమంటున్నారు.

గతంలో జగన్ కోసం బట్టలు చించుకున్న కోటంరెడ్డి, శ్రీదేవి, కాపు రామచంద్రారెడ్డి, పార్ధసారధి, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి అండ్ కో లకు.. జగన్ నిర్దయగా టికెట్ చీటీ చించేసిన సంగతి సంగతి తెలిసిందే. ఇప్పుడు కొత్తగా కొడాలి నాని ఆ జాబితాలో చేరినట్టయింది. కథ పాతదే. అనుభవమే కొత్తది. మిగిలినదంతా సేమ్ టు సేమ్! చేసుకున్న వారికి చేసుకున్నంత మహదేవా అంటే ఇదేనేమో ?!

LEAVE A RESPONSE