Suryaa.co.in

Editorial

తెలంగాణలో కమలం- సైకిల్ కలుస్తాయా?

– తెలంగాణలో పొత్తు ఉందా? లేదా?
– ఖమ్మం సీటు కావాలంటున్న టీడీపీ
– కనీసం రెండయినా ఇవ్వాలంటున్న క్యాడర్
– పొత్తుంటేనే ఓట్ల బదిలీకి అవకాశం
– టీడీపీతో పొత్తుతో బీజేపీకే లాభం
– గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసిన టీడీపీ సెటిలర్లు
– పొత్తు లేకపోతే బీజేపీకి బదిలీ కాని ఓట్లు
– ఇప్పటికీ కాంగ్రెస్‌తో అనుబంధం కొనసాగిస్తున్న స్థానిక నేతలు
– స్పష్టత కోరుతున్న తెలంగాణ టీడీపీ నేతలు
– పొత్తు వద్దంటున్న కిషన్‌రెడ్డి?
( మార్తి సుబ్రహ్మణ్యం)

ఏపీలో టీడీపీ-బీజేపీ పొత్తు ఖరారైన నేపథ్యంలో.. మరి తెలంగాణలో బీజేపీతో పొత్తు ఉన్నట్లా? లేనట్లా? ఇదీ తెలంగాణ తమ్ముళ్ల సందేహం. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ కి దూరంగా ఉండటం.. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడును కేసీఆర్ మిత్రుడైన జగన్ సర్కారు అరెస్టు చేసిన ఆగ్రహంతో, తెలంగాణలోని టీడీపీ శ్రేణులు-సెటిలర్లు బీఆర్‌ఎస్-బీజేపీకి వ్యతిరేకంగా, కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓట్లు వే శారు.

ప్రధానంగా టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసిన పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై ఉన్న అభిమానంతో, అటు టీడీపీ శ్రేణులు-ఇటు సెటిలర్లు కాంగ్రెస్‌కు చేయెత్తి జైకొట్టారు.

తాజాగా ఏపీలో జరగనున్న అసెంబ్లీ-పార్లమెంటు ఎన్నికల్లో, బీజేపీ-టీడీపీ -జనసేన పొత్తులో పోటీ చేస్తున్నాయి. ఆ మేరకు బీజేపీకి 6 ఎంపీ, 10 అసెంబ్లీ సీట్లు కేటాయించారు. చిలకలూరిపేటలో మూడుపార్టీలు ఏర్పాటుచేస్తున్న భారీ బహిరంగసభకు ప్రధాని మోదీ కూడా హాజరవుతున్నారు.

ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా బీజేపీతో పొత్తు ఉంటుందా? లేదా అన్న అంశంపై స్పష్టత లేకపోవడం, టీడీపీ శ్రేణులను గందరగోళానికి గురిచేస్తోంది. బీజేపీ ఎంపీ సీట్లు ప్రకటిస్తున్న నేపథ్యంలో ఖమ్మం ఎంపీ ఖాళీగానే ఉంది. అక్కడ టీడీపీ అభ్యర్ధిని బరిలోకి దింపాలని టీడీపీ వర్గాలు సూచిస్తున్నాయి. తెలంగాణలో టీడీపీ బలహీనంగా ఉన్నప్పటికీ, ఖమ్మం జిల్లాలో మాత్రం ఇప్పటికీ బలంగా ఉందని, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సంపూర్ణ విజయానికి, టీడీపీనే కారణమని గుర్తు చేస్తున్నారు. అది కాకుండా మరో ఎంపీ సీటు తీసుకోవడం ద్వారా, మొత్తం 14 నియోజకవర్గాల్లో పార్టీ ఉనికి చాటుకునే అవకాశం వచ్చిందని విశ్లేషిస్తున్నారు.

ప్రధానంగా టీడీపీతో పొత్తు బీజేపీకే లాభమని స్పష్టం చేస్తున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటేనే ఓట్ల బదిలీ విజయవంతంగా జరుగుతుందని చెబుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ , రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో ఉన్న టీడీపీ క్యాడర్.. బీజేపీకి పనిచేస్తే అక్కడ బీజేపీ అభ్యర్ధుల విజయావకాశాలు మెరుగవుతాయంటున్నారు. ఇక నిజామాబాద్, నల్లగొండ, వరంగల్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లోని టీడీపీ ఓట్లు కూడా బీజేపీకి బదిలీ అవుతాయని విశ్లేస్తున్నారు.

అలాకాకపోతే, గత అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే.. మళ్లీ టీడీపీ క్యాడర్ కాంగ్రెస్‌కు ఓటు వేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానివల్ల తెలంగాణలో 12 ఎంపీ సీట్లు సాధించాలన్న బీజేపీ లక్ష్యానికి గండిపడుతుందని టీడీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌తో కుదిరిన బంధం.. అన్ని జిల్లాల్లో కొనసాగుతుందని, ఈ నేపథ్యంలో బీజేపీతో అధికారికంగా పొత్తు లేకపోతే ఓట్లు బదిలీ అసాధ్యమని స్పష్టం చేస్తున్నారు.

అదే బీజేపీతో పొత్తు కింద ఒకటి లేదా రెండు సీట్లు తీసుకుంటే, పార్టీ క్యాడర్ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి పనిచేసే అవకాశం ఉంటుందని టీడీపీ సీనియర్లు విశ్లేషిస్తున్నారు. అయినా ఒక జాతీయపార్టీ ఒకే పార్టీతో ఒక రాష్ట్రంలో పొత్తు పెట్టుకుని, మళ్లీ అదేపార్టీతో పక్కరాష్ట్రంలో మాత్రం పొత్తు పెట్టుకోకపోవడం విచిత్రంగా ఉందని పార్టీ నేతలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా.. టీడీపీతో పొత్తును బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యతిరేకిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గతంలో కూడా టీడీపీతో పొత్తు ఉండదని తొలుత ప్రకటించిన బీజేపీ నేత కిషన్‌రెడ్డి కావడం విశేషం. అయితే నిజానికి ఉమ్మడి రాష్ట్రంలో, విభజన తర్వాత తెలంగాణలో బీజేపీకి అన్ని సీట్లు రావడానికి టీడీపీ పొత్తే కారణమని విశ్లేషిస్తున్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ పొత్తులో టీడీపీ 15-బీజేపీ 5 అసెంబ్లీ స్థానాలు గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

దానికంటే ముందు.. టీడీపీ తెలంగాణ శాఖకు అధ్యక్షుడిని, ఎన్నికల ముందు ప్రకటించాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. కాసాని నియమించిన వారే ఇంకా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారని, ఇటీవల ఎవరి అనుమతి లేకుండానే అనుబంధ సంస్థ విభాగం పదవీ ప్రమాణం జరిగిందని గుర్తుచేస్తున్నారు. అసలు అధ్యక్షుడు రాజీనామా చేసి, కార్యవర్గమే రద్దయిపోతే.. పాత అధ్యక్షుడు కాసాని నియమించిన అనుబంధసంఘ అధ్యక్షుడు ఎలా ప్రమాణస్వీకారం చేస్తారని పార్టీ నేతలు ప్రశ్నిస్తున్నారు.

నల్లగొండకు చెందిన ఒక నాయకుడు.. వ్యక్తిగత ఉత్సాహంతో చేసిన ఆ కార్యక్రమం వివాదంగా మారడంతో, తెలంగాణ ఇన్చార్జి కంభంపాటి రామ్మోహన్ మధ్యలోనే వెళ్లిపోయారు. కాగా పార్టీలో ఉన్న కొందరు నేతలు ఇంకా కాసానితో సంబంధాలు కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సమయంలో పార్టీకి ఒక సారథిని నియమించడం అవసమంటున్నారు.

LEAVE A RESPONSE